ETV Bharat / bharat

పిల్లల్లో 5 రోజుల్లో 100 ఎంఐఎస్‌-సీ కేసులు

author img

By

Published : May 28, 2021, 5:45 PM IST

కరోనా నుంచి కోలుకున్న చిన్నారులను ఎంఐఎస్​-సీ వేధిస్తోంది. ఉత్తర భారతంలో గత ఐదు రోజుల్లో 100కు పైగా చిన్నారులు ఈ వ్యాధి బారిన పడినట్లు సమాచారం. 4-18 ఏళ్ల వయసు కలవారిలో ఆకస్మికంగా ఈ కేసులు వెలుగు చూస్తున్నాయని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్‌ ఇంటెన్సివ్ కేర్ ఆందోళన వ్యక్తం చేసింది.

mis-c covid india, covid recovered children
పిల్లల్లో ఎంఐఎస్​-సి కేసులు

ప్రపంచాన్ని పీడిస్తోన్న కరోనా మహమ్మారి..పలు రూపాల్లో ప్రజల ఆరోగ్యంపై దెబ్బ కొడుతోంది. ఇప్పటికే కొవిడ్ నుంచి కోలుకున్నవారిలో ఫంగల్‌ వ్యాధి బయటపడుతుండగా.. చిన్నారులను ఎంఐఎస్‌-సీ రూపంలో వేధిస్తోంది. ఎంఐఎస్‌-సీ అంటే మల్టీసిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్‌ చిల్డ్రన్‌. తాజాగా ఉత్తర భారతంలో ఎంఐఎస్‌ కేసులు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. గత ఐదు రోజుల్లో 100కు పైగా చిన్నారులు దీని బారిన పడ్డారని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్‌ ఇంటెన్సివ్ కేర్ గణాంకాలు వెల్లడించాయి.

కొవిడ్‌ నుంచి కోలుకున్న తరవాత 4-18 సంవత్సరాల వయసు కలవారిలో ఆకస్మికంగా ఈ కేసులు వెలుగు చూస్తున్నాయని అకాడమీ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఆరు నెలల పిల్లల్లో మాత్రం ఈ వ్యాధి అరుదుగా కనిపిస్తుందని తెలిపింది. భారత్‌లో 14 ఏళ్ల లోపువారు 26 శాతం మంది, అందులో సగం 5 ఏళ్ల లోపువారు ఉన్నారని పేర్కొంది.

'ప్రస్తుతం గంగారామ్ ఆసుపత్రిలో ఎంఐఎస్‌తో పదిమంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, మెదడుతో సహా అన్ని అవయవాలపై ఈ వ్యాధి ప్రభావం చూపుతుంది. వ్యాధి ముదరకముందే లక్షణాలను గుర్తించి చికిత్స అందిస్తే, ఎటువంటి ప్రాణాపాయం ఉండదు. గత సంవత్సరం 120 మంది చిన్నారులకు చికిత్స అందించాం. ఒక్కరు మినహా అంతా క్షేమంగా ఇంటికి చేరుకున్నారు' అని ఆసుపత్రిలోని సీనియర్ వైద్యులు డాక్టర్ ధీరెన్ గుప్తా వెల్లడించారు. మొదట ఈ తరహా కేసులు పంజాబ్‌లో వెలుగుచూడగా.. ఆ తరవాత మహారాష్ట్ర, ఇప్పుడు దిల్లీలో నమోదవుతున్నాయని తెలిపారు.

"చిన్నారుల్లో ఈ తరహా కేసులు గత ఏడాది కూడా కనిపించాయి. ఈ సమయంలో పిల్లలు జ్వరం బారిన పడితే వైద్యులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. మూడు రోజులకు పైగా జ్వరం, ఒళ్లు నొప్పులు, దద్దుర్లులాంటి లక్షణాలు ఉంటే జాగ్రత్తగా ఉండాలి. బీపీ పడిపోకముందే వారికి చికిత్స అందించాలి. 7-10 రోజుల్లో వారు కోలుకొని ఇంటికి చేరతారు. పదిశాతం మంది బాధితుల పరిస్థితి మాత్రం కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. వారిలో కిడ్నీలు, కాలేయంపై వ్యాధి ప్రభావం చూపితే కోలుకోవడానికి సమయం పడుతుంది. ఏ వ్యాధి అయినా గుండె, ఊపిరితిత్తులు, మెదడు మీద ప్రభావం చూపితే, అది ప్రాణాంతకంగా మారుతుంది. సరైన సమయంలో వైద్యం అందించకపోతే ఎం.ఐ.ఎస్‌ వల్ల కూడా తీవ్రమైన హాని కలుగవచ్చు."

-డాక్టర్​ ధీరెన్ గుప్తా, గంగారామ్​ ఆసుపత్రి సీనియర్​ వైద్యులు

కాగా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎక్కువ మంది వైద్యులు అందుబాటులో ఉండే విధంగా వైద్యవ్యవస్థలో మార్పులు తేవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం మొదటి దశలో కంటే రెండో దశలో కరోనా చిన్నారులకు తీవ్రంగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎంఐఎస్ లక్షణాలు!

ఆయాసం, శ్వాస ఎక్కువగా తీసుకోవడం, గుండెదడ, గుండె వేగంగా కొట్టుకోవడం, వాంతులు, నీళ్ల విరేచనాలు, కడుపునొప్పి, చర్మంపై దద్దుర్లు, పెదాలు, నాలుక వాచి ఎర్రగా మారడం, చేతులు, కాళ్లు ఎరుపెక్కడం, తలనొప్పి, తల తిరగడం.. ఈ వ్యాధిలో ప్రధాన లక్షణాలు. కొందరిలో జ్వరం కూడా ఉంటుంది. ఎన్ని అవయవాలపై ప్రభావం పడిందన్న దాన్ని బట్టి ఆయా లక్షణాలు కనిపిస్తాయి. విపరీతమైన కడుపునొప్పి, శ్వాసలో ఇబ్బంది, చర్మం, పెదాలు, గోళ్లు, కాళ్లు చేతులు నీలం రంగులోకి మారడం, మెడ దగ్గర వాపు, నిస్సత్తువ వంటివి తీవ్రమైన వ్యాధి లక్షణాలు. ఇలాంటివి కనిపిస్తే వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలి. 24 గంటల పాటు జ్వరం తగ్గకుండా ఉంటే అప్రమత్తమవ్వాలి. ఈ వ్యాధికి అడ్డుకట్ట వేయాలంటే సాధ్యమైనంత త్వరగా పిల్లలకు కూడా కొవిడ్‌ టీకాలు అందుబాటులోకి తేవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి : fungus: సూరత్​లో ఐదు మ్యూకర్​మైకోసిస్​ వేరియంట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.