ETV Bharat / bharat

చమురు ధరలపై ఆందోళన- రాజ్యసభ రెండుసార్లు వాయిదా

author img

By

Published : Mar 8, 2021, 12:12 PM IST

దేశంలో పెరుగుతన్న చమురు ధరలపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్​ చేయడం వల్ల రాజ్యసభ రెండు సార్లు వాయిదా పడింది. ఈ విషయంపై తర్వాత చర్చిద్దామని ఛైర్మన్ వెంకయ్య నాయుడు సూచించినా.. ప్రతిపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు. సభలో పెద్దఎత్తున నినాదాలు చేశారు. మొదటి వాయిదా అనంతరం సభ 11 గంటలకు తిరిగి ప్రారంభమైనా పరిస్థితిలో మార్పులేదు. దీంతో మళ్లీ మధ్యాహ్నం 1గంట వరకు సభ వాయిదా పడింది.

Rajya Sabha adjourned till 1 pm amid opposition uproar over fuel prices
చమురు ధరలపై ఆందోళన

దేశంలో పెరిగిన ఇంధన ధరలపై పార్లమెంటు దద్దరిల్లింది. ఉదయం 9 గంటలకు రాజ్యసభ ప్రారంభమైన తర్వాత సభ కాసేపు సజావుగా సాగింది. మహిళా దినోత్సవం సందర్భంగా ఛైర్మన్ వెంకయ్యనాయుడు అతివల విజయాలను కొనియాడారు. అనంతరం అజెండాలోని అంశాలను పక్కనపెట్టి.. పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ ధరలు భారీగా పెంచడంపై చర్చించాలని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నోటీసు ఇచ్చారు. కానీ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు చర్చకు అనుమతించలేదు. ఈ విషయం తర్వాత చర్చిద్దామని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం క్వశ్చన్‌ అవర్‌ను కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో ప్రతిపక్షాలు వెల్‌లోకి వెళ్లి ఆందోళనకు దిగాయి. తక్షణమే ఈ విషయంపై చర్చ జరపాలని పట్టుబట్టాయి. ప్రతిపక్ష సభ్యులు సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తొలిరోజే సభ్యులను సస్పెండ్‌ చేయాలనుకోవడం లేదని వెంకయ్య నాయుడు హెచ్చరించారు. అయినా ప్రతిపక్ష నేతలు ఆందోళన కొనసాగించారు. దీంతో తొలుత సభ ఉదయం 11 గంటల వరకు వాయిదా పడింది.

అనంతరం సభ తిరిగి ప్రారంభమైన ప్రతిపక్ష సభ్యులు ఆందోళనలు విరమించలేదు. దీంతో డిప్యూటీ ఛైర్మన్​ హిరివంశ్​ నారాయణ్ సభను మరోసారి మధ్యాహ్నం 1గంటకు వాయిదా వేశారు.

ఇదీ చూడండి: కేరళలో బంగారం స్మగ్లింగ్ మాటేమిటి?: షా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.