ETV Bharat / bharat

అసోం మినహా ఎక్కడా భాజపా గెలవదు: పవార్‌

author img

By

Published : Mar 15, 2021, 5:01 AM IST

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల నేపథ్యంలో భాజపాపై కీలక వ్యాఖ్యలు చేశారు నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ)అధినేత శరద్‌పవార్‌. అసోం మినహా మిగతా చోట్ల భాజపా గెలవదని జోస్యం చెప్పారు. బంగా‌ల్​లో భాజపా అధికార దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.

sharad-pawar-comments-on-five-state-elections
అసోం మినహా ఎక్కడా భాజపా గెలవదు: పవార్‌

బంగాల్‌, తమిళనాడు, అసోం, కేరళ, పుదుచ్చేరి(కేంద్రపాలిత ప్రాంతం)లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పార్టీలన్నీ గెలుపుకోసం భారీగా ప్రచారాలు చేస్తూ ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. అయితే, ఆ పార్టీల గెలుపోటములపై నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ)అధినేత శరద్‌పవార్‌ పుణెలో మీడియాతో మాట్లాడుతూ.. తన అభిప్రాయాలను వెల్లడించారు. ఎన్నికల మినీ సమరంలో అసోం మినహా మిగతా చోట్ల భాజపా గెలవదని జోస్యం చెప్పారు. బంగాల్‌లో భాజపా అధికార దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ఐదు రాష్ట్రాల్లో ప్రస్తుత ఎన్నికల ధోరణి దేశానికి కొత్త దిశానిర్దేశం చేస్తుందని వ్యాఖ్యానించారు.

కేరళలో మేం.. తమిళనాడులో స్టాలిన్‌

ఐదు రాష్ట్రాల్లోని ఫలితాల గురించి ఇప్పుడే మాట్లాడుకోవడం సబబు కాదంటూనే.. కేరళలో వామపక్ష పార్టీలతో కలిసి ఎన్‌సీపీ పోటీ చేస్తోందని, వామపక్ష కూటమికే పూర్తి మెజార్టీ వస్తుందని శరద్‌ పవార్‌ ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు విషయానికొస్తే కచ్చితంగా డీఎంకే పార్టీ అధికారంలోకి వస్తుందని పవార్‌ తెలిపారు. అక్కడి ప్రజలు డీఎంకే పార్టీ, ఎంకే స్టాలిన్‌కే అధికారం కట్టబెడతారని చెప్పారు.

బంగాల్‌లో దీదీదే పీఠం

బంగాల్‌లో గెలుపు కోసం భాజపా అధికార దుర్వినియోగం చేస్తోందని ఎన్‌సీపీ చీఫ్‌ మండిపడ్డారు. ఆ రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్న సోదరి(మమతా బెనర్జీ)పై దాడులకు భాజపా యత్నిస్తోందన్నారు. అయినా, రాష్ట్రం మొత్తం తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జీవైపే ఉందన్నారు. బంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పార్టీనే అధికారంలోకి వస్తుందని, అందులో తనకు ఎలాంటి సందేహం లేదని తెలిపారు. పుదుచ్చేరిలో భాజపా ఓడిపోతుందన్నారు.

అసోంలో మాత్రం భాజపాదే హవా

అసోంలో ఎన్నికలకు సంబంధించి తనకు వచ్చిన సమాచారం ప్రకారం.. ఇతర పార్టీలతో పోలిస్తే అధికారంలో ఉన్న భాజపాకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శరద్‌ పవార్‌ వెల్లడించారు. అసోంలో భాజపా అధికారం తిరిగి దక్కించుకున్నా మిగతా రాష్ట్రాల్లో ఓటమి తప్పదని పేర్కొన్నారు. స్థానిక పార్టీలే ఆయా రాష్ట్రంలో అధికారంలోకి వస్తాయని తెలిపారు. ఈ ఎన్నికల ధోరణి కచ్చితంగా దేశానికి కొత్త దిశా నిర్దేశం చేస్తుందని శరద్‌ పవార్‌ వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: జేడీయూలో ఆర్‌ఎల్‌ఎస్​పీ విలీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.