ETV Bharat / business

నెగెటివ్‌ వచ్చినా.. పాలసీ కోసం వేచి చూడాల్సిందే!

author img

By

Published : May 7, 2021, 10:52 AM IST

corona, policy
నెగెటివ్‌ వచ్చినా.. పాలసీ కోసం వేచి చూడాల్సిందే!

కరోనాతో దేశం కకావికలం అవుతోంది. దీంతో బీమా సంస్థలు కొంత వెనకడుగు వేస్తున్నాయి. పాజిటివ్ వచ్చిన వ్యక్తికి ఆరోగ్య, జీవిత బీమా తీసుకునేందుకు సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. కొవిడ్‌ పాజిటివ్‌గా తేలిన వ్యక్తి.. ఇంట్లో చికిత్స తీసుకున్నా.. ఆసుపత్రిలో చేరినా... వారికి కనీసం 2 నుంచి 6 నెలల తర్వాతే పాలసీలను ఇస్తామంటున్నాయి బీమా సంస్థలు.

కరోనా రెండో దశ విజృంభిస్తోంది. ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. ప్రతి ఒక్కరిపైనా ఇది తన ప్రతాపాన్ని చూపిస్తోంది. కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తి ఆరోగ్య, జీవిత బీమా పాలసీలు తీసుకుందామన్నా సాధ్యం కాని పరిస్థితికి తీసుకొచ్చింది.

ఇప్పటి వరకూ ఎలాంటి బీమా పాలసీలు లేని వారు కొత్తగా ఆరోగ్య, జీవిత బీమా పాలసీలు తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఇందులో కొవిడ్‌ బారిన పడిన వారు అధికంగా ఉంటున్నారన్నది వాస్తవం. కానీ, ఇక్కడే బీమా సంస్థలు కొత్త నిబంధనలను తీసుకొస్తున్నాయి. కొవిడ్‌ పాజిటివ్‌గా తేలి, ఇంట్లో చికిత్స తీసుకున్నా.. ఆసుపత్రిలో చేరినా... వారికి కనీసం 2 నుంచి 6 నెలల తర్వాతే పాలసీలను ఇస్తామంటున్నాయి.

  • కొత్తగా ఆరోగ్య పాలసీని తీసుకోవాలనుకునే వారు.. తమ ఆరోగ్య వివరాలన్నీ చెప్పాల్సి వస్తోంది. బీమా సంస్థలు కరోనా నెగెటివ్‌ రిపోర్టునూ అడుగుతున్నాయి. ఒకవేళ ఇప్పటికే పాజిటివ్‌ వచ్చిన వారికి పాలసీ కోసం దరఖాస్తు చేసుకోగానే కొత్త నిబంధనలను తెరపైకి తెస్తున్నాయి. ఆరోగ్య పరీక్షల నివేదికల తర్వాత పాలసీని ఇవ్వాలా, వద్దా అని నిర్ణయిస్తున్నాయి. కొన్నిసార్లు పూర్తిగా తిరస్కరించడం లేదా ఏ తేదీ నుంచి వర్తిస్తుందో చెబుతున్నాయి. కొవిడ్‌ నుంచి కోలుకున్నా.. బీమా సంస్థలు అడిగే పరీక్షలకు సిద్ధంగా ఉండాల్సి వస్తోంది. సాధారణంగా బీమా సంస్థలు 45 ఏళ్లు దాటిన వారికి సాధారణంగానే ఆరోగ్య పరీక్షలు అడుగుతారు. కానీ, కొవిడ్‌ బాధితులకు కొన్ని బీమా సంస్థలు పరీక్షలు తప్పనిసరి చేస్తున్నాయి. దీర్ఘకాలంలో ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయని చెబుతుండటంతో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు బీమా సంస్థలు చెబుతున్నాయి. కొన్ని బీమా సంస్థలు ఇలా వేచి ఉండే నిబంధనేమీ లేకుండానే పాలసీని అందిస్తున్నాయి. కానీ, కొన్ని నిబంధనలను విధిస్తున్నాయి. కొవిడ్‌-19 సోకని వారు పాలసీ తీసుకున్న తర్వాత 15 రోజుల తర్వాత కరోనా పాజిటివ్‌గా తేలితేనే చికిత్స ఖర్చును చెల్లిస్తామని బీమా కంపెనీలు అంటున్నాయి. కాబట్టి, వీలైనంత తొందరగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడమే మేలు.
  • జీవిత బీమా పాలసీల విషయంలోనూ బీమా సంస్థలు ఇలాంటి నిబంధనే విధిస్తున్నాయి. కొన్ని బీమా సంస్థలు 60 నుంచి 90 రోజుల తర్వాతే జీవిత బీమాను ఇస్తాయని చెబుతున్నాయి. దీంతోపాటు పాలసీ తీసుకునే వారు వ్యాక్సిన్‌ తీసుకున్నారా లేదా అనేదీ చూస్తున్నాయి.

ఇదీ చూడండి: బజాజ్​ హెల్త్​ కేర్​ నుంచి కరోనా ఔషధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.