ETV Bharat / bharat

ఈ దశాబ్దం చివరి నాటికి '6జీ' సేవలు: ప్రధాని మోదీ

author img

By

Published : May 17, 2022, 3:19 PM IST

PM Modi 6G: దేశంలో ఈ దశాబ్దం చివరి నాటికి 6జీ నెట్​వర్క్​ సేవలను అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు ప్రధాని మోదీ. ఆన్​లైన్​ వేదికగా జరిగిన దిల్లీలోని ట్రాయ్​ రజతోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. భారత ఆర్థిక వ్యవస్థకు 5జీ టెక్నాలజీ.. 450 బిలియన్‌ డాలర్లను అందించనుందని ఆయన వెల్లడించారు.

PM Modi 6G
PM Modi 6G

PM Modi 6G: ఈ దశాబ్దం చివరి నాటికి 6జీ టెలికాం నెట్‌వర్క్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అనుసంధానతే.. 21వ శతాబ్దంలో ఓ దేశ ప్రగతిని నిర్ణయిస్తుందని.. ఈ నేపథ్యంలో ఆధునిక మౌలిక సదుపాయాలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మంగళవారం ఆన్‌లైన్‌ వేదికగా దిల్లీలోని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ట్రాయ్‌) రజతోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని.. ఈ మేరకు ప్రసంగించారు. దేశంలో త్వరలో 5జీ సేవలను ప్రారంభించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెట్‌వర్క్ అమల్లోకి వస్తే.. దేశ ఆర్థిక వ్యవస్థలో మరో 450 బిలియన్‌ డాలర్లు వచ్చి చేరతాయని అంచనా వేస్తున్నట్లు ప్రధాని చెప్పారు.

'5జీ ​​సాంకేతికత.. పాలనావ్యవస్థలో సానుకూల మార్పులు తీసుకువస్తుంది. జీవన సౌలభ్యం, సులభతర వ్యాపారానికి కూడా దన్నుగా ఉంటుంది. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్‌ రంగాల్లో వృద్ధిని పెంచుతుంది. 5జీతో కేవలం ఇంటర్నెట్‌ వేగమే కాదు.. అభివృద్ధి వేగం కూడా పెరుగుతుంది. ఉద్యోగాలనూ సృష్టిస్తుంది' అని ప్రధాని అన్నారు. ఈ దశాబ్దం చివరి నాటికి 6జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు టాస్క్‌ఫోర్స్ ఇప్పటికే రంగంలోకి దిగినట్లు వెల్లడించారు. గత యూపీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. 2జీ యుగం విధానపర లోపాలు, అవినీతికి ప్రతీకగా నిలిచిందని ఎద్దేవా చేశారు. తమ హయాంలో దేశం పారదర్శకంగా 4జీ సేవల దిశగా మళ్లిందని, ఇప్పుడు 5జీకి వెళ్తోందని తెలిపారు.

5G Test Bed: దేశంలో టెలిడెన్సిటీ, ఇంటర్నెట్ వినియోగం వేగంగా పెరుగుతోందని మోదీ అన్నారు. స్థానికంగా మొబైల్ తయారీ యూనిట్లు రెండు నుంచి 200కి పైగా విస్తరించాయని తెలిపారు. ప్రస్తుతం భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ తయారీ కేంద్రంగా ఉందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం సంస్థల మధ్య ఆరోగ్యకర పోటీని ప్రోత్సహించిందని.. ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత చౌకయిన టెలికాం డేటా ఛార్జీలు కలిగిన దేశాల్లో భారత్‌ ఒకటిగా నిలిచిందన్నారు. అంతకుముందు ప్రధాని.. దేశీయంగా రూపొందించిన '5G టెస్ట్ బెడ్' ను ప్రారంభించారు. రూ.220 కోట్లతో రూపొందించిన ఈ ప్రాజెక్ట్‌.. స్థానిక పరిశ్రమలు, స్టార్టప్‌లకు తోడ్పాటునందిస్తుంది. 5జీ, తదుపరి సాంకేతికతలకు సంబంధించిన ఉత్పత్తులు, నమూనాలు, అల్గారిథమ్‌లను ప్రామాణికం చేయడంలో సహాయపడుతుంది.

ఇవీ చదవండి: చిదంబరంపై సీబీఐ మరో కేసు.. తొమ్మిది చోట్ల సోదాలు

Lokpal: లోక్‌పాల్‌ కొత్త చీఫ్‌ నియామకంపై కేంద్రం దృష్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.