ETV Bharat / bharat

కోర్టులపై రైతులు విశ్వాసం ఉంచాలి: సుప్రీం

author img

By

Published : Oct 1, 2021, 1:53 PM IST

Updated : Oct 2, 2021, 7:10 AM IST

దిల్లీ జంతర్​ మంతర్​ వద్ద సత్యాగ్రహ దీక్షకు(protest at jantar mantar) అనుమతించాలనే కిసాన్​ మహాపంచాయత్​(kisan mahapanchayat) పిటిషన్​పై విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు(Supreme court). సాగు చట్టాలను(New farm laws) సవాలు చేస్తూ గతంలోనే పిటిషన్​ వేశారని, ఇంకా నిరసనలు చేపట్టడంపై అసహనం వ్యక్తం చేసింది. కోర్టులపై రైతులు విశ్వాసం కలిగి ఉండాలని సూచించింది.

Supreme Court
సుప్రీం కోర్టు

"ఇప్పటికే నగరం పీక పిసికారు. ఇప్పుడు నగరం మధ్యలోకి వచ్చి ఆందోళన చేస్తామంటున్నారు.." అంటూ శుక్రవారం సుప్రీంకోర్టు రైతు సంఘంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జంతర్‌మంతర్‌లో 200 మంది రైతులతో శాంతియుతంగా సత్యాగ్రహం చేయడానికి అనుమతించాలని కోరుతూ కిసాన్‌ మహాపంచాయత్‌ చేసిన వినతిని పరిశీలిస్తూ ఈ వ్యాఖ్య చేసింది. దీనిని జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్విల్కర్‌, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా సాగిన వాదనలిలా...

ధర్మాసనం: ఆ మూడు చట్టాలను రద్దు చేయాలన్నదే మీ సమస్య. దీనిపై హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశారు. కోర్టును ఆశ్రయించిన తరువాత ఆందోళన కొనసాగించడంలో అర్ధం లేదు. మీరు న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారా?
న్యాయవాది: లేదు

ధర్మాసనం: న్యాయవ్యవస్థను ఆశ్రయించిన తరువాత కోర్టుపై విశ్వాసం ఉంచండి. ఆందోళన చేసే బదులు అత్యవసరంగా విచారించాలని కోర్టును కోరండి. ఆందోళన చేయడం పౌరుల హక్కే. అదే సమయంలో స్వేచ్ఛగా, నిర్భయంగా తిరిగే హక్కు కూడా ఇతరులకు ఉంది. పౌరుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఆందోళనతో సంతోషంగా ఉన్నామంటూ చుట్టుపక్కల వారి నుంచి ఏమైనా ధ్రువపత్రం తీసుకున్నారా?
న్యాయవాది: రైతులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు.

ధర్మాసనం: రైళ్లు ఆపేశారు. హైవేలను అడ్డుకున్నారు. మీరేమో ప్రజలకు నష్టం కలిగించలేదని చెబుతున్నారు.
న్యాయవాది: రహదారులను రైతులు మూసివేయలేదు. పోలీసులే ఆ పని చేస్తున్నారు.

ధర్మాసనం: పిటిషన్‌ వేసిన రైతు సంఘం కూడా రహదారులను అడ్డగించింది. దాంతో ప్రజా రవాణా ఆగిపోయింది.
న్యాయవాది: పిటిషన్‌ వేసిన రైతు సంఘం రహదారులను అడ్డగించలేదు.

ధర్మాసనం: అలాగని ప్రమాణ పత్రం సమర్పించండి.
అందుకు న్యాయవాది సమ్మతించడంతో తదుపరి విచారణను నాలుగో తేదీకి వాయిదా వేసింది. ఈ-మెయిల్‌ రూపంలో సమర్పించాలని ఆదేశించింది. జంతర్‌మంతర్‌లో ఆందోళన చేయడానికి మరో రైతు సంఘానికి అనుమతించి, అధికారులు తమకు నిరాకరించారని పేర్కొంటూ ఆ రైతు సంఘం వ్యాజ్యం వేసింది.

ఇదీ చూడండి: 'రహదారులు దిగ్బంధిస్తే సమస్యలు పరిష్కారమవుతాయా?'

Last Updated : Oct 2, 2021, 7:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.