ETV Bharat / bharat

'అల్లోపతి వల్లే ఆ రోగాలు.. క్షీణిస్తున్న ప్రజల ఆరోగ్యం'.. రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు

author img

By

Published : Mar 20, 2023, 11:51 AM IST

baba-ramdev-controversial-statement-regarding-allopathy
baba-ramdev-controversial-statement-regarding-allopathy

అల్లోపతి వైద్యాన్ని లక్ష్యంగా చేసుకొని యోగా గురువు రాందేవ్ బాబా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అల్లోపతి ఔషధాల వల్ల ప్రజలు మరింత అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. అల్లోపతిని భూమిలో పాతిపెట్టాలంటూ వ్యాఖ్యానించారు.

యోగా గురువు బాబా రాందేవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అల్లోపతి వైద్యాన్ని తీవ్రంగా విమర్శించారు. అల్లోపతిని భూమిలో పాతిపెట్టాలని వ్యాఖ్యానించారు. అల్లోపతి ఔషధాల వల్ల ప్రజలు మరింత అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పుకొచ్చారు. ఉత్తరాఖండ్​ హరిద్వార్​లోని రిషికుల్ ఆయుర్వేద కళాశాలలో నిర్వహించిన ఓ సెమినార్​లో ఆయన ప్రసంగించారు. ఔషధ రంగంలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలపైనా ఆయన విమర్శలు గుప్పించారు.

"అల్లోపతి ప్రజల్ని మరింత అనారోగ్యానికి గురిచేస్తోంది. ఆయుర్వేదం ఉపయోగించి మనం కరోనాకు మందు కనుక్కున్నాం. కానీ, ఇప్పటివరకు అల్లోపతి నుంచి కరోనా ఔషధం విడుదల కాలేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో 25 శాతం మందికి ఫ్యాటీ లివర్ సమస్యలు ఉన్నాయి. దీనంతటికీ అల్లోపతి ఔషధాలే కారణం. అల్లోపతి మందుల వల్ల అనేక మంది కిడ్నీలు దెబ్బతిన్నాయి. మల్టీనేషనల్ కంపెనీలు మనతో పోటీ పడేలా చేసుకున్నాం. ఇలాగే.. అల్లోపతిని భూమిలో పాతిపెట్టేయాలి. నేనైతే దానికి ఊపిరి ఆడకుండా చేసేస్తా."
-బాబా రాందేవ్, ప్రముఖ యోగా గురువు

రిషికుల్ ఆయుర్వేద కళాశాలలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ సైతం హాజరయ్యారు. దీనికి యోగా గురువు బాబా రాందేవ్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు వైద్యులు సైతం కార్యక్రమానికి వచ్చారు. 'మీరు నా మాటలకు బాధపడొద్దు' అని వైద్యులకు చెబుతూనే తన ప్రసంగాన్ని బాబా రాందేవ్ కొనసాగించారు. తన మాటలు అర్థం చేసుకుంటే అల్లోపతి వైద్యులు సైతం తనకే మద్దతుగా నిలుస్తారంటూ వ్యాఖ్యానించారు.

వివాదాస్పద రాందేవ్!
రాందేవ్ బాబా గతంలోనూ అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అల్లోపతి వైద్యాన్ని లక్ష్యంగా చేసుకొని అనేకసార్లు విమర్శలు గుప్పించారు. అల్లోపతి ఓ పనికిమాలిన వైద్యం అంటూ పేర్కొన్నారు. కరోనా సమయంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై.. వైద్యుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైతం.. రాందేవ్ బాబా వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. చివరకు రాందేవ్ బాబా వెనక్కి తగ్గి క్షమాపణలు చెప్పడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

గతంలో కరోనా టీకా ఓ ఫెయిల్యూర్ అంటూ రాందేవ్ బాబా వ్యాఖ్యానించారు. కొవిడ్ టీకాను వైద్య శాస్త్ర వైఫల్యంగా అభివర్ణించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరోనా బూస్టర్ డోసు తీసుకుంటే.. అది మళ్లీ వైరస్ వచ్చేందుకు కారణమైందని సంచలన ఆరోపణలు చేశారు. అమెరికాను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసిన ఆయన.. ఇప్పుడు ప్రపంచం మొత్తం మూలికా వైద్యం వైపే చూస్తోందని చెప్పుకొచ్చారు. కాగా, ఇలాంటి ప్రచారాలకు వ్యతిరేకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత ధర్మాసనం.. రాందేవ్ బాబా వ్యాఖ్యలను అప్పట్లో గట్టిగా ఖండించింది. 'మీరు అనుసరించే విధానాలు అన్ని రోగాలను నయం చేస్తాయన్న గ్యారెంటీ ఉందా?' అని ప్రశ్నించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.