ETV Bharat / business

మ్యూచువల్ ఫండ్స్​లో 12% రాబడి రావాలంటే ఎలా?

author img

By

Published : Oct 8, 2021, 2:24 PM IST

మ్యూచువల్ ఫండ్స్​, బీమా పాలసీ, స్టాక్​ మార్కెట్లు, గోల్డ్​ ఈటీఎఫ్​ వంటి విషయాల్లో మనకు ఎన్నో సందేహాలు ఎదురవుతుంటాయి. అలాంటి కొన్ని సందేహాలకు ఆర్థిక నిపుణులు ఇలా సమాధానమిస్తున్నారు. వాటిని మీరు చదివేయండి..

finacial doubts
ఆర్థికపరమైన సందేహాలకు సమాధానాలు

మ్యూచువల్ ఫండ్స్​, బీమా పాలసీ, స్టాక్ మార్కెట్లలో మనకు తరుచూ ఎదురయ్యే ప్రశ్నలకు నిపుణులు ఏం సమాధానమిస్తున్నారంటే..

  • ప్రశ్న: నేను నెలకు రూ.5వేల చొప్పున రికరింగ్‌ డిపాజిట్‌ చేస్తున్నాను. గతంతో పోలిస్తే ఇప్పుడు వడ్డీ రేట్లు బాగా తగ్గాయి. దీనికి బదులుగా కనీసం 12 శాతం వరకూ రాబడి వచ్చేలా మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకోవచ్చా? నష్టభయం లేకుండా ఉండే పథకాలు ఏముంటాయి? - నరేశ్‌

జవాబు: ప్రస్తుతం మన దగ్గర వడ్డీ రేట్లు కనీస స్థాయికి వచ్చాయి. సురక్షితమైన పథకాల పైన 5% - 6.5% వరకూ వడ్డీ వస్తోంది. నష్టభయం లేకుండా ఉండాలంటే.. మీకు వచ్చే రాబడి 5% - 6.5% మధ్యే ఉంటుంది. కాబట్టి, మీకు 12 శాతం రాబడి రావాలంటే.. నష్టభయంతో ఉన్న పెట్టుబడి పథకాలతోనే సాధ్యం అవుతుంది. దీనికి మీరు డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లను ఎంచుకోవచ్చు. వీటిలో 12% - 13% వచ్చే అవకాశం ఉంది. నష్టభయం లేకుండా అంటే బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రికరింగ్‌ డిపాజిట్లు, పోస్టాఫీసు పొదుపు పథకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

  • ప్రశ్న: మా అమ్మ పేరుమీద ఉన్న బీమా పాలసీ నుంచి రూ.4 లక్షల వరకూ వచ్చాయి. ఈ మొత్తాన్ని మరో నాలుగేళ్లదాకా ఎక్కడైనా జమ చేసి, మొత్తం డబ్బును ఒకేసారి తీసుకోవాలనేది ఆలోచన. దీనికోసం ఎలాంటి పథకాలను ఎంచుకోవాలి? - విజయ్‌

జవాబు: మీ పెట్టుబడిపైన మంచి రాబడి రావాలంటే.. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం మంచిది. మీరు మదుపు చేద్దామని అనుకుంటున్న రూ.4 లక్షలను రెండు మంచి హైబ్రీడ్‌ ఈక్విటీ ఫండ్లలో ఎస్‌టీపీ ద్వారా వచ్చే ఆరు నెలల కాలానికి మదుపు చేయండి. కనీసం 10 శాతం వరకూ రాబడిని ఆశించవచ్చు. కాస్త నష్టభయం ఉంటుందని మర్చిపోవద్దు.

  • ప్రశ్న: నాలుగేళ్ల తర్వాత అవసరాల కోసం ఇప్పటి నుంచే బంగారంలో మదుపు చేయాలని ఆలోచన. గోల్డ్‌ ఈటీఎఫ్‌, గోల్డ్‌ ఫండ్లలో వేటిని ఎంపిక చేసుకోవాలి? నెలకు రూ.10 వేలు మదుపు చేయొచ్చా? - ప్రశాంతి

జవాబు: బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు గోల్డ్‌ ఈటీఎఫ్‌ లేదా గోల్డ్‌ ఫండ్ల ద్వారా మదుపు చేసేందుకు వీలుంటుంది. గోల్డ్‌ ఈటీఎఫ్‌ల ద్వారా మదుపు చేసేందుకు మీకు డీమ్యాట్‌ ఖాతా ఉండాలి. ఒక్క గోల్డ్‌ ఈటీఎఫ్‌ యూనిట్‌.. ఒక గ్రాము బంగారంతో సమానంగా ఉంటుంది. ప్రత్యామ్నాయంగా గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్ల ద్వారా మదుపు చేసుకోవచ్చు. దీనికి డీమ్యాట్‌ ఖాతా అవసరం లేదు. వీటిల్లో కనీసం రూ.500 నుంచీ పెట్టుబడి పెట్టొచ్చు. మీరు రెండు మంచి గోల్డ్‌ ఫండ్లు ఎంచుకొని, క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయండి.

  • ప్రశ్న: నేను ఇప్పటి వరకూ ఎలాంటి పెట్టుబడులూ పెట్టలేదు. స్టాక్‌ మార్కెట్లో మదుపు చేసేందుకు ఇప్పుడు సరైన సమయమేనా? దీనికోసం నెలకు రూ.15 వేల వరకూ కేటాయించగలను. ఎలాంటి షేర్లను ఎంచుకోవాలి? - హరీశ్‌

జవాబు: స్టాక్‌ మార్కెట్లో మదుపు చేసేందుకు సరైన సమయం అంటూ ఏదీ ఉండదు. నేరుగా షేర్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటే.. మార్కెట్‌ పనితీరుపై పూర్తిగా అవగాహన ఉండాలి. తగినంత సమయం కేటాయించాలి. షేర్ల కదలికలను గమనిస్తూ ఉండాలి. కనీసం 7-10 ఏళ్లపాటు అవసరం లేని డబ్బునే ఈ పెట్టుబడులకు ఉపయోగించాలి. ప్రస్తుతం మార్కెట్లు కొంత అధిక స్థాయుల వద్ద ఉన్నాయి. మీరు నెలనెలా మదుపు చేయాలనుకుంటున్నారు కాబట్టి, ప్రత్యామ్నాయంగా డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయండి. మీరు నెలకు రూ.15 వేలను 10 ఏళ్లపాటు మదుపు చేస్తే.. 13శాతం రాబడి అంచనాతో.. రూ.33,15,554 అయ్యేందుకు వీలుంది.

- తుమ్మ బాల్‌రాజ్‌

ఇదీ చూడండి: ఐఎంపీఎస్​తో ఇకపై రూ.5లక్షల వరకు బదిలీ

ఇదీ చూడండి: ఈఎంఐలు భారంగా మారాయా? అయితే ఇది మీకోసమే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.