ETV Bharat / bharat

రాజీవ్​ హత్య కేసు.. పేరరివాళన్​ అరెస్ట్​ నుంచి విడుదల వరకు ఎన్నో మలుపులు

author img

By

Published : May 19, 2022, 7:19 AM IST

rajiv gandhi murder case
రాజీవ్​ గాంధీ కేసు

Rajiv gandhi assassination: రాజీవ్ హత్య కేసులో జైలు శిక్ష అనుభవించిన దోషి పేరరివాళన్​ను విడుదల చేస్తూ సుప్రీంకోర్టు బుధవారం తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో పేరరివాళన్​కు ఊరట లభించింది. 1991న మొదలైన ఈ కేసు నుంచి పేరరివాళన్​కు విముక్తి కలగడానికి 31 ఏళ్లు పట్టింది.

Rajiv gandhi assassination perarivalan: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో దోషిగా శిక్ష అనుభవించిన పేరరివాళన్‌కు సుప్రీంకోర్టు తీర్పుతో ఆ కేసు నుంచి విముక్తి లభించింది. 31 ఏళ్లుగా ఈ కేసు ఎన్నో మలుపులు తిరుగుతూ వచ్చింది.

  • 1991 మే 21న మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ శ్రీపెరంబుదూర్‌లో అన్నాడీఎంకే కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ఎల్‌టీటీఈ బెల్టుబాంబు దాడికి గురై రాజీవ్‌ మృతిచెందారు. ఆయనతోపాటు పోలీసు అధికారులు, పిల్లలు, ప్రజలు, పార్టీశ్రేణులు కలిపి మొత్తం 15 మంది చనిపోయారు.
  • ఈ కేసులో ఎల్‌టీటీఈకి సహకరించాడని పేరరివాళన్‌ను 1991 జాన్‌ 11న పోలీసులు అరెస్టుచేశారు. బాంబు కోసం రెండు బ్యాటరీల్ని ఆయన కొన్నట్లు ఆధారాలు సేకరించారు. ఆయనతోపాటు హత్య కేసుతో సంబంధం ఉన్న నళిని, ఆమె భర్త మురుగన్‌ దంపతులను జూన్‌ 22న అరెస్టు చేశారు. 1998 జనవరి 28న 26 మందికి ఉరిశిక్ష విధిస్తూ పూందమల్లి టాడా కోర్టు తీర్పునిచ్చింది.
  • కేసులో దోషులుగా ఉన్న 26మంది తమకు శిక్ష తగ్గించాలని అప్పీలు చేయగా, అందులో 19 మందిని విడుదల చేశారు. నలుగురికి ఉరిశిక్ష ఖరారైంది. మిగిలిన ముగ్గురికి జీవితఖైదు విధించారు.
  • 1999 అక్టోబరు 8న ఉరిశిక్ష విధించిన నలుగురికి జీవిత ఖైదుగా శిక్ష మార్చాలని రిట్‌ పిటిషన్‌ వేయగా.. దాన్ని కోర్టు తోసిపుచ్చింది. అదే నెల 10వ తేదీన నలుగురు నిందితులు అప్పటి గవర్నరు ఫాతిమా బీబీకి క్షమాభిక్ష దరఖాస్తు పంపారు. 1999 అక్టోబరు 29న దాన్ని ఆమె తోసిపుచ్చారు. తర్వాత అదే సంవత్సరం నవంబరు 25న గవర్నరు ఉత్తర్వులను రద్దుచేస్తూ మంత్రివర్గ సమావేశంలో తీర్మానం ఆమోదించారు.
  • 2000 ఏప్రిల్‌ 24న దోషిగా ఉన్న నళినికి విధించిన ఉరిశిక్షను రద్దుచేసి జీవిత కారాగార శిక్షగా మార్చారు. మిగిలిన ముగ్గురు ఏప్రిల్‌ 26న రాష్ట్రపతికి క్షమాభిక్ష దరఖాస్తును పంపారు. 2008 మార్చి 19న నళినిని కలవడానికి రాజీవ్‌గాంధీ కుమార్తె ప్రియాంక వేలూర్‌ జైలుకు వెళ్లారు. తర్వాత 2000లో రాష్ట్రపతికి పంపిన క్షమాభిక్ష దరఖాస్తును 2011లో తోసిపుచ్చారు.
  • 2015 ఫిబ్రవరి 18న న్యాయమూర్తి జస్టిస్‌ సదాశివన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఉరిశిక్షను రద్దుచేసింది. మర్నాడే అప్పటి ముఖ్యమంత్రి జయలలిత.. ఏడుగురు నిందితులను విడుదల చేస్తామని ప్రకటించారు. 2015 డిసెంబరు 2న న్యాయమూర్తి జస్టిస్‌ ఇబ్రహీం ఖలీఫుల్లా కేంద్రప్రభుత్వ అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోలేరని తీర్పు ఇచ్చారు. 2016 మార్చి 2న ఏడుగురిని విడుదల చేయడానికి కేంద్రానికి రాష్ట్రం లేఖ రాసింది.
  • 2017 నవంబరులో పేరరివాళన్‌కు రాజీవ్‌గాంధీ హత్యతో సంబంధం లేదని సీబీఐ మాజీ విచారణ అధికారి త్యాగరాజన్‌ తెలిపారు. 2018 మార్చిలో ఏడుగురిని విడుదల చేయాలని దాఖలైన కేసులో రాష్ట్ర గవర్నరు నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ నేతృత్వంలోని బెంచ్‌ తీర్పునిచ్చింది.
  • 2018 సెప్టెంబరులో అన్నాడీఎంకే ప్రభుత్వంలో పేరరివాళన్‌ సహా ఏడుగుర్ని విడుదల చేయాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి గవర్నరుకు పంపారు. 2021 జూన్‌లో పేరరివాళన్‌ తల్లి అర్పుతమ్మాళ్‌ తన కుమారుడిని విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌కు విన్నవించారు. ఆ మేరకు పేరరివాళన్‌కు రాష్ట్ర ప్రభుత్వం పెరోల్‌ మంజూరు చేసింది.
  • తీర్మానంపై రెండేళ్లపాటు నిర్ణయం తీసుకోని గవర్నరు.. పేరరివాళన్‌ను విడుదల చేసే అధికారం రాష్ట్రపతికే ఉందని కేంద్ర హోంశాఖ ద్వారా సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించారు. మరోవైపు అప్పటికే నేరాన్ని రుజువు చేయలేని కారణంగా 30 ఏళ్లుగా జైలుశిక్ష అనుభవిస్తున్న తనను విడుదల చేయాలని 2020లో పేరరివాళన్‌ సుప్రీంకోర్టులో రిట్‌ దాఖలు చేశారు.
  • పేరరివాళన్‌కు గత మార్చిలో సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది. ఆయన్ను విడుదల చేసే అధికారం ఎవరికి ఉందనే వివాదాల మధ్య జైలులో ఎందుకుండాలని కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు.. తగిన చర్యలు తీసుకోకపోతే తామే విడుదల చేస్తామంది. ఈ నేపధ్యంలో 142వ సెక్షను కింద పేరరివాళన్‌ను విడుదల చేస్తూ బుధవారం తీర్పు ఇచ్చింది.

ఇదీ చూడండి : వాట్సాప్​లో బ్లాక్ చేశాడని.. ప్రియుడి ఇంటి వద్దే యువతి ఉరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.