రేప్​ కేస్ నిందితుల ఇళ్లకు బుల్డోజర్లు- పరారీలో ఉన్నవారు గంటల్లోనే సరెండర్!

author img

By

Published : Apr 2, 2022, 12:42 PM IST

up bulldozer news

UP Bulldozer news: ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులు బుల్డోజర్లను మళ్లీ రంగంలోకి దించారు. నిందితులను 'దారికి తీసుకురావడానికి' వీటిని ఉపయోగిస్తున్నారు. తాజాగా రెండు అత్యాచార ఘటనల నిందితులను పట్టుకునేందుకు బుల్డోజర్లను వినియోగించి సఫలమయ్యారు.

UP Bulldozer news: యూపీలో బుల్డోజర్లు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల సమయంలో పాలక, విపక్షాల మధ్య హాట్ టాపిక్​గా నిలిచిన ఈ భారీ వాహనాలు.. ఫలితాల తర్వాత పునర్దర్శనమిచ్చాయి. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ను.. విపక్షాలు 'బుల్డోజర్ బాబా' అని అభివర్ణించాయి. గ్యాంగ్​స్టర్ల ఇళ్లను కూల్చివేసేందుకు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం బుల్డోజర్లను విరివిగా ఉపయోగించిన నేపథ్యంలో ఇలా విమర్శలు చేశాయి. కాగా, ఎన్నికల తర్వాత భాజపా మళ్లీ అధికారంలోకి వచ్చింది. దీంతో బుల్డోజర్లూ కనిపిస్తున్నాయి. నిందితులకు వ్యతిరేకంగా బుల్డోజర్లు ఉపయోగించిన ఘటనలు రెండు చోటు చేసుకున్నాయి. ఓ ఘటనలో అత్యాచార నిందితుడి ఇంటి వద్దకు బుల్డోజర్​తో వెళ్లారు పోలీసులు. నిందితుడు లొంగిపోయేలా ఒత్తిడి చేసేందుకు.. దీన్ని ఉపయోగించారు.

UP bulldozer criminals: ఆమిర్(19), ఆసిఫ్(22) అనే సోదరులు ఓ మైనర్​పై అత్యాచారం చేసిన కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. నిందితుల్లో ఒకరు.. బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి సోదరుడితో కలిసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయంపై బాధితురాలి తల్లి మార్చి 25న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, నిందితుల తండ్రి షరాఫత్(56).. కేసు నమోదు చేసిన బాధితురాలి తల్లిపై బెదిరింపులకు దిగాడు. ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితులకు వారి స్టైల్​లోనే బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నారు. వారి ఇంటికి బుల్డోజర్​తో వెళ్లారు. 48 గంటల్లోగా లొంగిపోకపోతే ఇంటిని కూల్చివేస్తామని హెచ్చరించారు. ఇంటి బయట ఉన్న మూడు మెట్లను బుల్డోజర్​తో ధ్వంసం చేశారు. నిందితులకు సహాయం చేస్తే కఠిన చర్యలు తప్పవని పొరుగువారికి సైతం హెచ్చరికలు చేశారు. నిందితులు గ్రామ పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తులుగా తెలుస్తోంది.

"పెద్ద కుటుంబం నుంచి వచ్చామని భావిస్తున్న నిందితులకు గట్టి సందేశం ఇవ్వాలని అనుకున్నాం. అజ్ఞాతంలోకి వెళ్లిన ఇద్దరు నిందితులు బయటకు రాకపోతే ఏం జరుగుతుందో చెప్పాలని భావించాం. అందుకే ఇంటి మెట్లను కూల్చివేశాం. క్షేత్రస్థాయిలో దీని ప్రభావం అధికంగానే ఉంది" అని స్థానిక స్టేషన్ హౌస్ అధికారి తెలిపారు. అయితే, నిందితుల తండ్రి ఈ ఆరోపణలను అవాస్తవమని కొట్టిపారేశారు. తప్పుడు ఆరోపణలతో కేసు నమోదు చేశారని అన్నారు. తమ ఇంటిని కూల్చేస్తామని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. పోలీసుల చర్య వల్ల తమ కుటుంబం తీవ్ర భయాందోళన చెందుతోందని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై న్యాయ నిపుణుల సహాయం తీసుకుంటున్నామని తెలిపారు. కాగా, పోలీసుల బుల్డోజర్ ఐడియా పనిచేసినట్లే కనిపిస్తోంది. నిందితులు ఇద్దరూ అజ్ఞాతం వీడారు. ఇద్దరు యువకులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు.

అంతకుముందు, రైల్వే స్టేషన్ టాయిలెట్​లో మహిళపై అత్యాచారం చేసినందుకు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. ఇందుకోసం బుల్డోజర్లను మోహరించారు. నిందితుడి ఆచూకీ లభించకపోవడం వల్ల.. అతడి ఇంటి వద్ద బుల్డోజర్​ను పోలీసులు పార్క్ చేశారు. మార్చి 19న కేసు ఈ ఘటనపై కేసు నమోదు కాగా.. మార్చి 22న నిందితుడు పోలీసులకు చిక్కాడు. బుల్డోజర్ మోహరించిన తర్వాతే నిందితుడి గురించి సమాచారం తమకు అందిందని పోలీసు వర్గాలు తెలిపాయి.

యూపీలో 2017లో భాజపా అధికారంలోకి వచ్చాక.. గ్యాంగ్​స్టర్లు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న 15 వేల మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారి ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నిర్మించిన ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేశారు. క్లియరెన్సులు లేకుండా నిర్మించిన ఇళ్లనే కూల్చేస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. జిల్లాస్థాయి అధికారులు విచారణ చేపట్టిన అనంతరం.. కూల్చివేత చేపడతామని స్పష్టం చేశాయి. ఎన్నికల సమయంలోనూ ఈ విషయం చర్చనీయాంశమైంది. అయితే, బుల్డోజర్లను రిపేర్లకు ఇచ్చామని, అధికారంలోకి వచ్చాక మళ్లీ ప్రవేశపెడతామని యోగి ఆదిత్యనాథ్.. ఎన్నికల ప్రచార సమయంలోనే చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి: 'బుల్​డోజర్లు రిపేర్​లో ఉన్నాయ్.. ఫలితాల తర్వాత వారి పని పడతాయ్​!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.