భారత్‌లో అక్క.. పీఓకేలో తమ్ముడు.. 75 ఏళ్ల తర్వాత కలుసుకుని కన్నీళ్లు

author img

By

Published : May 24, 2023, 9:08 PM IST

Punjab: Brother and sister reunite after 75 years at Pakistan's Sri Kartarpur Sahib Gurudwara

దేశ విభజన కారణంగా సరిగ్గా 75 ఏళ్ల క్రితం ఆ రెండు కుటుంబాలు విడిపోయాయి. దీంతో ఒకే కుటుంబంలోని అక్కాతమ్ముడు రెండు వేర్వేరు దేశాల్లో స్థిరపడ్డారు. ఎట్టకేలకు పాకిస్థాన్​-భారత్​ కర్తార్‌పుర్ కారిడార్​ నిర్మాణం కారణంగా సుమారు 80 ఏళ్ల వయసులో మళ్లీ వారిద్దరు కలుసుకున్నారు. పాకిస్థాన్​లోని ఓ ప్రముఖ గురుద్వారా సాక్షిగా ఈ అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది.

75 ఏళ్ల తర్వాత కలుసుకున్న అక్కాతమ్ముళ్లు.. గురుద్వారా సాక్షిగా ఆత్మీయ కలయిక!

దేశ విభజన సమయంలో విడిపోయిన అక్కాతమ్ముడు పాకిస్థాన్​లోని గురుద్వార శ్రీ కర్తార్‌పుర్ సాహిబ్‌ సాక్షిగా మళ్లీ కలుసుకున్నారు. భారత్​-పాకిస్థాన్​ల మధ్య నిర్మించిన కర్తార్‌పుర్ కారిడార్​ కారణంగా సరిగ్గా 75 తర్వాత అక్కాతమ్ముడు ఆదివారం (మే21న) అనుకోకుండా కలుసుకోగలిగారు. సోదరిని కలిసిన ఆనందంలో తమ్ముడు.. సోదరుడిని చూసిన సంతోషంలో అక్క ఇద్దరూ భావోద్వేగానికి లోనై ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఇలా సుమారు 80 ఏళ్లు నిండిన వీరిద్దరి ఆత్మీయ కలయికతో ఇరు కుటుంబాల్లోని అనందానికి అవధుల్లేకుండా పోయాయి.

అక్కకు 81.. తమ్ముడికి 78!
1947లో భారత్​, పాకిస్థాన్‌ల విభజనకు ముందు 81 ఏళ్ల మహీందర్ కౌర్ (సోదరి), 78 సంవత్సరాల షేక్ అబ్దుల్లా అజీజ్ (సోదరుడు) కుటుంబాలు భారత్​లో నివసించేవి. దేశ విభజన తర్వాత రెండు కుటుంబాలు విడిపోయాయి. ఇస్లాం మతంలోకి మారిన అజీజ్ చిన్న వయసులోనే వివాహం చేసుకొని పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లో తన కుటుంబంతో స్థిరపడ్డాడు. అయితే సర్దార్​ భజన్​ సింగ్​, మహీందర్ కౌర్​ కుటుంబం మాత్రం పంజాబ్​లో స్థిరపడింది. కాగా, మిగతా కుటుంబ సభ్యులు భారత్​లోనే ఉండిపోయారు.

సోషల్​ మీడియా​ ద్వారా..
అజీజ్​ విడిపోయిన తన కుటుంబ సభ్యులను ఎలాగైనా కలుసుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ, ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో వారిద్దరూ (అక్కాతమ్ముళ్లని) 1947లో దేశ విభజన సందర్భంగా విడిపోయారని ఓ సామాజిక మాధ్యమాల పోస్టు ద్వారా రెండు కుటుంబాలూ తెలుసుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా కర్తార్‌పుర్‌ కారిడార్​ వేదికగా కుటుంబ సభ్యులతో కలిసి.. పట్టరాని ఆనందంతో అక్కాతమ్ముళ్లు కలుసుకున్నారు. మహేంద్ర కౌర్‌ తన సోదరుడిని పదేపదే హత్తుకుంటూ అతని చేతుల మీద ముద్దులు పెట్టారు. అనంతరం ఇద్దరూ కలిసి తమ తల్లిదండ్రుల మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు.

Punjab: Brother and sister reunite after 75 years at Pakistan's Sri Kartarpur Sahib Gurudwara
మహీందర్ కౌర్, షేక్ అబ్దుల్లా అజీజ్(అక్కాతమ్ముళ్లు)

ప్రభుత్వాల కృషికి ధన్యవాదాలు!
ఈ విషయం తెలుసుకున్న కర్తార్‌పుర్‌ అధికారులు మహీందర్ కౌర్​, షేక్ అబ్దుల్లా అజీజ్​లకు పూలమాల వేసి మిఠాయిలు పంచారు. అనంతరం రెండు కుటుంబాలు కలిసి సాహిబ్(గురుద్వారా)​ను దర్శించుకున్నాయి. తర్వాత అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా మహీందర్ కౌర్ రెండు దేశాల ప్రజల కోసం భారత్, పాకిస్థాన్​ ప్రభుత్వాలు కలిసి కర్తార్‌పుర్ కారిడార్​ను ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఏంటీ కర్తార్‌పుర్ కారిడార్​?
రెండు దేశాల్లో సిక్కు మతస్థుల సందర్శనార్థం పాకిస్థాన్​లోని కర్తార్​పుర్​ నుంచి భారత్​లోని గురుదాస్​పుర్​ వరకు కారిడార్​ను భారత్​-పాక్​ ప్రభుత్వాలు కలిసి ఏర్పాటు చేశాయి. 2019 నవంబర్​లో ఈ కారిడార్​ను ప్రారంభించాయి. పాక్​లోని నరోవాల్ జిల్లా రావి నది సమీపంలో కర్తార్​పుర్ సాహిబ్ గురుద్వారా ఉంది. డేరాబాబా నానక్​ మందిరం నుంచి ఈ ప్రాంతం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ తన జీవిత చరమాంకాన్ని కర్తార్​పుర్​లోనే గడిపినట్లు భక్తులు విశ్వసిస్తారు. 18 ఏళ్ల పాటు గురునానక్ ఈ ప్రాంతంలో గడిపారు. భారత్​లోని అన్ని మతాల ప్రజలకు ఈ చారిత్రక గురుద్వారాను సందర్శించుకోవడానికి ఎటువంటి ఆంక్షలు లేని అనుమతి ఉంటుంది. ప్రస్తుతం ఈ కారిడారే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం విడిపోయిన రెండు కుటుంబాలను ఒక్కటి చేశాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.