ETV Bharat / bharat

''ది కేరళ స్టోరీ' సినిమా మేము చూస్తాం'.. బంగాల్​ ప్రభుత్వ బ్యాన్​పై సుప్రీం స్టే

author img

By

Published : May 18, 2023, 4:06 PM IST

Updated : May 18, 2023, 5:34 PM IST

the-kerala-story-movie-supreme-court-stays-bengal-govt-ban-on-the-kerala-story-film
ది కేరళ స్టోరీ

The Kerala Story Movie : బంగాల్‌లో 'ది కేరళ స్టోరీ' సినిమాను రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్​ చేయడంపై భారత అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. సినీ ప్రేక్షకులకు భద్రత కల్పించాలని స్టాలిన్‌ ప్రభుత్వాన్ని సైతం సుప్రీంకోర్టు ఆదేశించింది. చట్టపరమైన నిబంధనలతో సినిమాను ఆపే యత్నం చేయకూడదని బెంచ్‌ సూచించింది.

The Kerala Story Movie : 'ది కేరళ స్టోరీ' సినిమాపై బంగాల్‌ ప్రభుత్వం బ్యాన్​ చేయడంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ చిత్ర ప్రదర్శన అడ్డుకోవాలని చూడడం సరికాదని, అలా అనుకుంటే సినిమాలన్నీ కోర్టులకే చేరతాయని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ చిత్రానికి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌- సీబీఎఫ్​సీ సర్టిఫికెట్‌ జారీ చేసిందని పేర్కొంది. కాబట్టి, శాంతి భద్రతల పరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. చట్టపరమైన నిబంధనలతో సినిమాను ఆపే యత్నం చేయకూడదని బెంచ్‌ వ్యాఖ్యానించింది.

మరోవైపు తమిళనాడులో సినీ ప్రేక్షకులకు భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు స్టాలిన్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 'ది కేరళ స్టోరీ' సినిమాపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి నిషేధం లేదని తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన హామీని సుప్రీం కోర్టు పరిగణలోకి తీసుకుంది. ప్రతి సినిమా హాలులో తగిన భద్రత కల్పించాలని, సినిమా ప్రేక్షకుల భద్రతకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్టాలిన్‌ సర్కారును సుప్రీంకోర్టు ఆదేశించింది. 'ది కేరళ స్టోరీ'కి సీబీఎఫ్​సీ సర్టిఫికేషన్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను.. జూలై రెండో వారంలో విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. నిర్ణయం తీసుకునే ముందు చిత్రాన్ని తాము చూడాలనుకుంటున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. సినిమా చూశాకే ధ్రువీకరణ అంశంపై పిటిషన్లు విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

అంతకుముందు నిర్మాతల తరఫున హాజరైన సీనియర్​ న్యాయవాది హరీష్ సాల్వే.. 32వేల మంది మహిళలు ఇస్లాంలోకి మారారనే దానిపై సరైన ప్రామాణికమైన డేటా లేదని బెంచ్​కు తెలిపారు. ఈ చిత్రం కల్పిత వెర్షన్​ను సూచిస్తోందని ఆయన వివరించారు. దీనిని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. "32వేల మంది మహిళలు ఇస్లాంలోకి మారారనే దానిపై సరైన ప్రామాణికమైన డేటా లేదు. ఈ చిత్రం కల్పిత వెర్షన్​ను సూచిస్తుంది." అనే డిస్​క్లైమర్​ను వేయాలని నిర్మాతలకు సూచించింది.

'ది కేరళ స్టోరీ'ని దర్శకుడు సుదీప్తోసేన్‌ తెరకెక్కించారు. కేరళలో కొన్నేళ్లుగా 32 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలు, వారి ఆచూకీ ఎక్కడనే ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి నిర్మాతగా విపుల్‌ అమృత్‌లాల్‌ షా వ్యవహరించారు. అదా శర్మ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. అయితే ఈ సినిమా చిత్ర ప్రదర్శనలను నిషేధిస్తూ మే 8న బంగాల్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సినిమా వక్రీకరించిన కథ అని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.

Last Updated :May 18, 2023, 5:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.