ETV Bharat / bharat

రాజస్థాన్​లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్​- ఓటింగ్ శాతం ఎంతంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 25, 2023, 7:00 AM IST

Updated : Nov 25, 2023, 10:56 PM IST

Rajasthan Assembly Election 2023 Polling
Rajasthan Assembly Election 2023 Polling

18:01 November 25

రాజస్థాన్​ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 51,000 పోలింగ్​ బూత్​ల్లో రాత్రి 9 గంటల వరకు 70శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పోలింగ్​ ఏజెంట్​ సహా ఓ వృద్ధుడు గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు. రాజస్థాన్​లో 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. కరణ్‌పుర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ ఆకస్మిక మృతితో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. 199 స్థానాలకు 1,862 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. చురులోని ఒక పోలింగ్ బూత్‌లో గొడవ జరిగింది. తనపై నలుగురైదుగురు దాడి చేశారని పోలింగ్ ఏజెంట్ ఆరోపించాడు. అతడికి స్వల్ప గాయాలయ్యాయి. సీకార్‌ జిల్లాలోని ఫతేపుర్‌లో పోలింగ్‌ బూత్‌ వద్ద కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థికి చెందిన మద్దతుదారులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో పోలీసు ఒకరు గాయపడ్డారు.

15:39 November 25

రాజస్థాన్​లో మధ్యాహ్నం 3 గంటల వరకు 55.63 శాతం పోలింగ్​ జరిగినట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.

13:47 November 25

రాజస్థాన్​లో మధ్యాహ్నం ఒంటి గంటవరకు 40.27శాతం ఓటింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

12:20 November 25

లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా.. కోటా నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

11:53 November 25

రాజస్థాన్​లోని సర్ధార్​పురలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఓటు వేశారు.

11:45 November 25

రాజస్థాన్​లో ఉదయం 11 గంటలవరకు 24.74శాతం ఓటింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

11:32 November 25

రాజస్థాన్​ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా జైపుర్‌లో ఓటు వేశారు. మరోవైపు.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కుమారుడు వైభవ్ గహ్లోత్.. సర్ధార్​పుర్​లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

09:51 November 25

రాజస్థాన్​లో ఉదయం 9 గంటల వరకు 9.77శాతం ఓటింగ్​ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

08:57 November 25

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కుటుంబ సభ్యులతో కలిసి జోధ్​పుర్​లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు.. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకురాలు వసుంధర రాజే ఝాల్వార్​లో ఓటు వేశారు.

08:51 November 25

కాంగ్రెస్ అగ్రనాయకుడు, టోంక్ ఎమ్మెల్యే అభ్యర్థి సచిన్ పైలట్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

08:43 November 25

బికనీర్ ఈస్ట్ నియోజకవర్గంలో కేంద్రమంత్రి అర్జున్​రామ్​ మేఘ్​వాల్​ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

08:24 November 25

రాజస్థాన్​లో ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ కట్టారు. వృద్ధులు సైతం ఓటు వేసేందుకు లైన్​లో నిలబడ్డారు. మరోవైపు.. బీజేపీ ఎంపీ, జొత్వారా ఎమ్మెల్యే అభ్యర్థి రాజ్యవర్థన్ సింగ్ రాఠోడ్​ బైపుర్​లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే బాడ్​మేర్​లోని బైతూ పోలింగ్ బూత్​లో కేంద్ర మంత్రి కైలాశ్ చౌదరి ఓటు వేశారు.

07:19 November 25

రాజస్థాన్ కింగ్ ఎవరో తేల్చనున్న 5.26 కోట్ల ఓటర్లు- పోలింగ్ షురూ

రాజస్థాన్​ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. 'ఓటర్లందరూ తమ ఓటుహక్కును వినియోగించుకోవాలి. ఓటింగ్‌లో కొత్త రికార్డు సృష్టించాలని అభ్యర్థిస్తున్నాను. రాజస్థాన్​లో తొలి ఓటు వేయబోతున్న యువ ఓటర్లందరికీ నా శుభాకాంక్షలు.' అని ఎక్స్​లో ట్వీట్​ చేశారు.

06:33 November 25

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

Rajasthan Assembly Election 2023 Polling : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. 199 స్థానాలకు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 వరకు కొనసాగనుంది. 5.26 కోట్ల మంది అర్హులైన ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. 51 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఈసీ.. లక్షా 70 వేల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించింది. సుమారు 2.74 లక్షల మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు.

రాజస్థాన్ అసెంబ్లీలో 200 స్థానాలు ఉండగా.. శనివారం 199 సీట్లకే ఎన్నికలు జరుగుతున్నాయి. కరణ్‌పుర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి గుర్మీత్‌సింగ్‌ మృతి చెందిన నేపథ్యంలో ఆ స్థానానికి ఎన్నిక పోలింగ్ పడింది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, బీజేపీ నువ్వానేనా అన్నట్టు తలపడుతున్నాయి. హోరాహోరీగా ప్రచారం నిర్వహించిన ఇరుపార్టీలు.. గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

ఓటరు ముఖచిత్రం

  • మొత్తం ఓటర్లు- 5.25 కోట్లు
  • మహిళలు- 2.52 కోట్లు
  • పురుషులు- 2.73 కోట్లు
  • 80+ ఓటర్లు- 51,033
  • దివ్యాంగులు- 11,894
  • ఓట్ల లెక్కింపు- డిసెంబర్ 3
Last Updated : Nov 25, 2023, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.