ETV Bharat / bharat

'అధికారిక భవనం ఖాళీ చేయండి'.. రాహుల్‌ గాంధీకి నోటీసులు

author img

By

Published : Mar 27, 2023, 10:46 PM IST

Updated : Mar 28, 2023, 6:30 AM IST

ప్రధాని మోదీ ఇంటి పేరును అవమానించారన్న కేసులో కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్‌ గాంధీకి రెండేళ్ల శిక్ష పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన పార్లమెంట్‌ సభ్యత్వాన్ని సైతం కోల్పోయారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కేటాయించిన అధికారిక భవనాన్ని ఖాళీ చేయాలని తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేశారు అధికారులు.

rahul gandhi got notice to vacate official building
అధికారిక భవనం ఖాలీ చేయాలని రాహుల్​ గాంధీకి నోటీసులు

ఓ పరవునష్టం కేసులో కాంగ్రెస్​ అగ్రనేత, ఎంపీ రాహుల్​ గాంధీకి ఇప్పటికే రెండేళ్ల జైలు శిక్ష విధించింది సూరత్​ కోర్టు. దీంతో ఆయన పార్లమెంట్​ సభ్యత్వాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులకు కేటాయించే అధికారిక భవనాన్ని ఖాళీ చేయాల్సిందిగా తాజాగా రాహుల్​కు నోటీసులు పంపారు అధికారులు. కాగా, ప్రస్తుతం రాహుల్​ ఉంటున్న అధికారిక నివాసాన్ని ఖాళీ చేసేందుకు నెలరోజుల సమయం ఇచ్చారు లోక్‌సభ హౌసింగ్‌ కమిటీ అధికారులు. ఏప్రిల్‌ 22లోగా అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని డెడ్‌లైన్‌ పెట్టినట్టు పార్లమెంట్‌ వర్గాలు పేర్కొన్నాయి.

2004లో లోక్​సభ సభ్యునిగా ఎన్నికైన నుంచి దిల్లీలోని తుగ్లక్‌ లేన్‌లో 12వ నంబరు బంగ్లాలో నివాసం ఉంటున్నారు. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ నివాస గృహంలో ఉండేందుకు రాహుల్​ను అనర్హుడిగా పేర్కొంటూ లోక్‌సభ హౌసింగ్‌ కమిటీ నోటీసులు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారంపై స్పందించిన రాహుల్‌ తరఫు నాయకులు తమకు ఇంకా ఎటువంటి నోటీసులు అధికారుల నుంచి రాలేదని పేర్కొంది.

ఇక సూరత్​ కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లేందుకు రాహుల్​ గాంధీకి 30 రోజులు గడువు ఇచ్చింది న్యాయస్థానం. కోర్టు తీర్పు వచ్చిన మరుసటి రోజే రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడంటూ లోక్‌సభ సెక్రటేరియట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇలా ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోవడం వల్ల ఓ ప్రజాప్రతినిధికి లభించే ప్రభుత్వ సదుపాయాలు, ఇతర ప్రయోజనాలు సైతం రద్దవుతాయి. ఈ కారణంతోనే అధికార నివాసాన్ని ఖాళీ చేయాలంటూ అధికారులు నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది.

అయితే కోర్టు తీర్పును సవాలు చేస్తూ పై కోర్టులను ఆశ్రయించే పనిలో ఉన్నారు రాహుల్ గాంధీ. ఇక్కడ గనుక ఆయనకు ఊరట లభిస్తే తప్ప.. ఏప్రిల్​ 22లోపు తన అధికార నివాసాన్ని ఖాళీ చేయక తప్పదు. మరోవైపు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ భద్రతా సిబ్బందిని కూడా ప్రభుత్వం తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 2020 జులైలో తన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు ప్రియాంక గాంధీ.

కాంగ్రెస్​ సహా విపక్షాల మద్దతు..
రాహుల్ గాంధీపై అనర్హతకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. అదానీ వ్యవహారంపై జేపీసీ విచారణ, రాహుల్ గాంధీపై అనర్హత వేటు తదితర అంశాలపై పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్​ పార్టీ మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీకి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ సహా టీఎంసీ, బీఆర్ఎస్, సమాజ్​వాదీ, డీఎంకే, వామపక్షాల నేతలు హాజరయ్యారు.

విచారణకు ఎందుకంత భయం..?: రాహుల్​ గాంధీ
మరోవైపు అదానీ వ్యవహారంపై జేపీసీ దర్యాప్తు చేపట్టేందుకు ఎందుకు అంత భయపడుతున్నారని ప్రధాని మోదీకి రాహుల్‌ గాంధీ సూటి ప్రశ్నను సంధించారు. దీనిపై వివరణ ఎందుకు ఇవ్వట్లేదో చెప్పాలని ఆయన నిలదీశారు. ఎల్‌ఐసీ మూలధనం, ఎస్‌బీఐ డబ్బు, ఈపీఎఫ్‌ఓ సొమ్ము ఇలా అన్ని అదానీకే అంటూ మెదీ-అదానీల బంధాన్ని ఉద్దేశిస్తూ రాహుల్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదానీ(మెదీ-అదానీ) వ్యవహారం బయటపడిన తర్వాత కూడా ప్రజల రిటైర్మెంట్‌ డబ్బులను ఎందుకు అదానీ గ్రూపుల్లో పెట్టుబడిగా పెట్టారో చెప్పాలని రాహుల్​ డిమాండ్​ చేశారచు. ఆ కంపెనీపై వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు ఎందుకు చేయడం లేదని.. ప్రధాని నుంచి సమాధానము ఎందుకు రావడం లేదని రాహుల్​ దుయ్యబట్టారు. ఈ వ్యవహారంలో జేపీసీ విచారణ జరిపించేందుకు ఎందుకంత భయపడుతున్నారని రాహుల్​ గాంధీ ట్విట్టర్​ వేదికగా మోదీని ఉద్దేశించి ట్వీట్​ చేశారు.

Last Updated :Mar 28, 2023, 6:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.