ETV Bharat / bharat

డ్రోన్లతో ఉగ్రదాడులు- జమ్ములో ఏం జరుగుతోంది?

author img

By

Published : Jun 27, 2021, 4:55 PM IST

జమ్ము వాయుసేన స్థావరంలో జంట పేలుళ్ల ఘటనపై త్వరితగతిన దర్యాప్తు ప్రారంభించినట్ల అధికారులు తెలిపారు. ఉగ్రవాదులే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు జమ్ముకశ్మీర్​ డీజీపీ దిల్​బాగ్ సింగ్ వెల్లడించారు. అయితే డ్రోన్లు ఎక్కడ నుంచి టేకాఫ్ అయ్యాయనే విషయం అంతుపట్టడం లేదు. పాకిస్థాన్‌ సరిహద్దుకు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశంలో పేలుళ్ల కోసం ఉగ్రవాదులు డ్రోన్లను వినియోగించడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

twin-explosions-at-iaf-station-in-jammu-airport-terror-attack
'జమ్ము ఎయిర్​ పోర్ట్​లో జంట పేలుళ్లు ఉగ్రవాదుల పనే'

జమ్ములోని వాయుసేన స్థావరంలో జంట పేలుళ్ల ఘటన ఉగ్రవాదుల పనేనని జమ్ముకశ్మీర్​ డీజీపీ దిల్​బాగ్​ సింగ్​ ధ్రువీకరించారు. దీనిపై పోలీసులు, వాయుసేన, ఇతర సంస్థలు త్వరితగతిన దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. ఆదివారం వేకువజామున 1:40 గంటలకు మొదటి పేలుడు, ఆ తర్వాత ఆరు నిమిషాల వ్యవధిలో మరో పేలుడు జరిగినట్లు వివరించారు. డ్రోన్ల ద్వారా జరిగిన ఈ దాడిలో ఇద్దరు వాయుసేన సిబ్బంది గాయపడినట్లు తెలిపారు.

ఏం జరిగిందంటే..

twin-explosions-at-iaf-station-in-jammu-airport-terror-attack
జమ్ము వాయుసేన ఎయిర్​పోర్ట్

ఆదివారం వేకువజామున 1:40 గంటల సమయంలో గుర్తు తెలియని డ్రోన్లు తక్కువ ఎత్తులో ఎగురుతూ వచ్చి జమ్ము వాయుసేన స్థావరంలోని హ్యాంగర్ల (విమానాలు, హెలికాప్టర్లను భద్రపర్చే గోదామువంటివి) వద్ద పేలుడు పదార్థాలను జారవిడిచాయి. ఆ తర్వాత కొన్ని నిమిషాలకే మరో చోట పేలుడు పదార్థాలను పడేశాయి. ఎంఐ17 హెలికాప్టర్లను, రవాణా విమానాలను ఈ ప్రదేశాలకు సమీపంలో భద్రపరుస్తుంటారు. మొదటి పేలుడు కారణంగా సింగిల్ స్టోరే భవనం పైకప్పు ధ్వంసమైంది. రెండో పేలుడు బాహ్య ప్రదేశంలో జరగడం వల్ల ఎలాంటి నష్టం కలగలేదని అధికారులు తెలిపారు.

twin-explosions-at-iaf-station-in-jammu-airport-terror-attack
పేలుడు ధాటికి కూలిన పైకప్పు
twin-explosions-at-iaf-station-in-jammu-airport-terror-attack
పేలుడు జరిగిన ప్రదేశం

అయితే డ్రోన్లు ఎక్కడ నుంచి టేకాఫ్ అయ్యాయనే విషయం అంతుపట్టడం లేదు. దీన్ని కనుగొనేందుకు అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ దాడి వెనుక కుట్రను తెలుసుకునేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ), ఉగ్రవాద వ్యతిరేక దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయని అధికారులు పేర్కొన్నారు. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించినట్లు చెప్పారు.

జంట పేలుళ్లు జరిగిన జమ్ముకశ్మీర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌.. పాకిస్థాన్‌ సరిహద్దుకు 14 కిలోమీటర్ల దూరంలో ఉండటం పేలుళ్ల కోసం ఉగ్రవాదులు డ్రోన్లను వినియోగించడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

twin-explosions-at-iaf-station-in-jammu-airport-terror-attack
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు
twin-explosions-at-iaf-station-in-jammu-airport-terror-attack
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు

మరో ఉగ్రకుట్ర భగ్నం..

జంట పేలుళ్ల దర్యాప్తు పనిలో అధికారులు నిమగ్నమవ్వగా.. మరో దాడికి ప్రయత్నించారు ఉగ్రవాదులు. అయితే ఈ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. 6 కేజీల ఐఈడీని కలిగి ఉన్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇతడిని నిషిద్ధ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందినవాడిగా అనుమానిస్తున్నారు. జనసమూహంలో ఐఈడీ పేల్చే టాస్క్​ను పూర్తి చేయాలనే పనిని ఉగ్రసంస్థ ఇతడికి అప్పగించినట్లు వివరించారు. మరింత మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించనున్నట్లు డీజీపీ తెలిపారు.

పఠాన్​కోట్​లో హై అలర్ట్

జమ్ము వాయిసేన ఎయిర్​పోర్ట్​లో జంట పేలుళ్ల నేపథ్యంలో పంజాబ్ సరిహద్దు జిల్లా పఠాన్​కోట్​లో అలర్ట్ ప్రకటించారు అధికారులు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి నిఘా పెంచారు. నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఐదేళ్ల క్రితం పఠాన్​కోట్ ఎయిర్ ఫోర్స్ బేస్​లో జరిగిన ఉగ్రదాడిని దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఇక్కడ సున్నితమైన ప్రాంతాల్లో పెట్రోలింగ్​ను బలోపేతం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా అదనపు బలగాలను మోహరించారు. ప్రస్తుత పరిస్థితలు దృష్ట్యా పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

పేలుడు ఘటనలు జరిగినప్పుడు పొరుగు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించడం సాధారణమేనని పఠాన్​కోట్​ ఎస్​ఎస్​పీ సురేంద్ర లాంబా వివరించారు. అంతర్రాష్ట్ర సరిహద్దు కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. జమ్ము నుంచి వచ్చి వెళ్లే ఏ ఒక్క వాహనాన్ని వదలకుండా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.

జంట పేలుళ్ల ఘటనపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద కేసు నమోదు చేసినట్లు జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు.

జమ్ము ఎయిర్​పోర్టులో అన్ని విమానాల సేవలు సాధారణంగానే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. పలు కారణాల వల్ల ఈ రోజు రెండు విమానాలు మాత్రమే రద్దు అయినట్లు తెలిపారు.

తొలి సారి డ్రోన్ల వినియోగం..

భారత్‌లో డ్రోన్లను వినియోగించి రక్షణ దళాలపై చేసిన తొలిదాడిగా దీనిని భావిస్తున్నారు. ఈ డ్రోన్లను రాడారు గుర్తించలేదు.

పాకిస్థాన్‌ ఇప్పటికే పంజాబ్‌, జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదులకు ఆయుధ సరఫరా చేసేందుకు డ్రోన్లను వినియోగిస్తోంది. వీటిని కూడా రాడార్లు గుర్తించడంలేదు. పాకిస్థాన్‌ సరిహద్దుకు ఈ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. గతంలో ఆయుధాలు జారవిడిచే డ్రోన్లు దాదాపు 12 కిలోమీటర్లకు పైగా చొచ్చుకు వచ్చాయి.

  • 2019 ఆగస్టు 13న అమృత్‌సర్‌ సమీపంలోని మోహవా గ్రామం వద్ద కూలిపోయిన పాక్‌ డ్రోన్‌ శకలాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
  • 2019 సెప్టెంబర్‌ 9-16 మధ్య ఎనిమిది సార్లు డ్రోన్లు వచ్చి ఆయుధాలు, నగదు, మందుగుండు సామగ్రిని జారవిడిచి వెళ్లాయి. సెప్టెంబర్‌ 22న ఓ ఉగ్రవాదిని అరెస్టు చేస్తే ఈ విషయం బయటపడింది.
  • 2020 జూన్‌ 20వ తేదీన జమ్ములోని హీరానగర్‌ సెక్టార్‌లో బీఎస్‌ఎఫ్‌ ఒక నిఘా డ్రోన్‌ను కూల్చివేసింది.
  • 2020 సెప్టెంబర్‌ 19న జమ్ముకశ్మీర్‌ పోలీసులు ముగ్గురు లష్కరే ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ఆ ముందు రోజు రాత్రి వీరికి డ్రోన్‌ ద్వారా ఆయుధాలు సరఫరా అయినట్లు తేలింది.
  • 2020 సెప్టెంబర్‌ 22న అక్నూర్ సెక్టార్‌లో డ్రోన్‌ ద్వారా ఆయుధాలు జారవిడిచనట్లు పోలీసులు గుర్తించారు.

ఇదీ చూడండి: 'కశ్మీర్​వాసుల్లో అపనమ్మకం తొలగించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.