ETV Bharat / bharat

'ఈ ఎన్నికల్లో ప్రయోగాలు వద్దు'.. పంజాబ్​ ప్రజలకు రాహుల్ విజ్ఞప్తి

author img

By

Published : Feb 15, 2022, 5:56 AM IST

Rahul Gandhi Punjab: ఎన్నికల్లో ప్రయోగాలు చేయవద్దని పంజాబ్​ ప్రజలకు విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ. పంజాబ్​పై పూర్తి అవగాహన ఉన్న కాంగ్రెస్​ మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే డ్రగ్స్‌ సమస్యను అంతం చేస్తుందన్నారు.

rahul gandhi
రాహుల్​

Rahul Gandhi Punjab: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోగాలు చేయకుండా మళ్లీ కాంగ్రెస్‌నే గెలిపించాలని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఓటర్లకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కాంగ్రెస్‌తోనే సాధ్యమని పేర్కొన్నారు. హోశియార్‌పుర్‌లో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌పై పూర్తి అవగాహన ఉన్న కాంగ్రెస్‌.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ తీసుకొచ్చిన జీఎస్‌టీ, నోట్ల రద్దు నిర్ణయాల వల్ల ఒకరిద్దరు సంపన్నులకు మాత్రమే లబ్ధి కలిగిందన్నారు. మోదీ తన ఎన్నికల ర్యాలీల్లో ఎక్కడా నిరుద్యోగం, నల్లధనం సమస్యల గురించి మాట్లాడటమే లేదన్నారు. కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే డ్రగ్స్‌ సమస్యను అంతం చేస్తుందన్నారు.

వారికి పంజాబ్​పై అవగాహన లేదు..

కేజ్రీవాల్‌ సారథ్యంలోని ఆమ్​ ఆద్మీ పార్టీకి పంజాబ్‌పై ఏమాత్రం అవగాహన లేదన్నారు రాహుల్. 'మోహల్లా క్లినిక్స్​ స్థాపించి వైద్య సదుపాయాలు మెరుగు చేశాం అని ఆప్​ అంటోంది. కానీ దిల్లీలో కొవిడ్​ రెండో దశ వచ్చినప్పుడు పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు' అని వ్యాఖ్యానించారు. ఆప్​ దిల్లీ దశను మార్చినట్లైతే.. కరోనా రెండో దశలో కాంగ్రెస్​ కార్యకర్తలు ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. దిల్లీలో ఆప్​ సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు.

చన్నీ సారథ్యంలో ఏర్పడే కాంగ్రెస్‌ సర్కారు సంపన్నుల కోసం కాకుండా పేదలు, రైతుల కోసం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కేబుల్‌, రవాణా రంగాల్లో గుత్తాధిపత్యానికి ముగింపు పలుకుతామన్నారు.

త్యాగాలు వృథా కావు..

పుల్వామా ఘటనలో అమరులైన జవాన్ల త్యాగం వృథా కానివ్వమని అన్నారు రాహుల్​ గాంధీ. అన్ని ప్రశ్నలకు కేంద్రం వివరణ ఇచ్చేదాకా పోరాడతామని చెప్పారు. పుల్వామా ఘటన జరిగి సోమవారం నాటికి మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో రాహుల్​ ఈ మేరకు ట్వీట్ చేశారు.

ఇదీ చూడండి : 'ఆపరేషన్ దిల్లీ' వేగవంతం.. త్వరలో ఆ సీఎంల సమావేశం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.