ETV Bharat / bharat

ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ పర్యవేక్షణ కమిటీలు

author img

By

Published : Jun 26, 2021, 7:02 AM IST

కరోనా రెండో దశ విజృంభణ సమయంలో.. దేశవ్యాప్తంగా తలెత్తిన ఆక్సిజన్ సంక్షోభం విస్మయానికి గురిచేసింది. ఎందరో రోగులు సమయానికి ప్రాణవాయువు అందక ప్రాణాలు వదలాల్సిన దుస్థితి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రుల్లో 'ఆక్సిజన్ పర్యవేక్షణ కమిటీలు' ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నియమిత జాతీయ కార్యదళం సూచించింది. ప్రతి రాష్ట్రంలో 10-12 ప్రాణవాయువు ఉత్పత్తి కేంద్రాలుండాలని.. సీనియర్‌ వైద్యులతో ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

oxygen committees
ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ పర్యవేక్షణ కమిటీలు

భవిష్యత్తులో పెరిగే ఆక్సిజన్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని, అందుకు తగ్గట్టు సమాయత్తం కావాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నియమిత జాతీయ కార్యదళం (ఎన్‌టీఎఫ్‌) సూచించింది. పెట్రోలియం ఉత్పత్తుల తరహాలో దేశంలో 2-3 వారాలకు సరిపడా వ్యూహాత్మక నిల్వలను ఏర్పాటు చేసుకోవాలని సిఫార్సు చేసింది. ఆసుపత్రుల్లో ప్రాణవాయువు పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. కరోనా రెండో ఉద్ధృతి సమయంలో ఆక్సిజన్‌ అందక దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో.. పరిస్థితిని చక్కదిద్దేందుకు 12 మంది సభ్యులతో సర్వోన్నత న్యాయస్థానం ఎన్‌టీఎఫ్‌ను గత నెల 6న నియమించింది. భవిష్యత్తులో ప్రాణవాయువు సంబంధిత సమస్యలు తలెత్తకుండా నివారించేందుకుగాను పలు సిఫార్సులతో అది ఓ నివేదికను రూపొందించింది. ఆ నివేదికను కేంద్రం సుప్రీంకోర్టుకు శుక్రవారం సమర్పించింది. దేశంలో గత ఏడాది ఏప్రిల్‌లో రోజుకు సగటున 902 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరం ఏర్పడిందని నివేదికలో ఎన్‌టీఎఫ్‌ పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మాత్రం రోజువారీ అవసరం 4,923 మెట్రిక్‌ టన్నులకు పెరిగిందని తెలిపింది. మే 9 నాటికి అది గరిష్ఠంగా 8,943 మెట్రిక్‌ టన్నులను తాకినట్లు వెల్లడించింది. ప్రాణవాయువు కొరతను అధిగమించేందుకు కేంద్రం వ్యవహరించిన తీరును అభినందించింది.

ఎన్‌టీఎఫ్‌ కీలక సిఫార్సులివీ..

  • ప్రతి పెద్ద ఆసుపత్రిలో ఆక్సిజన్‌ పర్యవేక్షణ కమిటీని ఏర్పాటుచేయాలి. అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌, అనస్థీషియా విభాగాధిపతి, రెస్పిరేటరీ మెడిసిన్‌, ఇంటర్నల్‌ మెడిసిన్‌, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌లను అందులో సభ్యులుగా నియమించాలి.
  • 24 గంటలూ అందుబాటులో ఉండేలా నర్సు, టెక్నీషియన్‌తో కూడిన పర్యవేక్షక బృందాన్ని ఏర్పాటుచేయాలి. ఆసుపత్రి ప్రొటోకాల్‌ ప్రకారం ఆక్సిజన్‌ అవసరాన్ని అంచనా వేయడంతో పాటు, దాన్ని ఆదా చేసే బాధ్యతను వారికి అప్పగించాలి.
  • ఆక్సిజన్‌ వినియోగాన్ని తగ్గించడానికి, పొదుపుగా ఉపయోగించడానికి నిపుణుల బృందం జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించాలి. హై ఫ్లో నాసల్‌ ఆక్సిజన్‌కు బదులు నాన్‌ బ్రీతర్‌ మాస్కులు, నాన్‌ ఇన్వేసివ్‌ వెంటిలేషన్‌ ఉపయోగించడం మంచిది.
  • ఆసుపత్రుల్లో రోగులకు 90-94% సాచురేషన్‌ స్థాయిని లక్ష్యంగా నిర్దేశించాలి. ఒకసారి ఈ స్థాయికి వస్తే.. ఆక్సిజన్‌ ఫ్లోని పెంచకూడదు.

ఇదీ చదవండి: పైరవీలకే పట్టం.. ప్రాణవాయువు కోసం పోరాటం

  • రాష్ట్రాల స్థాయిలో ఆక్సిజన్‌ పర్యవేక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. ప్రతి రాష్ట్రంలో 10-12 చోట్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలి. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో ప్రత్యేక నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ప్రాణవాయువును తరలించడానికి రైలు అనుసంధానత ఉండాలి.
  • డిమాండ్‌, సరఫరాను పర్యవేక్షించడానికి రాష్ట్రస్థాయి డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేయాలి. అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, పడకలు, ఏ ఆసుపత్రిలో ఎంత ఆక్సిజన్‌ వినియోగం అవుతోంది వంటి వివరాలు అందులో ఎప్పటికప్పుడు నమోదయ్యేలా చూడాలి.
  • ఆక్సిజన్‌ ట్యాంకర్ల రాకపోకలను సూక్ష్మంగా గమనించాలి. బయలుదేరిన సమయం నుంచి ఆస్పత్రికి చేరేంతవరకు వాటి రాకపోకలను జీపీఎస్‌ వంటి ఐటీ ఆధారిత టూల్స్‌తో ట్రాక్‌ చేయాలి. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు వాడుకొనేందుకు 2-3 వారాలకు సరిపడా అదనపు నిల్వలు అందుబాటులో ఉంచాలి.
  • 100 పడకల ఆసుపత్రిలో 25% ఐసీయూ బెడ్లు ఉంటే.. సగటున రోజుకు 1.5 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరమవుతుంది. ఈ ప్రాతిపదికన ప్రాణవాయువు సరఫరా/పంపిణీ చేపట్టే అవకాశాలను ప్రభుత్వాలు పరిశీలించాలి.
  • ప్రతి రాష్ట్రం ఆక్సిజన్‌ ట్యాంకర్లను రిజర్వులో ఉంచుకోవాలి. మహమ్మారి తీవ్రతలో వచ్చే మార్పులకు అనుగుణంగా డిమాండ్‌, సరఫరా మధ్య హెచ్చుతగ్గులను అందుకొనేందుకు వీటిని సిద్ధం చేసుకోవాలి.
  • మహమ్మారి సమయంలో రాష్ట్రాలకు ట్యాంకర్లను కేటాయించే బాధ్యతలను కేంద్ర ప్రభుత్వమే చూడాలి. అత్యవసర సమయంలో అదనపు ట్యాంకర్లు అవసరమైతే కేంద్రం ఐఎస్‌ఓ కంటెయినర్లను ఉపయోగించాలి.

ఇదీ చదవండి: పల్లెల్లో త్వరలో 'గూగుల్' ఆక్సిజన్ ప్లాంట్లు

  • రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ట్యాంకర్లను కేటాయించాక.. వాటి ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు ఆక్సిజన్‌ను పంపిణీ చేసే బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాలి.
  • రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల మొదలైన వెంటనే ఆక్సిజన్‌ పంపిణీ ప్రణాళికలను అమలుచేయాలి. కేసుల సంఖ్య, భవిష్యత్తులో తలెత్తబోయే సమస్యను ఎప్పటికప్పుడు అంచనావేస్తూ సరఫరా కొనసాగించాలి.
  • మహమ్మారి కాలంలో అవసరమైన రాష్ట్రాలకు ఆక్సిజన్‌ను కేటాయించినప్పుడు.. అవసరం లేని రాష్ట్రాలు తమ కేటాయింపులను వదులుకోవాలి. అవసరానికి మించి ఎక్కువ డిమాండ్‌ చేయకుండా రాష్ట్రాలకు నచ్చజెప్పాలి.
  • మహమ్మారి సమయంలో ప్రాణవాయువు సరఫరా పర్యవేక్షణ కోసం వార్‌ రూం ఏర్పాటుచేయాలి. దాని నిర్వహణ, ఆక్సిజన్‌ పంపిణీ బాధ్యతలను సీనియర్‌ అధికారికి అప్పగించాలి.
  • 5 లీటర్ల ఆక్సిజన్‌ ఇస్తున్నప్పుడు సాచురేషన్‌ స్థాయి 92%కి లోపే ఉంటే రోగులను బోర్లాపడుకొని (ప్రోన్‌ పొజిషన్‌) ఊపిరి తీసుకోమని సూచించాలి. దానివల్ల రోగికి ఆక్సిజన్‌ అవసరం తగ్గుతుంది.
  • నిమిషానికి 12 లీటర్లకు మించి ఆక్సిజన్‌ అవసరమైనప్పుడు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌తో నాన్‌ బ్రీతర్‌ మాస్కుకు బదులు సాధారణ మాస్కు ఉపయోగించడం మేలు.
  • ఆక్సిజన్‌ కేటాయింపులకు యాక్టివ్‌ కేసులు, డబ్లింగ్‌ రేటును ప్రధాన ప్రాతిపదికగా తీసుకోవాలి.
  • గ్రామీణ ఆస్పత్రులు ఆక్సిజన్‌ కోసం సిలిండర్లు, కాన్సన్‌ట్రేటర్లపై ఆధారపడినందున పీఎస్‌ఏ ప్లాంట్లను దుర్బల ప్రాంతాల్లో ఏర్పాటుచేయాలి. తగిన సంఖ్యలో సిలిండర్లు అందుబాటులో ఉంచాలి.

ఇదీ చదవండి: దిల్లీ రాజకీయాల్లో 'ఆక్సిజన్' రగడ

  • నిమిషానికి 5 లీటర్లలోపు ఆక్సిజన్‌ అవసరం ఉన్న జిల్లా ఆసుపత్రులు, గ్రామీణ ప్రాంతాల్లో కాన్సంట్రేటర్లు ఉపయోగించాలి. దానివల్ల 5-7% ఆక్సిజన్‌ ఆదా అవుతుంది.
  • గ్రామీణ ప్రాంతాల్లో ఆక్సిజన్‌ సిలిండర్ల భర్తీ, నిల్వ చాలా ప్రధానం. అందువల్ల జిల్లా, గ్రామీణ ప్రాంతాల్లో కేంద్రీకృత ఫిల్లింగ్‌ స్టేషన్లు ఏర్పాటుచేయాలి.
  • అన్ని సిలిండర్లకు ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లు ఏర్పాటుచేయాలి. దానివల్ల వాటిని ట్రాక్‌ చేయడం సులువవుతుంది.
  • కేటాయించిన ఆక్సిజన్‌ ఉపయోగాన్ని లెక్కించడానికి ఆడిట్‌ కమిటీలను తప్పనిసరిగా ఏర్పాటుచేయాలి.
  • ఆస్పత్రులు అంతర్గతంగా ఉన్న ఆక్సిజన్‌ పైప్‌లైన్‌ను ఆడిట్‌ చేయాలి. దానివల్ల 10-20% ఆక్సిజన్‌ ఆదా అవుతుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.