ETV Bharat / bharat

'రైతులారా.. ట్రాక్టర్లు రెడీ చేయండి.. మరోసారి తడాఖా చూపిద్దాం!'

author img

By

Published : Apr 3, 2022, 6:01 PM IST

Rakesh Tikait
రాకేశ్​ టికాయిత్

Rakesh Tikait comments: రైతుల డిమాండ్లను నెరవేర్చకపోతే మరోమారు ఉద్యమం చేస్తామని భారతీయ కిసాన్ యూనియన్​ నేత రాకేశ్ టికాయిత్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం రూ. 6000 ఇచ్చి రైతులకు బిచ్చగాళ్లును చేస్తోందని విమర్శించారు. రాజస్థాన్​లోని సవాయి మాధోపూర్​లో జరిగిన కిసాన్ మహా పంచాయత్​లో టికాయత్ పాల్గొన్నారు.

Rakesh Tikait comments: కేంద్ర ప్రభుత్వంపై భారతీయ కిసాన్ యూనియన్ అధినేత రాకేశ్ టికాయిత్ విమర్శలు గుప్పించారు. రైతుల డిమాండ్‌లను ప్రభుత్వం నెరవేర్చకుంటే దేశవ్యాప్తంగా మరోసారి ఉద్యమాన్ని చేస్తామని అన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేసిన రైతుల ఆందోళనలు దేశంలోనే అగ్రగామిగా నిలిచాయని తెలిపారు. రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లో జరిగిన కిసాన్ మహాపంచాయత్‌లో టికాయిత్ రైతులతో మాట్లాడారు.

"కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) నిర్ణయం కోసం ఏర్పాటు చేయనున్న కమిటీకి తమ సభ్యుల పేర్లు చెప్పాలని సంయుక్త కిసాన్ మోర్చాను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఇద్దరు సభ్యులను సూచించాలని అడిగింది. కమిటీ విధివిధానాలను మాత్రం కేంద్రం.. యూనియన్​కు చెప్పట్లేదు. కేంద్రం స్పష్టంగా విధివిధానాలు చెప్పని వరకు ఎస్​కేఎం కూడా సభ్యుల పేర్లను కేంద్రానికి ఇవ్వదు."

-భారతీయ కిసాన్ యూనియన్ అధినేత రాకేశ్ టికాయిత్

రైతులందరూ మరోమారు ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని రైతులను టికాయిత్ కోరారు. ట్రాక్టర్​లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఉద్యమం జరిగే సమయం, వేదిక త్వరలోనే చెబుతానని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు రూ. 6000 ఇచ్చి బిచ్చగాళ్లను చేస్తోందని టికాయిత్ ఆరోపించారు. కిసాన్ మహా పంచాయత్​లో పాల్గొన్న ఇతర నేతలూ.. కేంద్రంపై విమర్శలు గుప్పించారు.

"దేశం.. దారిద్య్రరేఖకు దిగువున ఉంది. గత 70 ఏళ్లలో దేశంలో ఏమీ అభివృద్ధి జరగలేదని కేంద్రం చెబుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం గత 70 ఏళ్లలో దేశంలో ఏర్పాటైన ప్రభుత్వ సంస్థలను మాత్రం ప్రైవేటీకరణ చేస్తోంది. భాజపా హయాంలో దేశంలో ఒక్క కంపెనీని ఏర్పాటు చేయలేదు. దేశంలో పేదలు మరింత పేదలుగా మారిపోతున్నారు. ఎన్నికల్లో గెలవడానికి భాజపా పుల్వామా దాడిని ఉపయోగించుకుంది. హిందువులు-ముస్లింల మధ్య విభేదాలను సృష్టించి ఎన్నికల్లో భాజపా గెలుస్తుంది. రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బాగా బలపడుతున్నాయి. భాజపా వల్ల దేశానికి ఏమీ ప్రయోజనం ఉండదు."

-రాజారాం మైల్, రైతు సంఘం నేత

ఇదీ చదవండి: 'ధరల పెంపుతో కేంద్రం దాడి.. ప్రజలపై రూ.1.25 లక్షల కోట్ల భారం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.