ETV Bharat / business

52 రోజుల్లోనే వ్యాక్సిన్- 'భారత్' ఎలా సాధించింది?

author img

By

Published : Jul 3, 2020, 3:13 PM IST

Updated : Jul 3, 2020, 5:35 PM IST

కరోనాకు 'ఎండ్​ కార్డ్' వేయడానికి ప్రపంచం మొత్తం ఒక్క అవకాశం కోసం ఎదురుచూస్తోంది. వైరస్​ను అంతమొందించే ఆయుధమైన 'వ్యాక్సిన్' తయారీలో నిమగ్నమైంది. అగ్రదేశాల శాస్త్రవేత్తలే మరో సంవత్సరం వరకు టీకా వచ్చేది అనుమానమే అంటూ తేల్చిచెప్పేశారు. ఈ సంవత్సరం వ్యాక్సిన్ రావడం అసాధ్యమని కొట్టిపారేశారు. కానీ... భారత దేశం మాత్రం ఆగస్ట్​ నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇది ఎలా సాధ్యమైంది?

Covid vaccine by Aug 15: How India will manage to get it early
52 రోజుల్లోనే వ్యాక్సిన్.. 'భారత్' ఎలా సాధించింది?

  • జనవరి 30: దేశంలో తొలి కరోనా కేసు నమోదు
  • మార్చి 23 నాటికి వంద కేసులు, మే 19 నాటికి లక్ష కేసులు
  • మే 9న వ్యాక్సిన్ అభివృద్ధి కోసం భారత్​ బయోటెక్​తో ఐసీఎంఆర్​ భాగస్వామ్యం
  • జూన్ 29- భారత్​లో తొలి కరోనా వ్యాక్సిన్ క్యాండిడేట్​ను తయారు చేసినట్లు భారత్ బయోటెక్ ప్రకటన

ఇలా కరోనా కేసులకంటే వేగంగా వ్యాక్సిన్ అభివృద్ధికి బాటలు పరిచాయి ఐసీఎంఆర్, భారత్​ బయోటెక్. ప్రపంచం నివ్వెరపోయేలా, కరోనా భయాల నుంచి ఊపిరి పీల్చుకునేలా ఆగస్టు 15 నాటికి టీకా విడుదల చేయనున్నట్లు ప్రకటించాయి.

ఇదీ చదవండి: ఆగస్టు​ 15 కల్లా భారత్​ బయోటెక్ 'కొవాక్జిన్​' వ్యాక్సిన్ రిలీజ్​!

ఇదీ చదవండి: భారత్​లో రెండో వ్యాక్సిన్-​ ప్రయోగానికి అనుమతి

న్ని క్లినికల్ ట్రయల్స్ పూర్తయితే ఆగస్ట్ 15 నాటికి వ్యాక్సిన్​ను ప్రజల వినియోగం కోసం విడుదల చేయాలని నిర్ణయించాం. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి భారత్​ బయోటెక్ వేగంగా పనిచేస్తోంది. అయితే తుది ఫలితం మాత్రం ప్రాజెక్టులో ఉన్న అన్ని క్లినికల్ ట్రయల్స్​పై ఆధారపడి ఉంటుంది.

-బలరాం భార్గవ, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్

ఆశ్చర్యకరంగా కేవలం 52 రోజుల వ్యవధిలోనే వ్యాక్సిన్​ క్యాండిడేట్​కు తుదిరూపునిచ్చాయి భారత్​ బయోటెక్​, ఐసీఎంఆర్​. ఈ వ్యాక్సిన్​ను మనుషులపై ప్రయోగించడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం లభించింది.

మరి భారత్​ బయోటెక్ ఇంత వేగంగా వ్యాక్సిన్ ఎలా తయారు చేయగలిగింది? వ్యాక్సిన్ అభివృద్ధికి సాధారణంగా 14-15 సంవత్సరాలు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ ప్రస్తుతం ఒక సంవత్సరంలోనే తయారు చేయగలుగుతున్నామని భారత్​ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్లా ప్రకటించారు. సమయాన్ని గణనీయంగా తగ్గించడానికి ప్రధాన కారణమేంటి? అనే విషయాలు పరిశీలిస్తే...

ప్రభుత్వ చర్యల వల్లే!

దేశీయంగా వ్యాక్సిన్ అభివృద్ధి వేగంగా జరగడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు సైతం ఓ కారణంగా తెలుస్తోంది. వ్యాక్సిన్ ట్రయల్స్​ ప్రక్రియను వేగవంతం చేయడం కూడా ఇందుకు సహకరించినట్లు స్పష్టమవుతోంది.

వేగంగా రిజిస్ట్రేషన్లు

క్లినికల్ ట్రయల్స్​ కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతం చేయాలని కేంద్ర ఔషధ ప్రామాణిక నియంత్రణ సంస్థ(సీడీఎస్​సీఓ) నిర్ణయించింది. ట్రయల్స్​ కోసం వచ్చే దరఖాస్తులను ఆమోదించే సమయం 12 నెలల నుంచి మూడు నెలలకు తగ్గించింది. అన్ని నిబంధనలు పాటించడం కష్టమైనా.. ట్రయల్స్​ భద్రత విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేసింది. మరోవైపు.. వ్యాక్సిన్ వేగంగా తయారు చేయడానికి డ్రగ్స్​ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్ 1940 ప్రకారం భారత ప్రభుత్వం సైతం పలు మినహాయింపులు ఇచ్చింది.

ట్రయల్స్​ విషయంలోనూ..

కానీ క్లినికల్ ట్రయల్స్ విషయానికి వస్తే ఈ ప్రక్రియ మరింత ఆలస్యంగా జరిగే అవకాశం ఉంది. వ్యాక్సిన్ అభివృద్ధిలో ట్రయల్స్​ కోసమే ఎక్కువ సమయం పడుతుంది. ట్రయల్స్​లోనే మూడు వేర్వేరు దశలు ఉంటాయి. ఈ దశల్లో పెద్ద ఎత్తున నమూనాలను పరిశీలించాల్సి ఉంటుంది. ఒకవేళ శాంపిల్ పరిమాణాన్ని తగ్గించినా.. ఒక్కో దశను దాటుకొని రావడానికి ఆరు నెలలు పడుతుంది. అనంతరం ఇందులో వచ్చిన ఫలితాలను నియంత్రణ సంస్థలు ఆమోదించాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: వీటికి జవాబు దొరికితేనే కరోనా వ్యాక్సిన్​ వచ్చేది!

అయితే ఇందులోనూ పలు మినహాయింపులు ఇచ్చింది ప్రభుత్వం. స్వదేశీ కరోనా వ్యాక్సిన్​ల విషయంలో ఈ కాలక్రమాన్ని మరింత తగ్గించింది.

ప్రజారోగ్య అత్యవసర పరిస్థితుల దృష్ట్యా వ్యాక్సిన్​ను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని, కాబట్టి క్లినికల్ ట్రయల్స్ ప్రారంభానికి సంబంధించిన అన్ని ప్రక్రియలను వేగవంతం చేయాలని సంస్థలకు సూచించింది ఐసీఎంఆర్.

భారత్​ బయోటెక్ వ్యూహం

వ్యాక్సిన్ ట్రయల్స్​లో భాగంగా భారత్​ బయోటెక్ అనుసరిస్తున్న వ్యూహాన్ని ఆ సంస్థ డైరెక్టర్ కృష్ణ ఎల్లా వివరించారు.

  • ఒకటో దశలో భాగంగా 28 రోజుల పాటు ట్రయల్స్​ జరుగుతాయి.
  • వలంటీర్లను నియమించుకొని.. ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలు నిర్వహిస్తారు.
  • అనంతరం వారికి వ్యాక్సిన్ డోసులు అందిస్తారు. ఆ తర్వాత సెరోలజీ నిర్వహిస్తారు.
  • శరీరంలో ఉత్పత్తి అయిన యాంటీబాడీలు వైరస్​ను రెట్టింపు కాకుండా నిరోధిస్తాయి.
  • ఆ తర్వాత రెండు, మూడో దశలను ప్రారంభిస్తారు.

ప్రపంచవ్యాప్తంగా

ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 140 వ్యాక్సిన్​ కేండిడేట్లు వివిధ దశల్లో ఉన్నాయి. పది వ్యాక్సిన్​ కేండిడేట్లు మానవులపై ప్రయోగించే దశలకు చేరుకున్నాయి. కరోనా వ్యాక్సిన్ 2021 ప్రారంభంలో మార్కెట్​లోకి వచ్చే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ భారత్​ బయోటెక్ లక్ష్యాన్ని చేరుకున్నట్లైతే.. ప్రపంచ ఫార్మా చరిత్రలో భారత్​ నూతన అధ్యాయాన్ని లిఖించినట్లే.

ఇవీ చదవండి

Last Updated :Jul 3, 2020, 5:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.