ETV Bharat / bharat

'నేతలతో కుమ్మక్కైన పోలీసులు మూల్యం చెల్లించక తప్పదు'

author img

By

Published : Sep 28, 2021, 5:00 AM IST

Updated : Sep 28, 2021, 5:06 AM IST

justice NV Ramana
జస్టిస్ ఎన్​ వీ రమణ

పార్టీలతో అంట కాగిన అధికారులు జైలుకు వెళ్లాల్సిందేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్ వీ రమణ(Justice NV Ramana News) వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న పార్టీతో సన్నిహితంగా మెలిగి డబ్బులు గుంజుకొనే పోలీసు అధికారులు.. ప్రభుత్వం మారినప్పుడు తప్పనిసరిగా తిరిగి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పారు.

అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు, పోలీసులు కుమ్మక్కవడం దేశంలో కొత్త విధానంగా మారిందని సోమవారం సుప్రీంకోర్టు(Supreme Court of India) మౌఖికంగా వ్యాఖ్యానించింది. అధికారంలో ఉన్న పార్టీతో సన్నిహితంగా మెలిగి డబ్బులు గుంజుకొనే పోలీసు అధికారులు ప్రభుత్వం మారినప్పుడు తప్పనిసరిగా తిరిగి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పింది. అలాంటి పోలీసులను ఎందుకు రక్షించాలని ప్రశ్నించింది. వారు జైలుకు వెళ్లాల్సిందేనని పేర్కొంది. లంచాలు తీసుకున్నారన్న ఆరోపణపై ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి గుర్జీందర్‌ పాల్‌ సింగ్‌ను(Gurjinder Pal Singh IPS chhattisgarh) ఆ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న కేసుతో పాటు, రాజద్రోహం అభియోగాన్ని కూడా మోపింది. ఈ కేసుల్లో తనను అరెస్టు చేయకుండా రక్షించాలని కోరుతూ ఆయన చేసిన విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆయనను ప్రస్తుతం అరెస్టు చేయకూడదంటూ తాత్కాలిక రక్షణ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఇలాంటి అధికారుల ప్రవర్తనపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయనపై నమోదయిన మరో రెండు కేసుల్లోనూ ఇలాంటి రక్షణ ఆదేశాలే జారీ చేసింది.

ఈ సందర్భంగా జస్టిస్‌ రమణ(Justice NV Ramana news) మాట్లాడుతూ "ప్రతి కేసులోనూ మీరు రక్షణ పొందలేరు. ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్నారు కాబట్టి మీరు డబ్బును గుంజుకోగలిగారు. అయితే ఏదో ఒక రోజున దీన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇది మరీ దారుణం. ఇలాంటి అధికారులను ఎందుకు రక్షించాలి? దేశంలో ఇదో కొత్త ధోరణి ప్రబలుతోంది" అని అన్నారు. ఈ సందర్భంగా సీనియర్‌ న్యాయవాది వికాస్‌ సింగ్‌ కల్పించుకొని అలాంటి అధికారులను రక్షించాల్సి ఉందని చెప్పారు. జస్టిస్‌ రమణ స్పందిస్తూ "లేదు..అలాంటి వారు జైలుకు వెళ్లాల్సి ఉంది" అని అన్నారు. న్యాయవాది స్పందిస్తూ నిజాయితీపరులైన అధికారులు వేధింపులకు గురవుతున్నారని, అలాంటి వారిని రక్షించాల్సి ఉందని చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం ఆయనను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. మరో కేసులో ఇదే అధికారిని అరెస్టు చేయకుండా ఆగస్టు 26న కూడా సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. ప్రభుత్వాలు మారినప్పుడు పోలీసు అధికారులపై రాజద్రోహం, ఇతర కేసులు నమోదు చేయడం కొత్త విధానంగా మారిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. "అధికారంలోని పార్టీ పక్షాన వ్యవహరించినప్పుడు అంతా సవ్యంగా సాగిపోతుంది. పార్టీ మారినప్పుడు అదే అధికారిపై కేసులు నమోదవుతాయి. కుమ్మక్కయ్యే ఈ పద్ధతి మారాలి" అని ఆ సందర్భంగా జస్టిస్‌ రమణ వ్యాఖ్యానించారు.

బలహీనవర్గాల కేసులకూ ప్రాధాన్యమివ్వాలి

కేసుల విచారణ తేదీని నిర్ణయించే 'మెన్షనింగ్‌' ప్రక్రియలో కేవలం కార్పొరేట్‌ వాటికే పరిమితం కాకుండా, బలహీనవర్గాలకు చెందిన కేసులకూ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. మెన్షనింగ్‌ విధానాన్ని క్రమబద్ధీకరిస్తున్నట్లు సోమవారం ఆయన వెల్లడించారు. సీనియర్‌ న్యాయవాది సి.యు.సింగ్‌... ఓ కార్పొరేట్‌ వ్యవహారాన్ని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఈ అంశానికి ప్రాధాన్యమిచ్చి, త్వరగా విచారణ చేపట్టాలని అభ్యర్థించారు. ఆ సందర్భంలో జస్టిస్‌ ఎన్‌.వి.రమణ స్పందించారు. "మనం కొంచెం ఆగాలి. మెన్షనింగ్‌ విధానాన్ని క్రమబద్ధీకరిస్తున్నాం. కార్పొరేట్‌ న్యాయవాదులంతా వచ్చి వారి కేసులను ప్రస్తావిస్తున్నారు. దానివల్ల మిగతా కేసులు వెనక్కు వెళ్లిపోతున్నాయి. క్రిమినల్‌ అప్పీళ్లు, ఇతర కేసులు పెండింగులో ఉన్నాయి. బలహీనవర్గాల కేసులకూ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది" అని ఆయన పేర్కొన్నారు. ఇదే ధర్మాసనంలో జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ హిమా కోహ్లిలు కూడా ఉన్నారు.

ఇదీ చదవండి:'న్యాయవ్యవస్థలో మహిళలకు 50% రిజర్వేషన్ అవసరం'

Last Updated :Sep 28, 2021, 5:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.