ETV Bharat / bharat

రాజస్థాన్‌లో ముగిసిన ప్రచార పర్వం- ఈ నెల 25న పోలింగ్- విజయంపై కాంగ్రెస్​-బీజేపీ ధీమా!

author img

By PTI

Published : Nov 23, 2023, 8:10 PM IST

Rajasthan Election 2023 : కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీ మధ్య ద్విముఖ పోటీ నెలకొన్న రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈనెల 25న ఒకేవిడతలో 199స్థానాలకు ఓటింగ్‌ జరగనుంది. ఐదేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ, కార్యక్రమాలతోపాటు ఏడు ఉచిత హామీలు తమకు మళ్లీ అధికారం కట్టబెడ్తాయని కాంగ్రెస్‌ భావిస్తుండగా.. ప్రభుత్వ వ్యతిరేకత, పరీక్ష పేపర్ల లీకేజీ, ప్రధాని మోదీ ఛరిష్మాపై భాజపా నేతలు ఆశలు పెట్టుకున్నారు.

Rajasthan Election 2023
Rajasthan Election 2023

Rajasthan Election 2023 : రాజస్థాన్‌లో శాసనసభ ఎన్నికల ప్రచారం ముగిసింది. సాయంత్రం 6గంటలకు రాజకీయ పార్టీల ప్రచారానికి బ్రేక్‌ పడింది. రాజస్థాన్‌లో 200 స్థానాలు ఉన్నప్పటికీ.. కరణ్‌పుర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి గుర్మీత్‌సింగ్‌ మృతి చెందటంతో 199 నియోజకవర్గాలకే ఈనెల 25 ఓటింగ్‌ జరగనుంది. 5 కోట్ల 25లక్షల 38వేల నూటా ఐదు మంది ఓటర్లు ఉన్నారు. వచ్చేనెల3న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఐదేళ్ల అభివృద్ధిపై కాంగ్రెస్ ఆశలు
రాజస్థాన్‌లో అధికారం నిలబెట్టుకోవాలని అధికార కాంగ్రెస్‌.. తిరిగి పాగా వేయాలని ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీలు హోరాహోరీగాప్రచారం నిర్వహించాయి. కాంగ్రెస్‌ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ప్రియాంకాగాంధీ, సీఎం అశోక్‌ గహ్లోత్‌, సచిన్‌ పైలట్‌ తదితరులు ప్రచారం చేశారు. ఐదేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని హస్తం నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఏడు ఉచిత హామీలు, ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన అంశాలు తమను మళ్లీ గెలుపు తీరాలకు చేరుస్తాయనే ఆశాభావంతో ఉన్నారు. ఇత్యాది సానుకూల అంశాలతో ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారే సంప్రదాయానికి బ్రేక్ వేయనున్నట్లు కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.

ప్రభుత్వ వ్యతిరేకతే మమ్మల్నిగెలిపిస్తుంది: BJP
భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎంలు శివరాజ్‌సింగ్‌, యోగీ ఆదిత్యనాథ్‌ తదితరులు ప్రచారం చేశారు. మహిళలపై అత్యాచారాలు, పరీక్ష పేపర్ల లీకేజీ అంశాలను కమలనాథులు తమ ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించారు. గహ్లోత్‌ సర్కార్‌పై వ్యతిరేకత, మోదీ ఛరిష్మా తమకు కలిసి వస్తాయనే విశ్వాసంతో BJP శ్రేణులు ఉన్నారు.

భారీగా పట్టుబడ్డ నగదు
రాజస్థాన్‌లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, భాజపాలు మెజార్టీ సాధన కోసం సర్వశక్తులు ఒడ్డాయి. ఈసారి పెద్దఎత్తున డబ్బు, ఇతర వస్తువులను పట్టుకున్నారు. అక్టోబర్‌ పదో తేదీ నుంచి ఇప్పటివరకు రూ.682 కోట్లు విలువ చేసే వివిధ రకాల వస్తువులను తనిఖీల్లో పట్టుబడినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇది 2018 ఎన్నికల్లో కంటే 962 శాతం ఎక్కువ అని EC వెల్లడించింది.

Rajasthan Elections Key Points : మోదీ Vs గహ్లోత్​?.. ఈ 5 అంశాలు ఎవరికి కలిసొస్తే వారిదే పీఠం!

5ఏళ్లలో 10లక్షల ఉద్యోగాలు, రాష్ట్రంలో పక్కాగా కులగణన- రాజస్థాన్​ ప్రజలపై కాంగ్రెస్​ హామీల వర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.