ETV Bharat / bharat

'మాఫియాలకు చెక్​ పెట్టేది భాజపానే అని ప్రజలు గుర్తించారు'

author img

By

Published : Feb 13, 2022, 12:28 AM IST

అల్లరి మూకలు, మాఫియాలను భాజపా ప్రభుత్వం మాత్రమే కట్టడి చేయగలదని యూపీ ప్రజలు గుర్తించారన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కులతత్వాన్ని పెంచి, మతతత్వాన్ని ప్రచారం చేసి ఓట్లను చీల్చాలని ప్రతిపక్ష నేతలు చూస్తున్నారని తెలిపారు.

pm modi
మోదీ

PM Modi UP Election: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలతో రాజకీయం వేడి పుట్టిస్తోంది. కన్నౌజ్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యూపీలో తొలివిడత పోలింగ్‌ పూర్తయిన తర్వాత వారసత్వ పార్టీల నేతలకు నిద్రకరవైందన్నారు. వారు కలలు కూడా కనలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. దేశంలో కుటుంబ పార్టీలే ప్రజాస్వామ్య స్ఫూర్తిని మార్చేశాయని మండిపడ్డారు. అలాంటి నేతలకు ప్రజాస్వామ్యమంటే.. ప్రజల చేత, ప్రజల కొరకు ఏర్పాటైన ప్రభుత్వం కాదనీ; కుటుంబం చేత కుటుంబం కొరకు ఏర్పాటైన ప్రభుత్వం అంటూ ప్రధాని చురకలంటించారు. అల్లర్లు, మాఫియా శక్తుల ఆటకట్టించేది భాజపా ప్రభుత్వమేనని ప్రజలు గమనించారన్నారు.

"ఈ ఎన్నికల్లో యూపీలో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? ఎవరు కాదు అనేది చర్చ కాదు. భాజపానే వస్తుందని రాష్ట్రమంతా తెలుసు. యోగి సీఎం అవుతారని దేశమంతా తెలుసు. గతంలో కన్నా ఎన్ని సీట్ల మెజార్టీతో భాజపా ప్రభుత్వం ఏర్పాటవుతుందనేందుకే ఈ పోటీ జరుగుతోందన్నారు. రెండు రోజుల నుంచి ప్రతిపక్ష నేతలు నిద్రపోవడంలేదు. కులతత్వాన్ని పెంచి, మతతత్వాన్ని ప్రచారం చేసి ఓట్లను చీల్చాలని చూస్తున్నారు. కానీ, మాఫియాలు, అల్లరి మూకలకు వ్యతిరేకంగా యూపీ ప్రజలు ఐక్యంగా ఓటు వేయడం నాకెంతో సంతోషంగా ఉంది." అన్నారు మోదీ.

ఓటర్లకు అర్థమైంది..

అల్లరిమూకలు, గూండాలకు చికిత్సకు మందు భాజపా ప్రభుత్వం వద్దే ఉందనేది రాష్ట్రంలోని సాధారణ ఓటర్లకు కూడా అర్థమైందన్నారు మోదీ. రాష్ట్రంలో పేదలకు ఇళ్లు, పేద మహిళలకు ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు, లక్షలాది మంది రైతులకు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి లబ్ధి, లక్షలాది మందికి ఆయుష్మాన్‌ భారత్‌ కింద ఉచిత వైద్య చికిత్సలు, దశాబ్దాల క్రితంనాటి నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి.. ఇవన్నీ డబుల్ ఇంజిన్‌ ప్రభుత్వాల ఫలితమేనని వివరించారు.

ఓటుతో సమాధానం చెప్పండి..

Uttarakhand Election: ఉత్తరాఖండ్​ పర్యటన సందర్భంగా కూడా ప్రధాని మోదీ కాంగ్రెస్​పై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ లబ్ధి కోసం కరోనా వ్యాక్సిన్ల పంపిణీపై కాంగ్రెస్​ దుష్ప్రచారం చేస్తోందన్నారు. దేశ తొలి త్రిదళాధిపతి స్వర్గీయ జనరల్​ బిపిన్​ రావత్​ను ఆ పార్టీ అవమానపరచిందని.. ఇందుకు ఉత్తరాఖండ్ ప్రజలు సోమవారం జరగనున్న ఎన్నికల్లో దీటుగా సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలోనూ ప్రభుత్వం ఏ పేద వాడినీ ఖాళీ కడుపుతో నిద్రపోనివ్వలేదని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్​ అభివృద్ధికి భాజపా అన్ని విధాలా కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి : వెలుగులోకి మరో భారీ మోసం.. రూ.22,842కోట్లు ఎగ్గొట్టిన ఆ కంపెనీ.. !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.