ETV Bharat / bharat

ముగిసిన ప్రచార పర్వం.. గుజరాత్​లో తొలివిడత ఎన్నికలకు సర్వం సిద్ధం

author img

By

Published : Nov 30, 2022, 6:18 AM IST

gujarat assembly election 2022
gujarat assembly election 2022

Gujarat Elections 2022: గుజరాత్‌ శాసనసభకు తొలి దశ ఎన్నికల పోలింగ్‌కు.. సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ప్రచార గడువు ముగియగా.. గురువారం పోలింగ్‌ జరగనుంది. దక్షిణ గుజరాత్‌లోని 19 జిల్లాలు, కచ్-సౌరాష్ట్ర ప్రాంతాల్లోని 89 స్థానాలకు.. 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి భవితవ్యాన్ని.. 2 కోట్ల 39 మంది లక్షల మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఆప్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాస్‌ గాధ్వి.. క్రికెటర్‌ రవీంద్ర జడేజా సతీమణి రివాబా.. గుజరాత్‌ మాజీ మంత్రి పుర్షోత్తం సోలంకీ.. తొలి విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Gujarat Elections 2022: ప్రధాని నరేంద్రమోదీ అడ్డాలో తొలి దశ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. గుజరాత్‌లో పాగా వేసేందుకు అధికార, ప్రతిపక్షాలు చేసిన.. విస్తృత ప్రచారానికి మంగళవారంతో తెరపడింది. గురువారం దక్షిణ గుజరాత్‌లోని.. 19 జిల్లాలు, కచ్-సౌరాష్ట్ర ప్రాంతాల్లోని 89 స్థానాలకు.. ఓటింగ్‌ జరగనుంది. తొలిదశలో 89 స్థానాలకు మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 718 మంది పురుషులు.. 70 మంది మహిళలు తమ అదృష్టాన్ని.. పరీక్షించుకుంటున్నారు. భాజపా, కాంగ్రెస్‌, ఆప్‌ అన్ని స్థానాలకు పోటీ చేస్తుండగా.. బీఎస్​పీ 57, బీటీపీ 14, ఎస్​పీ 12.. వామపక్షాలు 6 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించాయి. 339 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. మొదటి దశలో భాజపా తొమ్మిది, కాంగ్రెస్ ఆరు, ఆప్ ఐదుగురు మహిళా అభ్యర్థులను బరిలోకి దింపింది. తొలి విడత జరిగే స్థానాల్లో మొత్తం 2 కోట్ల 39 లక్షల 76 వేల 670 మంది ఓటర్లు.. తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 1.24 కోట్ల మంది పురుషులు.. 1.15 కోట్ల మంది మహిళలు.. 497 మంది ట్రాన్స్‌ జెండర్లు ఉన్నారు.

మొదటి దశ ఎన్నికల్లో 25,434 పోలింగ్ బూత్‌లలో ఓటింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో 9,018, గ్రామీణ ప్రాంతాల్లో 16,416 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. మొత్తం 2,20,288 మంది పోలింగ్‌ సిబ్బంది విధుల్లో పాల్గొంటారని సీఈసీ వెల్లడించింది. ఇటు మొదటి దశ పోలింగ్‌లో ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దేవభూమి ద్వారక జిల్లాలోని ఖంభాలియా నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి ఇసుదాన్ గాధ్వి పోటీ చేస్తున్నారు. గుజరాత్ మాజీ మంత్రి పురుషోత్తం సోలంకీ.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కున్వర్జీ బవలియా.. కాంతిలాల్ అమృతియా.. క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా.. ఆప్‌ గుజరాత్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా కూడా బరిలో ఉన్నారు.

గుజరాత్‌ శాసనసభలో మొత్తం 182 స్థానాలు ఉండగా.. మొదటిసారి త్రిముఖ పోటీ జరగనుంది. అధికార భారతీయ జనతా పార్టీ.. ప్రతిపక్ష కాంగ్రెస్‌ సహా.. ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. గుజరాత్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని మోదీ ముందుండి నడిపించగా.. అమిత్‌ షా కూడా విస్తృతంగా సభల్లో పాల్గొన్నారు. ఆప్‌ జాతీయ కన్వీనర్ ఐదు నెలలు గుజరాత్‌లోనే మకాం వేసి ప్రచారాన్ని హోరెత్తించారు. కాంగ్రెస్‌ కీలక నేతలు గుజరాత్‌లో ప్రచారం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.