ETV Bharat / bharat

యూపీలో దావూద్​ గ్యాంగ్​ హల్​చల్​- ఉగ్రదాడికి రెక్కీ!

author img

By

Published : Sep 23, 2021, 6:31 PM IST

UP ATS
UP ATS

ఉత్తర్​ప్రదేశ్​లో భారీ ఉగ్రకుట్రకు సంబంధించి కీలక ఆధారాలను నిఘావర్గాలు సేకరించాయి. రాష్ట్రంలోని మతపరమైన ప్రాంతాల్లో ముష్కరులు రెక్కీ నిర్వహించినట్లు గుర్తించాయి.

ఉత్తర్​ప్రదేశ్​లో ఉగ్రవాదుల కార్యకలాపాలకు సంబంధించిన కీలక ఆధారాలు లభించినట్లు యూపీ తీవ్రవాద వ్యతిరేక దళం(UP ATS), జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రకటించాయి. దావూద్ ఇబ్రహీం అనుచరులు 2019 డిసెంబర్‌లో.. రాష్ట్రంలోని మతపరమైన స్థలాల్లో రెక్కీ నిర్వహించినట్లు కనుగొన్నాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న పోలీసు బృందాలు.. రెక్కీ సమయంలో వీరంతా కాన్పుర్‌లోని ఓ ఇంట్లో తలదాచుకున్నట్లు గుర్తించాయి. వారికి సహాయంగా బిహార్​కు చెందిన ఇద్దరు ఆయుధాల స్మగ్లర్లు, ఓ మహిళ కూడా ఉన్నట్లు లా అండ్ ఆర్డర్ ఏడీజీ ప్రశాంత్ కుమార్ వివరించారు.

దిల్లీ అరెస్టులతో లింకులు..

గతవారం దిల్లీలో అరెస్టైన ఆరుగురు ఉగ్రవాదుల్లో ఒకడైన మొహమ్మద్ అమీర్ జావేద్​ బంధువే ఈ రెక్కీ నిర్వహించినట్లు నిఘాసంస్థలు కనుగొన్నాయి. ప్రయాగ్‌రాజ్​లో అరెస్టైన హుమైద్ అనే వ్యక్తి ఈ రెక్కీల వెనుక ప్రధాన సూత్రధారి అని గుర్తించిన ఏటీఎస్.. అమీర్ జావేద్​కు ఇతను సోదరుడేనని తేల్చింది. అతనికి సంబంధించిన కారులోనే అప్పట్లో ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా అయ్యాయని.. ఇది అమీర్ తండ్రి పేరుపై రిజిస్టర్ అయిందని పేర్కొంది. వీరితో పాటు.. ఈ కేసుతో సంబంధం ఉన్న అమీర్ జావేద్ అత్తమామలను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు దిల్లీలో అరెస్టైన అమీర్ మొబైల్ ఫోన్‌లో కొన్ని ఫోటోలను కనుగొన్న ఏటీఎస్.. వాటిలోని ఇద్దరు యువకుల జాడను కనిపెట్టింది. అయితే.. దర్యాప్తు ప్రక్రియను తప్పుదోవ పట్టించేందుకే వారి ఫోటోలను ఉంచి.. ఆపై డిలీట్ చేసినట్లు గుర్తించింది.

మొబైల్స్​ ఏమైనట్టు?

అరెస్టు చేసిన అనుమానితులందరి వద్ద రెండేసి సెల్​ఫోన్లు ఉన్నట్లు ఏటీఎస్ గుర్తించింది. ఒకదానితో ఫోన్​కాల్‌ మాట్లాడేవారని.. మరొక నెంబర్​ను ఈ-మెయిల్‌, వీడియో కాల్స్​ కోసం ఉపయోగించేవారని వివరించారు. అయితే తమకు మాత్రం అమీర్​ మొబైల్ మాత్రమే దొరికిందని ఏటీఎస్ వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారంపై అమీర్ కుటుంబ సభ్యులతో పాటు.. ఇద్దరు యువకులను తిరిగి ప్రశ్నించనున్నట్లు ఏటీఎస్(ATS) అధికారి ఒకరు తెలిపారు.

పరారీలో..

లఖ్​నవూలో దావూద్ ఇబ్రహీం అనుచరుడు తలదాచుకున్నట్లు భావిస్తున్న ఇంటిలో సోదాలు నిర్వహించేందుకు వెళ్లగా.. అది ఖాళీగా ఉందని పోలీసులు తెలిపారు. మూడు నెలల కిందటి వరకు ఈ ఇంట్లో నలుగురు నివసించేవారని.. వారిలో ఓ మహిళ సైతం ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అయితే ప్రస్తుతం వారు ఎక్కడికి వెళ్లారనే అంశంపై ఇంటి యజమానిని ప్రశ్నిస్తున్నారు పోలీసులు.

గతవారం దిల్లీ, యూపీ ఏటీఎస్ బృందాలు ఆరుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశాయి. 1993 నాటి ముంబయి వరుస పేలుళ్ల(Mumbai Bomb Blast) తరహా దాడులకు(Terrorist Attack) ముష్కరులు కుట్ర పన్నినట్లు దిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం వెల్లడించింది. ఇందుకోసం కొన్ని ప్రాంతాలను కూడా ఎంచుకున్నట్లు చెప్పాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.