ETV Bharat / bharat

ఉక్రెయిన్‌ అంశంపై కేంద్రానికి విపక్షాల మద్దతు

author img

By

Published : Mar 4, 2022, 6:06 AM IST

Ukraine Crisis Opposition supports govt's stand
Ukraine Crisis Opposition supports govt's stand

Ukraine Crisis: ఉక్రెయిన్ విషయంలో భారత్​ అనుసరిస్తున్న విదేశీ విధానానికి విపక్ష పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు పలికాయి. ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను తరలించే అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ అంశంపై భారత విదేశీ విధానంపై కాంగ్రెస్‌ కూడా సంతృప్తి వ్యక్తం చేసింది.

Ukraine Crisis: ఉక్రెయిన్‌ సంక్షోభం విషయంలో భారత్‌ అనుసరిస్తోన్న విదేశీ విధానానికి విపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. ముఖ్యంగా రష్యాకు వ్యతిరేకంగా ఐరాసలో చేసిన తీర్మానం ఓటింగ్‌కు భారత్‌కు దూరంగా ఉండడం, ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను తరలించే అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నాయి. ఉక్రెయిన్‌ సంక్షోభం నేపథ్యంలో తాజాగా నెలకొన్న పరిణామాలపై విదేశీ వ్యవహారాల శాఖ సంప్రదింపుల కమిటీ సమావేశం నిర్వహించింది. ఇందులో పాల్గొన్న విపక్ష పార్టీలన్నీ ప్రభుత్వానికి ఏకగ్రీవ మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించాయి. ఈ అంశంపై భారత విదేశీ విధానంపై అటు కాంగ్రెస్‌ కూడా సంతృప్తి వ్యక్తం చేసింది.

ఉక్రెయిన్‌లో తాజాగా నెలకొన్న పరిమాణాలపై విదేశీ వ్యవహారాల సంప్రదింపుల కమిటీ భేటీ అయ్యింది. ఇందులో మొత్తం 21 మంది ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. ఈ సమావేశంలో ఆరు పార్టీల నుంచి తొమ్మిది మంది ఎంపీలు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ నుంచి రాహుల్‌ గాంధీ, ఆనంద్‌ శర్మ, శశిథరూర్‌లతోపాటు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ సమావేశానికి హాజరయ్యారు. ఉక్రెయిన్‌ సంక్షోభంపై ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహం, మానవీయ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా విపక్ష పార్టీలు లేవనెత్తిన ప్రశ్నలకు విదేశాంగశాఖ స్పష్టనిచ్చింది.

ఈ నేపథ్యంలో ఐరాసలో ఓటింగ్‌కు దూరంగా ఉండడం, ఉక్రెయిన్‌ నుంచి భారతీయులందర్నీ స్వదేశానికి తీసుకువచ్చే ప్రయత్నాల్లో తాము కేంద్ర ప్రభుత్వానికి ఏకగ్రీవంగా మద్దతు ఇస్తున్నట్లు విపక్ష పార్టీలు పేర్కొన్నాయి. అనంతరం ఈ సమావేశంపై స్పందించిన విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జయశంకర్‌.. ఉక్రెయిన్‌ నుంచి స్వదేశీయుల తరలింపు, భారత విదేశీ విధానంపై పార్టీలన్నీ ఒకేతాటిపై ఉన్నాయనే బలమైన సంకేతాన్ని ఇచ్చామన్నారు.

కాంగ్రెస్‌ సంతృప్తి..

భారత విదేశాంగశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశం పట్ల కాంగ్రెస్‌ పార్టీ సంతృప్తి వ్యక్తం చేసింది. 'ఉక్రెయిన్‌ విషయంలో జరిగిన సమావేశంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం స్పష్టమైన సమాధానాలు ఇచ్చింది. ఈ విషయంలో విదేశాంగశాఖ మంత్రికి నా ధన్యవాదాలు. విదేశీ విధానంలో ఇదే స్ఫూర్తి కొనసాగాలి' అంటూ కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా జాతీయ ప్రయోజనాల విషయానికి వచ్చినప్పుడు భారతీయులందరిదీ ఒకేమాట అని ఉద్ఘాటించారు.

ఇదీ చూడండి: చెన్నై మేయర్​గా ఎస్సీ మహిళ... 340ఏళ్ల చరిత్రలో తొలిసారి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.