ETV Bharat / bharat

'భర్త నల్లగా ఉన్నాడని అనడం క్రూరత్వమే'... విడాకులు మంజూరు చేస్తూ హైకోర్టు వ్యాఖ్య

author img

By

Published : Aug 7, 2023, 10:39 PM IST

wife black skin remarks is cruelty Karnataka High Court
wife black skin remarks is cruelty Karnataka High Court

Wife Black Skin Remarks is Cruelty Karnataka High Court : నల్లగా ఉన్నాడంటూ భర్తను వేధించడం క్రూరత్వం కిందకు వస్తుందని పేర్కొంటూ ఓ వ్యక్తికి విడాకులు మంజూరు చేసింది కర్ణాటక హైకోర్టు. చర్మం రంగుపై అవహేళన చేసిన భార్య.. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు భర్తపై తప్పుడు ఆరోపణలు మోపిందని పేర్కొంది.

చర్మం నల్లగా ఉందని వేధించడం క్రూరత్వం కిందకే వస్తుందని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. భార్య నుంచి విడాకులు కోరుతూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్​పై తీర్పు చెబుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్​కు విడాకులు మంజూరు చేసింది. పిటిషనర్ భార్య అతడి చర్మ రంగు గురించి నిరంతరం అవహేళన చేస్తూ వేధించిందని హైకోర్టు పేర్కొంది. దీన్ని కప్పిపుచ్చేందుకు పిటిషనర్​పై తప్పుడు ఆరోపణలు మోపిందని పేర్కొంది. ఇది క్రూరత్వం కిందకే వస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది.

కేసు ఇదీ..
పిటిషనర్​కు 2007లో వివాహం జరిగింది. 2012లో విడాకుల కోసం అతడు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. అతడి పిటిషన్​ను ఫ్యామిలీ కోర్టు 2017 జనవరి 13న తిరస్కరించింది. దీన్ని సవాల్ చేస్తూ అతడు హైకోర్టుకు వెళ్లాడు. వివాహం జరిగినప్పటి నుంచి తన భార్య తనను నల్లగా ఉన్నాడని చెప్పి వేధిస్తోందని పిటిషన్​లో పేర్కొన్నాడు. తన కుమార్తె కోసం ఇంతకాలం అవన్నీ భరించానని చెప్పుకొచ్చాడు. కానీ, 2011లో తన తల్లి, ఇతర కుటుంబ సభ్యులపై తన భార్య కేసు వేసిందని తెలిపాడు. ఈ కేసు విషయంలో తాను అనేక బాధలు అనుభవించానని చెప్పాడు. 10 రోజులు పోలీస్ స్టేషన్​లో గడిపానని, కోర్టుల చుట్టూ తిరిగానని వివరించాడు. 'నా భార్య వాళ్ల పుట్టింటికి వెళ్లిపోయింది. తిరిగి ఇంటికి రాలేదు. నేను పనిచేసే చోట యజమానికి కూడా ఫిర్యాదు చేసింది. నేను చాలా మానసిక వేదనకు గురయ్యా' అని తన పిటిషన్​లో వివరించాడు. తనకు విడాకులు మంజూరు చేయాలని అభ్యర్థించారు.

'నన్ను తిట్టేవాడు..'
అయితే, పిటిషనర్ ఆరోపణలను అతడి భార్య ఖండించారు. తన భర్యకు వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందని ఆరోపించారు. ఆమెతో ఓ బిడ్డను కన్నాడని వివరించారు. తనను ఎప్పుడూ తిట్టేవాడని, ఇంటి నుంచి బయటకు వెళ్లనిచ్చేవాడని కాదని పేర్కొన్నారు. ఇంటికి ఆలస్యంగా వస్తే తీవ్రంగా దూషించేవాడని ఆరోపించింది.

అయితే, కోర్టు ఈ ఆరోపణలను పరిగణలోకి తీసుకోలేదు. వీటికి నిరాధార ఆరోపణలుగా కొట్టిపారేసింది. ఇన్నాళ్లూ దూరంగా ఉన్న ఆమె.. ఇప్పుడు భర్తతో కలిసి ఉంటానని ముందుకు రావడంపై అనుమానాలు వ్యక్తం చేసింది. ఇన్ని సంవత్సరాలుగా ఫిర్యాదును వెనక్కి తీసుకోకపోవడంపైనా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. భర్తతో కలిసి ఉండే ఉద్దేశం ఆమెకు లేదని భావిస్తున్నట్లు హైకోర్టు అభిప్రాయపడింది. చివరకు పిటిషనర్​కు విడాకులు మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.