ETV Bharat / business

క్రెడిట్ లిమిట్ పెంచుకుంటే లాభమా- నష్టమా?

author img

By

Published : Mar 2, 2021, 7:14 PM IST

Credit card: Should you accept offer to raise credit limit?
క్రెడిట్ లిమిట్ పెంచుకుంటే లాభమా-నష్టమా?

'మీ పేరు మీద క్రెడిట్ కార్డు ఆఫర్ ఉందండి. ఇప్పుడున్న కార్డుకు డబుల్, త్రిబుల్ క్రెడిట్ లిమిట్ ఇస్తాం. 4 రోజుల్లో కార్డు మీ చేతుల్లో ఉంటుంది.' ఇవి తరచూ క్రెడిట్ కార్డు ఆఫర్లకు సంబంధించిన ప్రతినిధులు ఫోన్ల ద్వారా వినియోగదారులకు చెప్పే మాటలు. ఎక్కువ క్రెడిట్ లిమిట్ ఉన్న కార్డులు తీసుకోవటం ప్రయోజనమా? నష్టమా?

సాధారణంగా బ్యాంకులు తక్కువ లిమిట్​తో క్రెడిట్ కార్డులను అందిస్తాయి. ఆదాయాల్లో వృద్ధిని అనుసరిస్తూ రీపేమెంట్ తీరును బట్టి ఆ లిమిట్​ను బ్యాంకులు పెంచుతుంటాయి. క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోవటం వల్ల ఉండే లాభాలు నష్టాలను తెలుసుకుందాం.

క్రెడిట్ స్కోరుకు క్రెడిట్ యుటిలైజేషన్ నిష్పత్తి చాలా ముఖ్యం. మొత్తం ఉన్న క్రెడిట్ లిమిట్​లో ఉపయోగించిన మొత్తం శాతమే ఇది. సాధారణంగా 30 శాతం కంటే ఎక్కువ క్రెడిట్ ఉపయోగించుకున్నట్లయితే.. ఎక్కువ క్రెడిట్ అవసరం ఉన్నట్లు బ్యాంకులు భావిస్తాయి. దానివల్ల తిరిగి చెల్లింపుపై అనుమానపడుతుంటాయి. క్రెడిట్ యుటిలైజేషన్ నిష్పత్తి 30 శాతం కంటే ఎక్కువైతే క్రెడిట్ స్కోరు తగ్గుతుంది.

అయితే ఎక్కువ క్రెడిట్ ఉపయోగించుకునేవారు ఎక్కువ లిమిట్ ఉన్న కార్డు తీసుకోవటం ద్వారా క్రెడిట్ యుటిలైజేషన్ నిష్పత్తి తగ్గిపోతుంది. ఉదాహరణకు మీకు లక్ష రూపాయల లిమిట్​తో క్రెడిట్ కార్డు ఉందనుకోండి. నెలవారీగా 50వేలు ఉపయోగిస్తున్నట్లయితే సీయూఆర్ 50 శాతంగా ఉంటుంది. రూ.70వేల లిమిట్​తో మరో క్రెడిట్ కార్డును తీసుకోవటం లేదా లక్ష 70 వేలకు ప్రస్తుత క్రెడిట్ లిమిట్​ను పెంచుకోవటం ద్వారా సీయూఆర్ 29 శాతానికి తగ్గుతుంది. ఈ విధంగా క్రెడిట్ స్కోరుపై ప్రభావం తగ్గించుకోవచ్చు.

ఆర్థిక అవసరాలకు..

ఉద్యోగాల కోత, అనారోగ్యం, ప్రమాదం తదితర అత్యవసరాల సమయాల్లో డబ్బుల కొరత ఏర్పడినప్పుడు.. పెరిగిన క్రెడిట్ లిమిట్ ఆదుకునే అవకాశం ఉంటుంది. బిల్లు చెల్లించాల్సిన గడువులోపు చెల్లించే సామర్థ్యం లేనట్లయితే నెలవారీ వాయిదాలు(ఈఎమ్ఐ)లుగా మార్చుకోవచ్చు. సాధారణంగా చెల్లించని బ్యాలెన్స్​పై వడ్డీ 30-49 శాతం ఉంటుంది. ఈఎమ్ఐకి మార్చుకోవటం వల్ల అవుట్ స్టాండింగ్ మొత్తంపై వడ్డీని తగ్గించుకోవచ్చు.

రుణ లభ్యత పెరుగుతుంది

క్రెడిట్​పై రుణం తీసుకొనే వెసులుబాటు ఉన్న దృష్ట్యా.. పెరిగిన క్రెడిట్ లిమిట్ వల్ల ఎక్కువ రుణం పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ రుణాలు క్రెడిట్ లిమిట్​కు అనుగుణంగా ఉంటాయి. ఈ తరహా రుణాల్లో దరఖాస్తు అందించిన నాడే రుణం పొందవచ్చని.. ఇవి ఆర్థిక అవసరాలకు ఉపయోగపడుతాయని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఎక్కువ అప్పు!

క్రెడిట్ లిమిట్ పెరగటం వల్ల ఎక్కువ ఖర్చు పెట్టేందుకు వీలు లభిస్తుంది. సరిగ్గా క్రెడిట్ కార్డును ఉపయోగించని పక్షంలో దీనివల్ల రుణ భారం పెరగవచ్చు. సమయానికి బిల్లు మొత్తం చెల్లించనట్లయితే క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులో మరిన్ని క్రెడిట్ కార్డు ఆఫర్లు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు.

ఒకటి కంటే ఎక్కువ కార్డులు తీసుకోవటం ద్వారా కూడా క్రెడిట్ లిమిట్ పెంచుకోవచ్చు. అయితే దీనివల్ల క్రెడిట్ కార్డులపై ఆధారపడటం పెరుగుతుంది. ఇది కూడా రుణ భారం పెంచుతుంది. ఒక్కసారి క్రెడిట్ స్కోరు దెబ్బతింటే మళ్లీ గాడిలో పడేందుకు సమయం పడుతుంది కాబట్టి జాగ్రత్తగా వాడుకోవాలి.

వడ్డీ భారం

బిల్లు మొత్తం చెల్లించని పక్షంలో వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. పెరిగిన క్రెడిట్ లిమిట్ ప్రకారం ఖర్చు పెంచినప్పుడు తిరిగి చెల్లించనట్లయితే వడ్డీ భారం పెరిగే అవకాశం ఉంది. క్రెడిట్ కార్డుపై ఖర్చు.. తిరిగి చెల్లించే స్థాయికి అనుగుణంగా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ క్రెడిట్ కార్డు పోయినట్లయితే లేదా తప్పుగా ఉపయోగించినట్లయితే భారం పెరుగుతుంది.

ఇదీ చదవండి: క్రెడిట్​ కార్డులు.. సంఖ్య పెరిగినా లాభమే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.