ETV Bharat / bharat

చెదిరిన భాజపా 'బంగాల్​' స్వప్నం.. కానీ...

author img

By

Published : May 2, 2021, 6:04 PM IST

'మిషన్​ బంగాల్'​లో భాజపా డీలా పడింది. తృణమూల్​ కాంగ్రెస్​కే మరోసారి అధికారం దక్కింది. కానీ ఈ ఎన్నికల్లో కమలదళం భారీగా పుంజుకుంది. బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. కానీ అనుకున్న లక్ష్యాన్ని చేరకపోవడం పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేసే విషయమే. మరి ఇందుకు కారణాలేంటి? భాజపా తదుపరి వ్యూహాలేంటి?

top-reasons-behind-bjps-defeat-in-bengal
చెదిరిన భాజపా 'బంగాల్​' స్వప్నం.. కానీ...

"బంగాల్​ గడ్డపై కాషాయ జెండా..." ఇదీ భాజపా చిరకాల స్వప్నం. ఈ దఫా ఎన్నికల్లో ఎలాగైనా ఆ కల నెరవేర్చుకోవాలని ఊవిళ్లూరింది కమలదళం. కానీ టీఎంసీకే ప్రజలు మరోమారు పట్టంగట్టారు. భాజపా ప్రయోగించిన.. ప్రభుత్వం వ్యతిరేకత, హిందుత్వ సిద్ధాంతం వంటి అస్త్రాలు సరైన ఫలితాలను ఇవ్వలేదు. కమలదళం చేసిన విశ్వప్రయత్నాలు ఫలించలేదు.

అయితే ఎన్నికల లెక్కలను క్షుణ్నంగా పరిశీలిస్తే.. ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్రంలో భాజపా జెండా ఎగరవేయలేకపోయినా.. తన బలాన్ని మాత్రం భారీగా పెంచుకుంది.

గతంలో...

2011లో వామపక్షాల కంచుకోటను టీఎంసీ బద్దలు కొట్టి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత.. వామపక్షాలు, కాంగ్రెస్ క్రమంగా పట్టుకోల్పోగా భాజపా ఎదుగుదల సాధ్యపడింది. 2014లో కాషాయ పార్టీ సొంతంగా 19శాతం ఓట్లు, రెండు లోక్‌సభ సీట్లు గెలుచుకుంది. 2016లో మూడు అసెంబ్లీ సీట్లు, 11శాతం ఓట్లు సాధించింది. 2019 లోక్​సభ ఎన్నికల్లో ఏకంగా 40శాతం ఓట్లతో 18 సీట్లు దక్కించుకుంది.

ఇదీ చూడండి:- 'కరోనా యోధులపై పని భారం తగ్గించేదెలా?'

అప్పుడే భాజపా శ్రేణుల్లో ఆశలు చిగురించాయి. 'బంగాల్​'​ కల సాధ్యపడేలా కనిపించింది. కానీ అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైంది. ఇందుకు కారణాలు లేకపోలేదు..!

స్థానిక మంత్రంతో...!

బంగాల్​లో 'స్థానిక' మాటకు విలువ ఎక్కువ. దీనిని ఉపయోగించుకుని తృణమూల్​ కాంగ్రెస్​.. భాజపాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. భాజపాను బయటి మనిషిగా చిత్రీకరించింది. 'గుజరాత్​ నుంచి పాలించే వారు మనకు వద్దు' అంటూ నినాదాలు చేస్తూ ప్రజల్లోకి వెళ్లింది టీఎంసీ. ఇందులో విజయం సాధించింది అనడానికి ఎన్నికల ఫలితాలే సాక్ష్యం.

అటు మమతా బెనర్జీ కూడా కమలదళ వ్యూహాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టారు. తనకు వ్యతిరేకంగా భాజపా శ్రేణులు చేస్తున్న ఆరోపణలకు ఘాటుగా జవాబిచ్చారు. 'బంగాల్​ ఆత్మగౌరవం', 'బంగాల్​ ముద్దుబిడ్డ' అంటూ తనను తాను ప్రజల ముందు నిలబెట్టుకున్నారు. తనను గెలిపిస్తే బంగాల్​ కూతురు గెలిచినట్టేనని ప్రజలకు నమ్మకం కలిగించారు. ఇవి.. బంగాల్​లో భాజపా గెలుపును అడ్డుకునేందుకు ఉపయోగపడ్డాయని విశ్లేషకులు అంటున్నారు.

మమత కూడా కుదిరినప్పుడల్లా.. భాజపాను ఇరకాటంలో పెట్టారు. దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వమే కారణమంటూ నిరసనలు చేపట్టారు. కరోనా కేసుల విషయంలోనూ ఘాటుగా స్పందించారు.

చేరికలతో చేటు?

ఎన్నికలు దగ్గర పడిన కొద్దీ.. భాజపాలో చేరికలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇదే ఆ పార్టీకి ఒకింత చేటు చేశాయని చెప్పుకోవచ్చు. సీట్ల పంపకంలో అసంతృప్తి ప్రత్యక్షంగానే కనిపించింది. నేతలు, కార్యకర్తలు.. భాజపా కార్యాలయాలపై దాడికి దిగిన సందర్భాలు అనేకం. ఇతర పార్టీల నాయకులకు ఎన్నికల్లో సీట్లు ఇవ్వడం వల్ల మొదటి నుంచి పార్టీలోనే ఉన్న నేతలు, వారి అనుచరగణంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇవన్నీ భాజపా విజయ అవకాశాలకు గండి కొట్టినట్టు స్పష్టమవుతోంది.

తర్వాత ఏంటి?

రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బరిలో దిగిన భాజపా.. అనుకున్నది సాధించలేకపోయింది. అయినప్పటికీ.. గత ఎన్నికలతో పోల్చుకుంటే.. భారీ స్థాయిలో సీట్లను వెనకేసుకోగలిగింది. నాడు మూడు సీట్లకే పరిమితం కాగా.. ఈసారి ప్రధాన ప్రతిపక్షం స్థాయికి ఎదిగింది. మరింత బలాన్ని పుంజుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో కొంత పట్టు సాధించింది. రానున్న రోజుల్లో ఇది ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారే అవకాశమూ ఉంది.

ఇదీ చూడండి:- ఒడిశాలో 14 రోజులు పూర్తి స్థాయి లాక్​డౌన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.