ETV Bharat / business

​భారత్​ బయోటెక్​ 'రోటా' టీకాకు డబ్ల్యూహెచ్​ఓ ఆమోదం

author img

By

Published : Aug 2, 2021, 5:54 PM IST

రోటావాక్​ వ్యాక్సిన్​ను మరింత అభివృద్ధి పరచి... రోటావాక్-5డి టీకాను భారత్​ బయోటెక్​ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ వ్యాక్సిన్​కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపింది. ఈ టీకా నిల్వ, సరఫరాకు తక్కువ మొత్తంలో వనురులు అవసరమవుతాయని.. తద్వారా ఎక్కువ ప్రాంతాలకు, ప్రజలకు వేగంగా చేరువ కానుందని భారత్ బయోటెక్ తెలిపింది.

bharat biotech
భారత్​ బయోటెక్​

భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన రోటావాక్-5డి వ్యాక్సిన్​కు ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) ఆమోదం తెలిపింది. పిల్లల్లో రోటా వైరస్ నుంచి రక్షణకు ఇప్పటికే రోటావాక్ వ్యాక్సిన్​ను అభివృద్ధి చేసిన సంస్థ.. వ్యాక్సిన్​ను మరింత అభివృద్ధి పరచి రోటావాక్ 5డిగా తీసుకువచ్చింది. బఫర్ సొల్యూషన్ అవసరం లేకుండా నిల్వ చేయగలగటం, 0.5 మి.లీ డోసేజ్​లో టీకాను తీసుకురావటం ఈ నూతన రోటావాక్-5డి ప్రత్యేకత. పిల్లల్లో ప్రబలంగా వ్యాపించే రోటా వైరస్ నుంచి ఈ అభివృద్ధి పరచిన వ్యాక్సిన్ మరింత రక్షణ కల్పించటమే కాక.. నిల్వ, సరఫరా, డిస్పోసల్ లోనూ తక్కువ ఖర్చు అవుతుందని కంపెనీ తెలిపింది. డబ్ల్యూహెచ్​ఓ ప్రీక్వాలిఫికేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ సరఫరా.. మరింత వేగవంతం కానుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.

ఏటా 2 లక్షల మరణాలు..

ఐదేళ్ల లోపు వయసున్న పిల్లల్లో ప్రాణాంతక డయేరియాకు రోటా వైరస్ కారణమవుతుంది. తద్వారా ఏటా 2 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. 20 లక్షల మంది పిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారు. రోటా వైరస్ కారణంగా సంక్రమించే వ్యాధులకు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ఫస్ట్ జనరేషన్ రోటావాక్ వ్యాక్సిన్ అడ్డుకట్ట వేసింది. ఇప్పటివరకు 250 మిలియన్ డోసుల రోటావాక్ టీకాను గ్లోబల్​గా భారత్ బయోటెక్ సరఫరా చేసింది. రోటావాక్ వ్యాక్సిన్​కు 2018 జనవరిలో డబ్ల్యూహెచ్​ఓ ఆమోదం తెలిపింది.

1986-1988 మధ్యలో దిల్లీలోని ఎయిమ్స్​లో మొదటగా వైరస్ సోకిన పిల్లల నుంచి ఈ రోటా వైరస్​ను గుర్తించి వేరుచేశారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ రోటా వైరస్ నుంచి పిల్లలను రక్షించే సోషల్ ఇన్నోవేషన్ ప్రాజెక్టుకు భారత్ బయోటెక్ అంకురార్పణ చేసింది. 2013లో ఈ వ్యాక్సిన్​కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్​ను పూర్తి చేసింది. ఇందుకు సంబంధించిన డేటా.. ప్రఖ్యాత లాన్సెట్ జర్నల్​లో ప్రచురితమైంది.

నోటి ద్వారా ఇచ్చేలా..

రోటావాక్ -5డి వ్యాక్సిన్ తక్కువ ధరలో, తక్కువ పరిమాణంలో అందుబాటులో ఉంటుందని భారత్ బయోటెక్ తెలిపింది. ఐదు చుక్కల 0.5ఎంఎల్​ డోసేజ్​లో నోటి ద్వారా ఇచ్చే ఈ మోనోవాలెంట్ టీకాను నాలుగు వారాల అంతరంతో మూడు డోసుల్లో చిన్నారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఎనిమిది నెలల వయసు దాటిన పిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇవ్వరాదు. ఈ వ్యాక్సిన్ నిల్వ, సరఫరాకు తక్కువ మొత్తంలో వనురులు అవసరమవుతాయి. తద్వారా ఎక్కువ ప్రాంతాలకు, ప్రజలకు వేగంగా చేరువ కానుందని భారత్ బయోటెక్ తెలిపింది.

ఈ వ్యాక్సిన్ల అభివృద్ధి భారత్ బయోటెక్ 30 ఏళ్ల కృషి అని, వ్యాక్సిన్ల అభివృద్ధిలో తమ విజన్​ను ఈ గుర్తింపు చాటిందని భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా అన్నారు. నిర్లక్ష్యానికి గురైన లక్షల మందిలో ప్రాణాంతకమయ్యే వ్యాధులను అరికట్టేందుకు భారత్ బయోటెక్ పరిశోధనలు కొనసాగిస్తుందని ఆమె పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.