ETV Bharat / business

Galwan Clash: 'మేడ్ ఇన్​ చైనా వస్తువులు మాకొద్దు'

author img

By

Published : Jun 15, 2021, 1:46 PM IST

భారతీయ వినియోగదారుల్లో చైనా వస్తువులపై అయిష్టత పెరిగినట్లు ఓ సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా గత ఏడాది జరిగిన గల్వాన్‌ ఘటన తర్వాత 43శాతం మంది భారతీయులు చైనాలో తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేయలేదని సర్వే వివరించింది.

Indians avoided Made in China products
చైనా వస్తువులపై తగ్గిన ఆసక్తి

చైనాతో గల్వాన్‌ లోయలో ఘర్షణ(Galwan valley clash) తర్వాత భారతీయ వినియోగదారుల తీరులో మార్పు వస్తోంది. చాలా మంది చైనా తయారీ వస్తువులకు(China products in India) ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో చైనా వస్తువులు విరివిగా కొనుగోలు చేసిన వారు కూడా ఇప్పుడు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇటీవల ఒక కమ్యూనిటీ సోషల్‌ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తెలిసింది.

యాప్​ల నిషేధంతో ఆజ్యం..

'లోకల్‌ సర్కిల్‌' అనే కమ్యూనిటీ సోషల్‌ మీడియా సంస్థ ఇటీవల ఒక సర్వే నిర్వహించింది. గత 12 నెలల్లో చైనా వస్తువుల కొనుగోళ్ల విషయంలో భారతీయులు అనాసక్తిగా ఉన్నట్లు దానిలో తేలింది. ఈ సర్వేలో 43శాతం మంది భారతీయులు చైనాలో తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేయలేదని వెల్లడించారు. గతంలో ఆ వస్తువులు ఎక్కువగా కొన్నవారు కూడా ఇటీవల బాగా తగ్గించినట్లు తెలిపారు. ముఖ్యంగా గల్వాన్‌ ఘటన తర్వాత భారత్‌లో 'బాయ్‌కాట్‌ చైనా'(Boycott China) నినాదం ఊపందుకుంది. ఈ ప్రభావంతోనే విక్రయాలు తగ్గినట్లు భావిస్తున్నారు. అంతేకాదు.. భారత ప్రభుత్వం కూడా 'టిక్‌టాక్‌'(Tiktok ban), 'అలీఎక్స్‌ప్రెస్‌' వంటి 200 చైనా యాప్స్‌ను నిషేధించడం దీనికి ఆజ్యం పోసింది.

అయిష్టతకు కారణమదే..

గత నవంబర్‌లో పండగ సీజన్‌లో 71శాతం మంది ప్రజలు చైనా వస్తువులను కొనుగోలు చేయలేదని 'లోకల్‌ సర్కిల్‌' సర్వే పేర్కొంది. ధర తక్కువగా ఉండటం, ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే కొనుగోలు చేసినట్లు మిగిలిన వారు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 281 జిల్లాల్లో 18,000 మంది అభిప్రాయాలను సేకరించి ఈ సర్వే నిర్వహించారు. 2020లో లద్దాఖ్‌లో జరిగిన ఘర్షణలు.. చైనా వస్తువులపై అయిష్టతను పెంచినట్లు సర్వే వెల్లడించింది.

ఇదీ చదవండి:ఎయిర్‌టెల్‌ 5జీ ట్రయల్స్‌ షురూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.