ETV Bharat / business

ట్విటర్‌ ‘వై ఈజ్‌ దిస్‌ ట్రెండింగ్’..?

author img

By

Published : Sep 6, 2020, 9:24 PM IST

ప్రపంచంలో ట్రెండింగ్​ అవుతున్న అంశాలపై వివరణ ఇచ్చేందుకు ట్విట్టర్ కొత్త ఫీచర్​ అందుబాటులోకి తీసుకురానుంది. ఒక అంశం ఎందుకు ట్రెండ్ అవుతుందనేది వివరిస్తూ పిన్‌ ట్వీట్స్‌ లేదా డిస్క్రిప్షన్‌ను వాటికి జోడించనుంది. దాని వల్ల నెటిజన్లు ఆ అంశం ఎందుకు ట్రెండింగ్‌లో ఉందనేది సులభంగా అర్థం చేసుకుంటారని కంపెనీ తెలిపింది.

Twitter to introduce new feature which will explain trends
ట్విటర్‌ ‘వై ఈజ్‌ దిస్‌ ట్రెండింగ్’..?

భావ వ్యక్తీకరణకు సామాజిక మాధ్యమాలు వేదికగా పనిచేస్తాయి. ఇందులో ట్విటర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ట్విటర్‌ ఓపెన్‌ చేయగానే ఆ రోజులో ఏయే అంశాల గురించి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు, ఏయే విషయాలు ట్రెండింగ్‌లో ఉన్నాయనేది ఒక జాబితా రూపంలో మనకు సూచిస్తుంది. వాటిలో కొన్ని ప్రపంచవ్యాప్తంగా ఆ రోజు జరిగిన సంఘటనలైతే ఎలాంటి ప్రాముఖ్యం లేని అంశాలు కూడా ట్రెండ్‌ అవుతుంటాయి.

అయితే అవి ఎందుకు ట్రెండ్ అవుతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా వాటి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారనేది చాలా మందిని యూజర్స్‌ని వేధించే ప్రశ్న. అలా ‘వై ఈజ్‌ దిస్‌ ట్రెండింగ్’ (Why Is This Trending?) అనే పదాన్ని ఇప్పటి వరకు 5 లక్షల సార్లు ట్వీట్ చేశారట. దీంతో ట్విటర్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక అంశం ఎందుకు ట్రెండ్ అవుతుందనేది వివరిస్తూ పిన్‌ ట్వీట్స్‌ లేదా డెస్క్రిప్షన్‌ను వాటికి జోడించనుంది. దాని వల్ల నెటిజన్లు ఆ అంశం ఎందుకు ట్రెండింగ్‌లో ఉందనేది సులభంగా అర్థం చేసుకుంటారని కంపెనీ తెలిపింది.

ఇందుకోసం ట్విటర్‌ అల్గారిథమ్‌, ట్విటర్ క్యూరేషన్ కలయికతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం ట్రెండ్‌ అవుతున్న అంశం ప్రాముఖ్యత ఏంటి, అది ఎంత మేర ప్రజాదరణ పొందిందనేది పరిశీలించి ట్రెండ్ జాబితాలో ఉండాలా? లేదా అనేది నిర్ణయిస్తుంది. అంతేకాకుండా సదరు అంశం స్పామ్‌ పరిధిలోకి వస్తుందా, దాని వల్ల సమాజానికి ఏదైనా హాని ఉందా అనేది కూడా విశ్లేషిస్తుంది. త్వరలోనే ఈ ఫీచర్‌ పరిచయం చేయనున్నట్లు ట్విటర్ వెల్లడించింది. ఇప్పటికే రిప్రజెంటేషన్ ట్వీట్లకు ఈ సదుపాయం ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతానికి న్యూజిలాండ్, అర్జెంటీనా, బ్రిటన్, అమెరికా, జపాన్‌, భారత్, కెనడాలతో పాటు మొత్తం 17 దేశాల్లో దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇదీ చూడండి: స్వచ్ఛంద పదవీ విరమణకు ఎస్​బీఐ ఉద్యోగులు సిద్ధమేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.