ETV Bharat / bharat

'ప్రజాస్వామ్య శిథిలాలపై కొత్త పార్లమెంట్ నిర్మాణం'

author img

By

Published : Dec 10, 2020, 8:55 PM IST

నూతన పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన జరగడంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఉదారవాద ప్రజాస్వామ్య శిథిలాలపై కొత్త పార్లమెంట్ నిర్మాణం జరుగుతోందని మండిపడింది. ప్రజాస్వామ్యాన్ని అణచివేసిన తర్వాత నిర్మించే భవనం.. దేనికి సూచికగా నిలుస్తుందని ప్రశ్నించింది. సెంట్రల్ విస్తా పేరిట విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించుకునే పనిలో మోదీ ఉన్నారని ఎద్దేవా చేసింది.

CONG PAR BUILDING
'ప్రజాస్వామ్య శిథిలాలపై కొత్త పార్లమెంట్ నిర్మాణం'

నూతన పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన జరగడంపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో స్పందించింది. ప్రజాస్వామ్యాన్ని అణచివేసిన తర్వాత నిర్మించే భవనం.. దేనికి సూచికగా నిలుస్తుందని ప్రశ్నించింది. దేశంలోని రైతులు తమ హక్కుల కోసం పోరాడుతున్న సమయంలో ఈ శంకుస్థాపన జరిగిందనే విషయాన్ని చరిత్ర గుర్తుంచుకుంటుందని వ్యాఖ్యానించింది.

ప్రజాస్వామ్యంలో అధికారం ఉండటం అంటే.. తమ ఇష్టాలు, అభిరుచులను నెరవేర్చుకోవడం కాదని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. ప్రజా సేవ, ప్రజలకు ప్రయోజనం కలిగించే పనులను చేయాలని సూచించారు. రైతులు 16 రోజులుగా ఆందోళనలు చేస్తుంటే.. సెంట్రల్ విస్తా పేరిట విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించుకునే పనిలో మోదీ ఉన్నారని ఎద్దేవా చేశారు.

శిథిలాలపై...

ఉదారవాద ప్రజాస్వామ్య శిథిలాలపై నూతన పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేశారని సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం పేర్కొన్నారు. ఇది హృదయంలేని, తెలివిలేని, సిగ్గులేని నిర్ణయమని కాంగ్రెస్ ప్రతినిధి జైవీర్ షెర్గిల్ దుయ్యబట్టారు. ఓ వైపు దేశం ఆర్థిక మందగమనంలో ఉంటే.. ప్రజలకు ఎలాంటి రాయితీలు ఇవ్వకుండా భాజపా ఆడంబరాలు చేస్తోందని మండిపడ్డారు.

మరో కాంగ్రెస్ నేత జైరాం రమేశ్.. పాత, కొత్త పార్లమెంట్ భవనాలను వివిధ నిర్మాణాలతో పోల్చుతూ ట్వీట్ చేశారు. బ్రిటీష్ వారు నిర్మించిన పార్లమెంట్.. మధ్యప్రదేశ్​లోని చౌసాత్ యోగినీ దేవాలయాన్ని పోలి ఉందని.. తాజా నిర్మాణం వాషింగ్టన్​లోని పెంటగాన్​ను పోలి ఉందని అన్నారు.

అంబేడ్కర్ పేరు పెట్టండి..

మరోవైపు, శంకుస్థాపన కార్యక్రమం జరుగుతున్న సమయంలో పార్లమెంట్ సమీపంలో దళిత కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ నిరసన ప్రదర్శన నిర్వహించారు. నూతన పార్లమెంట్​కు బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేడ్కర్​ది కీలక పాత్ర అని.. ఈ గౌరవానికి ఆయన అన్ని విధాల అర్హులని పేర్కొన్నారు.

ఇవీ చదవండి

'భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇదో మైలురాయి'

'కొత్త పార్లమెంటు భవనం భారతీయుల నైతికతకు ప్రతీక'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.