ETV Bharat / bharat

'మన నేరన్యాయ వ్యవస్థే ఒక శిక్ష'.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

author img

By

Published : Nov 30, 2022, 7:15 AM IST

మన నేరన్యాయ వ్యవస్థే ఒక శిక్షగా మారుతుంటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2008లో పంజాబ్‌లో ఒకరిని ఆత్మహత్యకు పురిగొల్పారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురిని జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌.ఓక్‌ల ధర్మాసనం ఈ నెల 24న విడుదల చేస్తూ ఈ వ్యాఖ్య చేసింది. మరోవైపు, చిన్న చిన్న కేసుల్లో జైళ్లపాలై బెయిల్‌ మంజూరైనా పూచీకత్తు సమర్పించుకోలేక బందీలుగానే ఉండిపోతున్న ఖైదీల వివరాలను తెలపాలని దేశంలోని కారాగారాలన్నింటినీ సుప్రీంకోర్టు ఆదేశించింది

Etv supreme court
supreme court

మన నేరన్యాయ వ్యవస్థే ఒక శిక్షగా మారుతుంటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2008లో పంజాబ్‌లో ఒకరిని ఆత్మహత్యకు పురిగొల్పారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురిని జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌.ఓక్‌ల ధర్మాసనం ఈ నెల 24న విడుదల చేస్తూ ఈ వ్యాఖ్య చేసింది. దిగువకోర్టు తీర్పుపై అపీలును పంజాబ్‌-హరియాణా హైకోర్టు 2009 ఏప్రిల్‌లో కొట్టివేసింది. దీనిపై దాఖలైన అప్పీళ్లు 13 ఏళ్లుగా పెండింగులో ఉన్న విషయాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది.

మన నేరన్యాయ వ్యవస్థే శిక్ష అనడానికి ఈ కేసే ఉదాహరణ అని తెలిపింది. 'మద్యం మత్తులో కళాశాలలో పాల్పడిన దుష్ప్రవర్తనకు గానూ విద్యార్థిని మందలించి, క్రమశిక్షణ చర్యల్లో భాగంగా తండ్రిని పిలిపించే ప్రయత్నం చేశారు. తండ్రి రాకపోయినా ఆ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అది దురదృష్టకర ఘటన' అని పేర్కొంది. వేరే విద్యార్థులు తప్పుచేస్తే తన కుమారుడిని నిందించారని మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై ప్రిన్సిపాల్‌ సహా ముగ్గురిపై కేసు నమోదైంది. తనయుడిని కోల్పోయిన తండ్రి ఆవేదనను తాము అర్థం చేసుకుంటున్నామని ధర్మాసనం పేర్కొంది.

'బెయిలు మంజూరైనా జైళ్లలోనే మగ్గుతున్న ఖైదీల వివరాలివ్వండి'
చిన్న చిన్న కేసుల్లో జైళ్లపాలై బెయిల్‌ మంజూరైనా పూచీకత్తు సమర్పించుకోలేక బందీలుగానే ఉండిపోతున్న ఖైదీల వివరాలను తెలపాలని దేశంలోని కారాగారాలన్నింటినీ సుప్రీంకోర్టు ఆదేశించింది. అటువంటి ఖైదీల పేర్లు, వారిపైనున్న అభియోగాలు, బెయిల్‌ మంజూరైన తేదీ, బెయిల్‌ వచ్చినా ఎన్నాళ్ల నుంచి లోపలే ఉండిపోయారు... తదితర వివరాలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయాలని జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా ధర్మాసనం తెలిపింది. ఆ ఖైదీల వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలు 15 రోజుల్లోగా జాతీయ న్యాయ సేవా సంస్థ(ఎన్‌ఎల్‌ఎస్‌ఏ)కు పంపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టులో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తూ... నిరుపేదలైన గిరిజనులు బెయిల్‌ మంజూరైనా పూచీకత్తు సమర్పించుకోలేని దుస్థితిలో విచారణ ఖైదీలుగా జైళ్లలోనే మగ్గిపోతున్నారని తెలిపారు. అటువంటి వారిని ఆదుకోవడం కోసం న్యాయవ్యవస్థ ఏమైనా చేయాలని సూచించారు. రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో అదే వేదికపై సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌ ఉన్నారు. ఓ కేసు విచారణ సందర్భంగా మంగళవారం జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా ధర్మాసనం దేశంలోని జైళ్లన్నిటికీ ఆదేశాలిస్తూ...బెయిల్‌ మంజూరైనా విచారణ ఖైదీలుగా ఉన్న వారి వివరాలను పంపిస్తే అటువంటి వారి విడుదలకు జాతీయ స్థాయిలో ఒక విధానాన్ని ఎన్‌ఎల్‌ఎస్‌ఏ రూపొందిస్తుందని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.