హిజాబ్‌ బ్యాన్​పై సుప్రీం కీలక నిర్ణయం, రఫేల్​ స్కామ్​పై విచారణకు నో

author img

By

Published : Aug 29, 2022, 12:57 PM IST

supreme court on hijab issue

విద్యాసంస్థల్లో హిజాబ్‌ నిషేధంపై కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. నిషేధం ఎత్తివేయాలన్న అభ్యర్థనలపై స్పందన తెలియజేయాలని ఆదేశించింది. మరోవైపు రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

Supreme Court On Hijab : కర్ణాటకలోని విద్యాసంస్థల్లో హిజాబ్‌ నిషేధం ఎత్తివేతపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. హిజాబ్‌ నిషేధానికి అనుకూలంగా కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సమాధానం చెప్పాలని బసవరాజ్‌ బొమ్మై ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 ప్రకారం హిజాబ్‌ ధరించడం తప్పనిసరి ధార్మిక విధానం కాదని ఇటీవల కర్ణాటక హైకోర్టు స్పష్టంచేసింది. తరగతి గదుల్లో.. హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వాలని ఉడుపికి చెందిన కొందరు విద్యార్థినులు దాఖలు చేసిన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును అనేక మంది సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. వాటిపై సర్వోన్నత న్యాయస్థానం కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను సెప్టెంబరు 5కు వాయిదా వేసింది.

రఫెేల్​ ఒప్పందంపై పిటిషన్​ను తోసిపుచ్చిన సుప్రీం..
రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. రఫేల్‌ కొనుగోలు ఒప్పందంలో అక్రమాలు జరిగాయని, ఒప్పందాన్ని రద్దు చేయాలని న్యాయవాది ఎంఎల్​ శర్మ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్​ను సోమవారం సుప్రీంకోర్టు పరిశీలించి, విచారణకు నిరాకరించింది.

తాను వ్యక్తిగత ప్రయోజనాల కోసం పిటిషన్‌ దాఖలు చేయలేదని, అవినీతి వ్యవహారాలను కోర్టు దృష్టికి తీసుకురావడమే తన లక్ష్యమని ఎంఎల్‌ శర్మ కోర్టుకు తెలిపారు. రఫేల్‌ ఒప్పందంలో జరిగిన అక్రమాలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒప్పందంలో భాగంగా ఒక మిలియన్ యూరోలు మధ్యవర్తులకు ఇచ్చినట్లు ఫ్రెంచ్ దర్యాప్తు సంస్థ కూడా చెప్పిందని ఆయన అన్నారు. దీనిపై అక్కడి మీడియా అనేక కథనాలు కూడా రాసిందని పేర్కొన్నారు.

శర్మ వాదనల అనంతరం పిటిషన్​ను వెనక్కి తీసుకుంటారా లేక డిస్మిస్‌ చేయమంటారా అని సీజేఐ జస్టిస్‌ లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే కోర్టు ఉత్తర్వులకు కట్టుబడి ఉంటానని శర్మ తెలిపారు. గతంలో ముగ్గురు సభ్యుల ధర్మాసనం.. ఇదే వ్యవహారంపై విచారణ జరిపిందని, అదే విషయాన్ని పదే పదే లేవనెత్తితే విచారణ జరపడం సాధ్యం కాదని జస్టిస్‌ లలిత్‌ ధర్మాసనం స్పష్టం చేసింది.

స్టాలిన్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు..
దేవాలయాలను రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోకి తీసుకోవడంపై తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బ్రాహ్మణేతరులను అర్చకులుగా నియమించడంపై కూడా నోటీసులు ఇచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వం.. దేవాలయాలను అధీనంలోకి తీసుకోవడాన్ని సవాలు చేస్తూ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. సోమవారం సుబ్రమణ్యస్వామి పిటిషన్​పై విచారణ జరిపిన సుప్రీం.. స్టాలిన్​ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.

ఇవీ చదవండి: కారులో విగతజీవిగా ప్రముఖ సింగర్, ఏం జరిగింది

బుల్​బుల్​ పిట్టపై కూర్చుని జైలు నుంచి సావర్కర్ మాయం, 8వ తరగతిలో పాఠం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.