ETV Bharat / bharat

ఆగని విపక్షాల ఆందోళన.. వచ్చే నెలకు వాయిదా పడ్డ రాజ్యసభ

author img

By

Published : Feb 13, 2023, 12:22 PM IST

Updated : Feb 13, 2023, 1:06 PM IST

విపక్షాల ఆందోళనల మధ్య రాజ్యసభ మార్చి 13కు వాయిదా పడింది. ఎంపీలు కావాలనే సభా కార్యక్రమాలకు విఘాతం కలిగిస్తున్నారని రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్​ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

parliament-budget-session-rajya sabha adjourn
parliament-budget-session-rajya sabha adjourn

రాజ్యసభ మార్చి 13కు వాయిదా పడింది. విపక్ష ఎంపీల ఆందోళనల మధ్య సభను వాయిదా వేస్తున్నట్లు పెద్దల సభ ఛైర్మన్ జగ్దీప్ ధన్​ఖడ్ ప్రకటించారు. అదానీ గ్రూప్​పై వచ్చిన ఆరోపణపై దర్యాప్తుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని, కాంగ్రెస్ ఎంపీ రజనీ పాటిల్​పై విధించిన సస్పెన్షన్​ను ఎత్తివేయాలని సభ్యులు ఆందోళన చేశారు. ఛైర్మన్ ఎంతగా వారించినా సభ్యులు మాట వినలేదు. ఓ దశలో విపక్ష ఎంపీలు నినాదాలు చేస్తూ వెల్​లోకి దూసుకెళ్లారు. దీంతో ఎంపీలు రాఘవ్ చడ్ఢా, సంజయ్ సింగ్, ఇమ్రాన్ ప్రతాప్​గఢి, శక్తి సింగ్ గోహిల్, సందీప్ పట్నాయక్, కుమార్ కేట్కర్​ను సభాపతి హెచ్చరించారు. ఈ క్రమంలోనే సభను స్వల్ప సమయం పాటు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైనప్పటికీ.. విపక్ష ఎంపీలు శాంతించలేదు.

ఈ నేపథ్యంలో సభను వచ్చే నెలకు వాయిదా వేసిన ధన్​ఖడ్.. విపక్ష ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీలు కావాలనే సభకు ఆటంకం కలిగిస్తున్నారని ధన్​ఖడ్ వ్యాఖ్యానించారు. 'సభను ఇలా నడపలేం. ఇప్పటికే చాలా సమయం వృథా చేశాం. ఇలాగే సభకు ఆటంకం కలిగిస్తూ ఉంటే.. ప్రజల ఆకాంక్షల మేరకు కఠినంగా నడుచుకోవాల్సి వస్తుంది' అని ధన్​ఖడ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గేను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు ధన్​ఖడ్. 'ఛైర్మన్​పై ఒత్తిడి ఉందని మీరు (విపక్షనేత ఖర్గేను ఉద్దేశించి) అంటున్నారు. ఎవరి ఒత్తిడితోనో నేను అలా పనిచేస్తున్నారని ప్రతిసారి మీరు చెబుతున్నారు. అది సరికాదు. ఈ పదాలను రికార్డుల్లో నుంచి తొలగించాం. సభ సజావుగా జరిగేలా చూడాలన్న బాధ్యతను మీరు విస్మరిస్తున్నారు' అంటూ ఖర్గేకు ధన్​ఖడ్ చురకలు అంటించారు.

మరోవైపు, లోక్​సభలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మార్చి 13న బడ్జెట్ రెండో దఫా సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఉదయం 11 గంటలకు రాజ్యసభ మళ్లీ సమావేశం కానుంది.

Last Updated : Feb 13, 2023, 1:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.