ETV Bharat / business

ఐపీఓల్లో మదుపు.. ఇవన్నీ చూశాకే..

author img

By

Published : Mar 19, 2021, 9:50 AM IST

గత కొంతకాలంగా స్టాక్‌ మార్కెట్లో తొలి పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)లు సందడి చేస్తున్నాయి. ఇప్పటికే వచ్చిన కొన్ని సంస్థల ఐపీఓలు మార్కెట్లో ఘనంగా నమోదయ్యాయి. కొత్తగా చిన్న, పెద్ద కంపెనీలు మార్కెట్లోకి తమ అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మదుపరులు ఇప్పటికే నమోదైన షేర్లను కాదని.. ఐపీఓలను ఎంచుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. తెలుసుకుందాం..

Precautions to be taken for investing in IPO
ఐపీఓల్లో పెట్టుబడులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఈ మధ్య కాలంలో వచ్చిన తొలి పబ్లిక్‌ ఇష్యూలకు చిన్న, పెద్ద మదుపరుల నుంచి మంచి స్పందన లభించింది. మార్కెట్‌ జోరుమీద ఉండటం సహా నిబంధనలు మారడమూ ఇందుకు కారణం. ఐపీఓలో షేర్లు కేటాయించేందుకు ఎక్కువ సమయం పట్టకపోవడం, డబ్బు ఎక్కువ రోజులు ఉంచాల్సిన అవసరం లేకపోవడం వల్ల తక్కువ సమయంలోనే వచ్చిన ఐపీఓలన్నింటికీ దరఖాస్తు చేసేందుకు వీలవుతోంది. అంతేకాకుండా.. చాలా ఐపీఓలు లిస్టింగ్‌ నాడు ఆకర్షణీయమైన లాభాలను ఇచ్చాయి. అనేక మంది ఐపీఓలకు ఆకర్షితులు కావడానికి దోహదం చేస్తోంది. అయితే, మదుపరులు ఒక ఐపీఓలో మదుపు చేసేటప్పుడు ఏం చేయాలి.. ఏం చేయకూడదనేది గమనిద్దాం..

ఏం చేయాలి?

  • ప్రతి పెట్టుబడి పథకాన్ని అధ్యయనం చేసినట్లే.. ఐపీఓకి వచ్చిన సంస్థనూ పూర్తిగా విశ్లేషించాలి. ఆ సంస్థ గురించి మీకు సాధ్యమైన మేరకు పరిశోధించండి. ఆ సంస్థ చేసే వ్యాపారం.. ప్రమోటర్లు, ఆర్థిక వివరాలు, పోటీ ఎవరున్నారు.. వ్యాపారాభివృద్ధికి ఉన్న అవకాశాలు.. ఇలా ప్రతి విషయాన్నీ స్పష్టంగా అవగాహన చేసుకోండి.
  • కంపెనీ ఇచ్చే డ్రాఫ్ట్‌ ప్రాస్పెక్టస్‌ను పరిశీలించండి. ఇందులో సంస్థకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. ప్రమోటర్ల గురించీ మనకు అర్థం అవుతుంది. ఇష్యూ వివరాలతో పాటు, అందులో ఉండే నష్టభయాలేమిటో తెలుసుకోవచ్చు. కంపెనీ వాస్తవంగా ఎలాంటి అభివృద్ధి సాధించగలదనే విషయాన్నీ దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు.
  • ఐపీఓ ద్వారా సమీకరించిన డబ్బును కంపెనీ ఎందుకోసం ఉపయోగిస్తుందో తెలుసుకోవాలి. వర్కింగ్‌ క్యాపిటల్‌, వేరే కంపెనీల స్వాధీనం, విస్తరణ, అప్పులను తీర్చడంలాంటి పనులకు సాధారణంగా ఈ మొత్తాలను వినియోగిస్తుంది. కాబట్టి, మనం పెడుతున్న పెట్టుబడిని సంస్థ అభివృద్ధి కోసం వాడుతుందా లేదా ఇతర అవసరాలకా అనేది చూడాలి.
  • సెబీ ద్వారా గుర్తింపు పొందిన క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలు ఆ ఐపీఓ గురించి ఏం చెబుతున్నాయన్నదీ పరిశీలించాలి.
  • లిస్టింగ్‌ ధరను పరిగణించాలి. ఆ సంస్థ ఉన్న రంగంలోని ఇతర కంపెనీల షేర్ల ధరలను పోల్చి చూడాలి. ఆయా సంస్థల మధ్య ఇతర అంశాల్లో ఎలాంటి పోలిక ఉందో గమనించాలి.
  • ఒక కంపెనీ విలువను నిర్ణయించే కీలక అంశాలైన ఈపీఎస్‌, పీ/ఈ, బుక్‌ వాల్యూ, డివిడెండ్‌ ఈల్డ్‌లాంటివి ఎలా ఉన్నాయన్నది చూసుకోవాలి. అదే రంగంలో ఉన్న ఇతర సంస్థలతో పోల్చి చూడాలి. భవిష్యత్తులో ఆదాయాలు ఎలా ఉంటాయి.. ఆ సంస్థకున్న రుణభారాల గురించి ఆరా తీయాలి.
  • ఐపీఓకి వచ్చిన సంస్థ వ్యాపారాన్ని ఎలా నిర్వహించింది, దానిపై ఏమైనా న్యాయ వివాదాలున్నాయా?ఆ రంగం పనితీరు ఇప్పటి వరకూ ఎలా ఉంది? భవిష్యత్తులో దాని వృద్ధి పరిస్థితి ఏమిటి?లాంటివీ ఐపీఓలో మదుపు చేసేటప్పుడు కీలకమే.

ఇవి చేయొద్దు..

  • ఐపీఓకి సంబంధించి జరిగే విపరీతమైన ప్రచారాన్ని నమ్మొద్దు. దాని ప్రభావంతో మదుపు నిర్ణయం తీసుకోవడం పొరపాటు.
  • గత కొన్ని నెలలుగా మార్కెట్‌ సూచీలు వృద్ధి దశలో పయనిస్తున్నాయి. దీనివల్ల కొన్ని ఐపీఓలు లిస్టింగ్‌ రోజున మంచి లాభాలను పంచాయి. అంతమాత్రాన ప్రతి కంపెనీ ఇలాగే ఉంటుందని భావించకూడదు. ఐపీఓకి వచ్చిన సంస్థ దేనికదే ప్రత్యేకం అనే విషయాన్ని విస్మరించకూడదు.
  • ఒకే విభాగానికి చెందిన కంపెనీలతో పోలిస్తే.. ఐపీఓకి వచ్చిన సంస్థ షేరు ధర తక్కువగా ఉండవచ్చు. అంతమాత్రాన ఆ ఐపీఓకి దరఖాస్తు చేసేందుకు అది ప్రాతిపదిక కాకూడదు. మంచి ఫండమెంటల్స్‌ ఉన్న సంస్థనే ఎప్పుడూ ఎంచుకోవాలి.
  • నష్టభయం ఏమాత్రం భరించలేని వారు.. ఈక్విటీలకు దూరంగా ఉండటమే మేలు. ఐపీఓలకూ ఇదే సూత్రం వర్తిస్తుంది.
  • చాలామంది ఒక ఐపీఓకి దరఖాస్తు చేసినప్పుడు అది ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అవుతుంటుంది. దీన్ని చూసి కొంతమంది దానిలో మదుపు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. దరఖాస్తులు ఎక్కువగా వచ్చినంత మాత్రాన ఆ షేరు ధర నమోదు సమయంలో, దీర్ఘకాలంలో పెరుగుతుందని భావించడం పొరపాటే.
  • ప్రతి పెట్టుబడికీ ఒక ఆర్థిక లక్ష్యాన్ని ముడిపెట్టాలి. ఈ సూత్రం తొలి పబ్లిక్‌ ఇష్యూకీ వర్తిస్తుంది. ఐపీఓకి వచ్చే సంస్థలు మార్కెట్‌కు కొత్తవి. కాబట్టి, వాటి శక్తిసామర్థ్యాలు ఇంకా నిరూపణ కావు. అందుకే, ఐపీఓలో మదుపు చేసేటప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. సరైన నిర్ణయం తీసుకుంటున్నాను.. అనే సమాధానం వస్తేనే ముందడుగు వేయడం మేలు.

- జె.వేణుగోపాల్, జెన్‌మనీ

ఇదీ చదవండి:'టీకా దుష్ప్రభావాలకు బీమా వర్తిస్తుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.