ETV Bharat / business

Home Loan EMI: గృహరుణ వాయిదాల భారం తప్పించుకోవడం ఎలా?

author img

By

Published : Dec 3, 2021, 12:27 PM IST

Home Loan EMI: సొంత ఇల్లు.. చాలామంది కల. దీన్ని నెరవేర్చుకునే క్రమంలో గృహరుణం తీసుకోవడం సర్వసాధారణం. తక్కువ వడ్డీ రేట్లు ఉండటం, ఇళ్ల ధరలూ కాస్త అందుబాటులోనే కనిపిస్తుండటంతో ఎంతోమంది ఇల్లు కొనడానికి సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో గృహరుణ వాయిదాల భారాన్ని తప్పించుకోవడం ఎలా? అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

Home Loan EMI
Home Loan EMI, గృహరుణాలు

Home Loan EMI: గృహరుణం తీసుకోవాలని అనుకున్నప్పుడు ఒకసారి పూర్తిస్థాయి ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. సంపాదనలో దాదాపు 40 శాతం వరకూ రుణ ఈఎంఐకి కేటాయించాల్సి వచ్చినప్పుడు.. మిగతా మొత్తంతో ఎలా సర్దుకోవాలి అనేది చూసుకోవాలి. తొందరగా ఈఎంఐ భారం నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి. అందుకోసం..

ఒక వాయిదా అదనంగా..

సాధారణంగా ఏడాదికి 12 వాయిదాలు చెల్లిస్తుంటాం. కానీ, మన అప్పు తొందరగా తీరాలంటే.. ఏడాదికి 13 వాయిదాలు చెల్లించాలి. అనుకోకుండా మనకు వచ్చిన అదనపు డబ్బు లేదా ఖర్చులను తగ్గించుకోవడం వల్ల మిగిలిన మొత్తంలాంటివి ఈ అదనపు ఈఎంఐ కోసం కేటాయించాలి. దీనివల్ల మీ రుణ మొత్తంలో అసలు తగ్గిపోతుంది. అనుకున్న వ్యవధికన్నా ముందే అప్పు తీర్చేందుకు వీలవుతుంది. వడ్డీ భారమూ తగ్గుతుంది. బ్యాంకులు, గృహరుణ సంస్థలు ఫ్లోటింగ్‌ రేటుకు అందించిన గృహరుణాలపై ఎలాంటి ముందస్తు చెల్లింపు రుసుమునూ వసూలు చేయవు. ఈఎంఐలను ముందుగానే చెల్లిస్తూ ఉండటం వల్ల మీ క్రెడిట్‌ స్కోరూ మెరుగవుతుంది.

ఖర్చులకు సరిపోవడం లేదా..

ఇంటిరుణం ఈఎంఐ చెల్లించిన తర్వాత మిగిలిన మొత్తం ఇంటి ఖర్చులకు సరిపోవడం లేదా.. దీని గురించి ఆందోళన చెందకండి. ఇటీవల కాలంలో వడ్డీ రేట్లు తగ్గడంతో మీ రుణ వ్యవధిలోనూ తేడా వచ్చింది. మీ బ్యాంకు/గృహరుణ సంస్థను సంప్రదించి ఈ వివరాలు ఒకసారి చూసుకోండి. వ్యవధిని పెంచి, ఈఎంఐని తగ్గించే అవకాశాలుంటాయి. దీన్ని వినియోగించుకునే అవకాశం ఎంతమేరకు ఉందో చూసుకోండి. దీనివల్ల మీ ఖర్చులకు ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. ఆదాయం పెరిగినప్పుడు వీలును బట్టి, ఈఎంఐని అధికంగా చెల్లించడం మర్చిపోవద్దు.

అప్పుడప్పుడూ..

Debt Relief: ఏదైనా ఆస్తి అమ్మడం, లేదా వారసత్వంగా కొన్నిసార్లు అనుకోకుండా పెద్ద మొత్తంలో డబ్బు మీ చేతికి రావొచ్చు. ఇలాంటప్పుడు మీరు ఆ డబ్బును గృహరుణం అసలుకు జమ చేయొచ్చు. దీనివల్ల తొందరగా రుణ భారం నుంచి విముక్తులవుతారు. వడ్డీ చెల్లింపు గణనీయంగా తగ్గుతుంది.

బదిలీ చేసుకోండి..

Reduce the Burden of Installments: ప్రస్తుతం గృహరుణ రేట్లు ఎన్నడూ లేనంత తక్కువకు లభిస్తున్నాయి. మీరు తీసుకున్న రుణానికి ఇంకా అధిక వడ్డీ చెల్లిస్తుంటే.. మీరు ఆ రుణాన్ని ఇతర బ్యాంకుకు మార్చుకునేందుకు ప్రయత్నించవచ్చు. తక్కువ వడ్డీ రేటు ఉంటే.. ఈఎంఐ భారమూ తగ్గుతుంది. అయితే, ఇలా మార్చుకునేటప్పుడు ఫీజులు, ఇతర రుసుములనూ పరిశీలించండి. వడ్డీ రేటు తగ్గే ప్రయోజనం కన్నా.. ఈ ఫీజులు అధికంగా ఉంటే మారకపోవడమే ఉత్తమం.

వచ్చిన ఆదాయంలో 40శాతానికి మించి రుణ వాయిదాలు ఉండకూడదు. అధిక ఈఎంఐల భారం ఉన్నప్పుడు మిగిలిన ఆర్థిక లక్ష్యాల సాధన కష్టమవుతుంది. కాబట్టి, వీలైనంత వరకూ వాయిదాల భారం తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.

ఇవీ చూడండి: రుణం తీసుకోవాలా? ఏ అవసరానికి ఏది​ బెటర్?

జనవరి నుంచి ఆ కార్లు మరింత కాస్ట్​లీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.