ETV Bharat / bharat

Terrorism: భారత్​ లక్ష్యంగా ఎత్తుకు పైఎత్తులు.. నదులే నావిగేటర్లు!

author img

By

Published : Nov 10, 2022, 7:14 AM IST

సరిహద్దుకు ఆవల పాకిస్థాన్‌ పెంచి పోషిస్తున్న విదేశీ ఉగ్రవాదులు ఓ వైపు.. ఇప్పటికే చొరబడి అదను కోసం ఎదురుచూస్తున్న వారు మరోవైపు.. స్థానికంగా ఉగ్రవాదంవైపు మళ్లుతున్న వారు ఇంకోవైపు.. ఇవన్నీ భారత్​ను ఉక్కిరిబిక్కిరి చేసే కుట్రలో భాగమే. ప్రస్తుతం వీటిని భద్రతా బలగాలు బలంగా తిప్పికొడుతున్నప్పటికీ.. ఏ క్షణామైనా ఉగ్రమూకలు దాడులకు తెగబడొచ్చు. కశ్మీర్​లో ఉగ్రవాద పరిస్థితులపై క్షేత్రస్థాయి కథనం..

terrorists using high end technology in kashmir
terrorists using high end technology in kashmir

సరిహద్దుకు ఆవల పాకిస్థాన్‌ పెంచి పోషిస్తున్న విదేశీ ఉగ్రవాదులు ఓ వైపు.. ఇప్పటికే చొరబడి అదను కోసం ఎదురుచూస్తున్న వారు మరోవైపు.. స్థానికంగా ఉగ్రవాదంవైపు మళ్లుతున్న వారు ఇంకోవైపు.. వెరసి కశ్మీర్‌లో కల్లోలం రేపేందుకు ఎదురుచూస్తున్నవారు ఎందరో. భద్రతా బలగాల చర్యల నేపథ్యంలో ప్రస్తుతానికి వీరంతా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నప్పటికీ ఏ క్షణమైనా విరుచుకుపడే ముప్పు పొంచిఉంది. చొరబాట్లను కట్టడి చేసేందుకు భద్రతా బలగాలు కొన్ని దశాబ్దాలుగా కృషి చేస్తూనే ఉన్నాయి. కానీ, పూర్తిస్థాయిలో సఫలం కావడంలేదు. అక్కడున్న భౌగోళిక, ఇతర ప్రత్యేక పరిస్థితులే ఇందుకు కారణం. ఏ మాత్రం అవకాశం చిక్కినా లోనికి చొచ్చుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఉగ్రమూకలు అమలుచేస్తున్న భిన్నమైన వ్యూహాలపై క్షేత్రస్థాయి కథనం..

నదులే నావిగేటర్లు
చాలా ప్రాంతాల్లో నదికి ఆవల పీవోకే, ఇటువైపు మన సరిహద్దు ఉంటుంది. నది దాటితే లోనికి చొరబడవచ్చు. ఉదాహరణకు కుప్వారా జిల్లాలోని తీత్వాల్‌ గ్రామం వద్ద సరిహద్దు ఉంది. జీలం నది ఇక్కడ రెండు దేశాలను విభజిస్తుంది. ఇక్కడ వంతెన మధ్యలో తెల్లటి గీతే సరిహద్దు. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది మనదేశంలోకి చొరపడ్డ తర్వాత జీపీఎస్‌ ఉపకరణాలు, ఫోన్లు వాడేవారు. అలా చేస్తే దొరికిపోతున్నామని.. ప్రత్యామ్నాయ మార్గాల్లో భాగంగా నదులనూ వినియోగించుకుంటున్నారు.

terrorists using high end technology in kashmir
.

పీవోకేలోని పీర్‌పంజల్‌ కనుమల్లో మొదలయ్యే జీలం నది కశ్మీర్‌లోకి ప్రవేశిస్తుంది. ఉడి వద్ద దేశంలో ప్రవేశించి శిరి, బారాముల్లా, సోపూర్‌, వల్లర్‌ మీదుగా శ్రీనగర్‌, అనంతనాగ్‌ వరకూ వెళుతుంది. ప్రతి ఉగ్రవాది అంతిమ లక్ష్యం శ్రీనగర్‌ చేరుకోవడం. అందుకే చొరబడ్డ వారు ఈ నదిని ఆనుకొని ప్రయాణం మొదలుపెడితే శ్రీనగర్‌ చేరుకోవచ్చు. నదిలో నీటి చప్పుడు ఆధారంగా దాని పక్కనే నడుచుకుంటూ వచ్చేవారూ ఉంటారని బీఎస్‌ఎఫ్‌ అధికారి ఒకరు చెప్పారు. మరోవైపు చొరబాట్ల నిరోధానికి కంచె ఏర్పాటు చేసినప్పటికీ చాలా సందర్భాల్లో దీనివల్ల ఉపయోగం ఉండటంలేదు. కొన్నిసార్లు ఉగ్రవాదులు ఏకంగా కంచెను కత్తిరించుకొని చొరబడుతుంటారు.

అత్యాధునిక పరిజ్ఞానం
భద్రతాదళాలకు దీటుగా ఉగ్రవాదులూ అత్యాధునిక పరిజ్ఞానం వాడుతున్నారు. సరిహద్దులు దాటి వచ్చిన తర్వాత తమ గైడ్లను కలుసుకునేందుకు ఏకంగా యాప్‌లు వినియోగిస్తుండటం గమనార్హం. ఎక్కడికి చేరుకోవాలో ఈ యాప్‌లో పాకిస్థాన్‌లో ఉన్న కమాండర్లు ముందుగానే ఫీడ్‌ చేస్తారు. దీని ఆధారంగా ప్రయాణిస్తుంటారు.
లక్ష్యానికి చేరుకున్న తర్వాత గైడ్‌ మిగతా పనులు చూసుకుంటాడు. అలానే పాకిస్థాన్‌లో సమకూర్చిన శాటిలైట్‌ఫోన్‌ని హాట్‌స్పాట్‌ ద్వారా తమ ఫోన్తో అనుసంధానం చేసుకుంటారు. దీంతో వీరు వాడే ఫోన్‌ భద్రతా నిపుణులకూ దొరకదు. వారున్న లోకేషన్‌ విషయంలో తప్పుదారి పట్టించేలానూ కొన్ని యాప్‌లలో ఫీచర్లు ఉంటాయని ఓ అధికారి తెలిపారు.

terrorists using high end technology in kashmir
.

పది రోజులైనా..
చొరబడ్డ ఉగ్రవాదులు తమ లక్ష్యం చేరుకునే వరకూ కనీసం పది రోజులైనా యాక్టీవ్‌గా ఉండేలా శిక్షణ ఇస్తారు. గరిష్ఠంగా ఒక్కో ఉగ్రవాది 200 బుల్లెట్లు, ఒక ఏకే-47, ఓ చిన్నతరహా పిస్తోలు, కొన్ని గ్రనేడ్లు, డ్రైఫ్రూట్స్‌ వంటివి తెచ్చుకుంటారని.. వీటితోనే రోజుల తరబడి పోరాడతారని సైనిక అధికారి ఒకరు వివరించారు. అనంతనాగ్‌లో ఈ ఏడాది మొదట్లో 400 చదరపు మీటర్ల పరిధిలో దాగిన ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు నలుదిక్కులా చుట్టుముట్టినా.. హతమార్చడానికి 3 రోజులు పట్టిందంటే వారికి ఇచ్చే శిక్షణ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు.

స్థానిక ఉగ్రవాదం
కశ్మీర్‌లో ప్రస్తుతం 85 మంది శిక్షణ పొందిన స్థానిక ఉగ్రవాదులు పనిచేస్తున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. స్థానికులను ఉగ్రవాదంవైపు మళ్లించేందుకు వివిధ సంస్థలు రకరకాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఉదాహరణకు పుల్వామా జిల్లాకు చెందిన ముగ్గురు పదో తరగతి విద్యార్థులు ఉగ్రవాద శిక్షణ కోసం సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద నాయకుడు తయ్యబ్‌ ఫరూకీ వీరిని సామాజిక మాధ్యమాల ద్వారా ఆకట్టుకున్నాడు. అలానే బారాముల్లా జిల్లాలో అనుమానాస్పద స్థితిలో బస్టాండు వద్ద తిరుగుతున్న ఓ 15 ఏళ్ల బాలుడ్ని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

అతన్ని ప్రశ్నించినప్పుడు దక్షిణ కశ్మీర్‌ వెళితే ఉగ్రవాద శిక్షణ, ఆయుధాలు ఇస్తారని, అందుకోసమే వెళుతున్నానని చెప్పాడు. చిన్నచిన్న కారణాలతోనూ ఉగ్రవాదంవైపు వెళుతున్నవారు అనేక మంది ఉన్నారని ఓ సైనిక అధికారి వెల్లడించారు. వీరిని కట్టడి చేయడమే ఇప్పుడు సవాలుగా మారిందన్నారు. అలానే 370 రద్దు తర్వాత కశ్మీర్‌ విషయంలో ఐ.ఎస్‌.ఐ. వ్యూహం మార్చుకుంది. స్థానికంగానే ఉగ్రవాదం పుట్టుకొస్తోందని ప్రపంచానికి చాటేందుకు కొత్తకొత్త సంస్థలను తెరమీదికి తెస్తోంది.

డ్రోన్ల ద్వారా ఆయుధాలు..
కశ్మీర్‌లో తయారవుతున్న ఉగ్రవాదుల కోసం ఆయుధాలను డ్రోన్ల ద్వారా జారవిడుస్తున్నారు. 2019లో జమ్ము సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్‌ బలగాలు 167 డ్రోన్లను గుర్తించారు. వీటి ద్వారా ఆయుధాలతోపాటు మత్తుమందులూ పంపుతున్నట్లు వెల్లడైంది. జమ్ము సమీపంలో ఉన్న ఆర్‌.ఎస్‌.పురా సెక్టర్‌లో ఒకేసారి డ్రోన్‌ ద్వారా జారవిడిచిన 4 పిస్తోళ్లు, 8 మ్యాగజైన్లు, 470 బుల్లెట్లను ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. ఎవరి దృష్టికీ రాకుండా ప్రత్యేకంగా రూపొందించిన డ్రోన్లను ఆయుధాల చేరవేతకు ఉపయోగిస్తున్నారని.. ఇది ఆందోళన కలిగించే అంశమని ఓ పోలీసు అధికారి తెలిపారు.

.

20 లాంచ్‌ప్యాడ్లు.. 150 మంది ఉగ్రవాదులు
పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై దాడి తర్వాత భారత వైమానిక దళం పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్లపై దాడికి దిగిన సంగతి తెలిసిందే. అప్పుడు మొదటిసారి ఈ లాంచ్‌ప్యాడ్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం కశ్మీర్‌ సరిహద్దులకు దగ్గరగా, పీవోకేలో 20 లాంచ్‌ప్యాడ్లు ఉన్నట్లు మన సైనికాధికారులు చెబుతున్నారు. వీటిలో సుమారు 150 మంది సుశిక్షితులైన ఉగ్రవాదులు చొరబాటుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఐ.ఎస్‌.ఐ. ఆదేశాలు అందగానే విడతలవారీగా కశ్మీర్‌లోకి చొచ్చుకొని రావాలన్నది వీరి వ్యూహమని కుప్వారాలో విధులు నిర్వహిస్తున్న ఓ సైనికాధికారి చెప్పారు.

అదను కోసం..
అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం కశ్మీర్‌లో 163 మంది ఉగ్రవాదులు ఉన్నారు. అనధికారికంగా ఇంకో 50 మంది వరకూ ఉండొచ్చని అంచనా. అయితే భద్రతా బలగాలు చురుగ్గా ఉండటం వల్ల వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించి.. హైబ్రిడ్‌ ఉగ్రవాదుల ద్వారా ముష్కర సంస్థలు తమ లక్ష్యాలను నెరవేర్చుకుంటున్నాయని కె-ఫోర్స్‌కు చెందిన ఓ బ్రిగేడియర్‌ వెల్లడించారు. అదను కోసం ఎదురుచూస్తున్న వీరితో ముప్పు పొంచి ఉందని.. అందుకే అణువణువూ జల్లెడ పడుతున్నామని వివరించారు.

ఇవీ చదవండి : సంతలో సరకులుగా చట్టసభ్యులు.. ప్రమాదంలో ప్రజాస్వామ్యం!

నోట్ల రద్దుపై అఫిడవిట్ ఆలస్యం.. అవమానం అంటూ కేంద్రంపై సుప్రీం ఫైర్.. వారం డెడ్​లైన్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.