ETV Bharat / bharat

గిరిజనుడి విజయగాథ.. తినడానికి తిండి లేని స్థాయి నుంచి అమెరికాలో టాప్ సైంటిస్ట్​గా..

author img

By

Published : Nov 13, 2022, 3:43 PM IST

కష్టపడేతత్వం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు అనడానికి భాస్కర్‌ హలమి జీవితం సరైన ఉదాహరణ. మహారాష్ట్ర.. గడ్చిరోలిలోని ఓ మారుమూల పల్లెలో ఒక్కపూట తినడానికి కూడా కష్టపడ్డ కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఇప్పుడు అమెరికాలో ఓ ప్రఖ్యాత సంస్థలో సీనియర్‌ సైంటిస్ట్‌ స్థాయికి చేరారు. భాస్కర్ హలమి విజయగాథ ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

Bhaskar halami biography
శాస్త్రవేత్త భాస్కర్‌ హలమి

కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అనడానికి మహారాష్ట్రకు చెందిన భాస్కర్‌ హలమి జీవితం సరిగ్గా సరిపోతుంది. తినడానికి తిండి కూడా లేక ఆకలితో అలమటించిన రోజుల నుంచి అమెరికాలోని ఓ ప్రఖ్యాత సంస్థలో సీనియర్‌ శాస్త్రవేత్త స్థాయికి ఎదిగిన ఆయన ప్రయాణం ప్రతిఒక్కరిలో స్ఫూర్తి నింపుతుంది. కష్టపడేతత్వం, సాధించాలనే పట్టుదల ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చని ఆయన నిరూపించారు.

గడ్చిరోలి జిల్లా కుర్ఖేడా తెహసీల్‌లోని చిర్చాడీ గ్రామానికి చెందిన భాస్కర్‌ ఇప్పుడు అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత బయోఫార్మా కంపెనీ సిర్నావోమిక్స్‌లో సీనియర్‌ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఈ సంస్థ ప్రధానంగా జన్యుపరమైన ఔషధాలపై పరిశోధనలు చేస్తుంటుంది. ఇందులో భాస్కర్‌ ఆర్‌ఎన్‌ఏ ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాల్ని పర్యవేక్షిస్తున్నారు. చిర్చాడీ గ్రామంలో సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన మొదటి వ్యక్తి భాస్కరే. తర్వాత ఆయన మాస్టర్స్‌, పీహెచ్‌డీ కూడా పూర్తిచేసి అంచలంచెలుగా ఉన్నత శిఖరాలకు చేరారు.

తినడానికి తిండిలేని స్థాయి నుంచి..
ఒక్కపూట తినడానికి కూడా తిండి లేని ఆరోజులు అసలు ఎలా గడిచాయో గుర్తు చేసుకుంటే ఆశ్చర్యమేస్తుందని భాస్కర్‌ అన్నారు. అలాంటి గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొని బతికామంటేనే నమ్మబుద్ధి కావడంలేదని తెలిపారు. వర్షాకాలంలో తమకున్న చిన్న పొలంలో పంటలేసుకునేందుకు కూడా వీలుండేది కాదన్నారు. కొన్ని నెలల పాటు పని దొరక్క ఇప్ప పూలను వండుకొని తినేవాళ్లమని నాటి రోజుల్ని గుర్తుచేసుకున్నారు. బియ్యం పిండితో అంబలి కాచుకొని ఆకలి తీర్చుకునేవాళ్లమన్నారు. తమ ఊళ్లో 90 శాతం మందిది ఇదే పరిస్థితి అని తెలిపారు.

ఏడో తరగతి వరకు చదువుకున్న తన తండ్రికి ఓ చిన్న ఉద్యోగం వచ్చిన తర్వాత పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయని భాస్కర్‌ తెలిపారు. 100 కి.మీ దూరంలోని ఓ స్కూల్‌లో తన తండ్రికి వంట చేసే పని దొరికిందని పేర్కొన్నారు. అక్కడి వరకు వెళ్లడానికి సరైన ప్రయాణ వసతులు కూడా ఉండేవి కాదని తెలిపారు. ఒకసారి ఇంటి నుంచి వెళ్లిన తర్వాత అసలు అక్కడికి చేరుకున్నారా లేదా కూడా తెలిసేది కాదన్నారు. మళ్లీ రెండు, మూడు నెలలకు తిరిగొచ్చేవారన్నారు. కొన్నాళ్లకు ఆ స్కూల్‌ ఉన్న కసనూర్‌కు కుటుంబం మొత్తం మకాం మార్చిందని పేర్కొన్నారు.

భాస్కర్‌ ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు కసనూర్‌లోనే చదువుకున్నారు. తర్వాత స్కాలర్‌షిప్‌పై యవత్మల్‌లో ఉన్న ప్రభుత్వ విద్యానికేతన్‌లో పదో తరగతి వరకు విద్యను కొనసాగించారు. అనంతరం గడ్చిరోలినోని ఓ కాలేజీలో బీఎస్సీలో డిగ్రీ పూర్తిచేశారు. తర్వాత నాగర్‌పూర్‌లో కెమిస్ట్రీలో మాస్టర్స్‌ పట్టా పుచ్చుకున్నారు. 2003లో ప్రఖ్యాత లక్ష్మీనారాయణ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరారు. మహారాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలో పాస్‌ అయినప్పటికీ.. భాస్కర్‌కు పరిశోధనపై ఆసక్తి తగ్గలేదు. పీహెచ్‌డీ నిమిత్తం అమెరికా వెళ్లి డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏలో పరిశోధనలు చేశారు. 'మిషిగన్‌ టెక్నాలజికల్‌ యూనివర్సిటీ' నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. ప్రస్తుతం సిర్నావోమిక్స్‌లో పనిచేస్తున్న తనకు.. తమ సంస్థల్లో చేరాలని కోరుతూ ప్రతివారం ఓ అరడజను కంపెనీల నుంచి ఇ-మెయిల్స్‌ వస్తుంటాయని ఆయనే స్వయంగా తెలిపారు.

విజయంలో తల్లిదండ్రుల పాత్ర..
తన విజయం వెనుక తన తల్లిదండ్రుల పాత్ర కీలకమైందని భాస్కర్‌ అన్నారు. వారు లేకుంటే తాను ఇక్కడి వరకు వచ్చి ఉండేవాణ్ని కాదన్నారు. తన తల్లిదండ్రుల కోసం చిర్చాడీలో ఓ ఇల్లు నిర్మించారు. కొన్నేళ్ల క్రితమే ఆయన తండ్రి చనిపోయారు. ఇటీవల మహారాష్ట్ర గిరిజన అభివృద్ధి విభాగం అదనపు కమిషనర్‌ రవీంద్ర ఠాక్రే గడ్చిరోలిలో భాస్కర్‌ను సత్కరించారు. 'ట్రైబల్‌ సెలబ్రిటీతో చాయ్‌' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఆయనతోనే ప్రారంభించారు.

ఇవీ చదవండి: తాను చనిపోయి మరో ఇద్దరిని బతికించిన 18 నెలల చిన్నారి.. చిన్న వయసులోనే అవయవదానం

నక్సలైట్ రాజ్యంలో విద్యా కుసుమాలు.. యువత భవితకు దిక్సూచిగా నీతి ఆయోగ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.