'81% కేసులు ఒమిక్రాన్​వే'.. సాధారణ జ్వరంలాంటిదేనన్న సీఎం!

author img

By

Published : Jan 3, 2022, 4:43 PM IST

Omicron effect in India

Omicron effect in India: దేశంలో ఒమిక్రాన్​ అలజడి కొనసాగుతోంది. దిల్లీలో.. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 81శాతం ఒమిక్రాన్​ బాధితులో ఉన్నట్టు తేలింది. కేసులు పెరుగుతున్న క్రమంలో.. తాజా పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు దిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

Omicron effect in India: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​.. దేశంలోనూ విజృంభిస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 81శాతం.. ఒమిక్రాన్​ బాధితులే ఉంటున్నారు. తాజా జీనోమ్​ సీక్వెన్సింగ్​ నివేదికలో ఈ విషయం బయటపడిందని దిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేందర్​ జైన్​ వెల్లడించారు.

'డిసెంబర్​ 30-31న మూడు ల్యాబ్​లు విడుదల చేసిన జినోమ్​ సీక్వెన్సింగ్​ నివేదికలో.. 81శాతం నమూనాలు(187లో 152) ఒమిక్రాన్​వే అని తేలింది,' అని జైన్​ పేర్కొన్నారు. కేసులు పెరుగుతున్నా.. ఆరోగ్య వ్యవస్థపై ప్రభావం పడటం లేదని జైన్​ స్పష్టం చేశారు. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని వివరించారు. ఆసుపత్రులు, క్లినిక్​లలో వైద్య సిబ్బంది, ఔషధాల కొరత ఉందంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఒమిక్రాన్​ను ఎదుర్కొనేందుకు తాము అన్నివిధాలుగా సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు.

మరోవైపు.. దిల్లీలో ఒమిక్రాన్​ కట్టడికి అమలు చేసిన నిబంధనలను అనేకమంది ఉల్లంఘిస్తున్నారు. ఈ క్రమంలో.. ఆదివారం ఒక్కరోజే 5,066 కేసులు నమోదుకాగా.. మొత్తం రూ. 1,00,15,300 జరిమానా వసూలు చేశారు అధికారు. అంతకుముందు రోజు.. అంటే ఈ నెల 1న.. రూ. 99 లక్షలు వసూలు చేశారు.

Omicron effect in India
దిల్లీలో కొవిడ్​ నిబంధనలు ఉల్లంఘించి..

కర్ణాటకలో..

Omicron cases in Bangalore: కర్ణాటకలో మరో 10 ఒమిక్రాన్​ కేసులు బయటపడ్డాయి. వీటిల్లో ఒక్క బెంగళూరులోనే 8 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్​ కేసుల సంఖ్య 76కు చేరింది.

గోవాలో..

గోవాలో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడి పాఠశాలలు, కళాశాలలను ఈ నెల 26వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించింది. సోమవారం నిర్వహించిన టాస్క్​ ఫోర్స్​ భేటీ అనంతరం ముఖ్యమంత్రి ప్రమోద్​ సావంత్​ ఈ విషయాన్ని వెల్లడించారు. రాత్రి కర్ఫ్యూను కూడా విధిస్తామని స్పష్టం చేశారు.

ముంబయిలో..

Omicron effect in Maharastra: కొవిడ్​తో దారుణంగా ప్రభావితమైన రాష్ట్రాల్లో ఒకటైన మహారాష్ట్ర.. ఒమిక్రాన్​ కట్టడికి కఠిన చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. 1-9 తరగతులకు ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించింది. 10-12 విద్యార్థులకు తరగతులు కొనసాగుతాయని బృహన్​ముంబయి మున్సిపల్​ కార్పొరేషన్​ స్పష్టం చేసింది.

'వైరల్​ ఫీవరే కానీ..'

ఒమిక్రాన్​ను సాధారణ జ్వరంతో పోల్చారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​. అయితే ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 'ఒమిక్రాన్​ వ్యాప్తి వేగంగా ఉందన్న మాట వాస్తవమే. అయితే కొవిడ్​ రెండో దశతో పోల్చుకుంటే దాని ప్రభావం తక్కువగానే ఉంది. ఒమిక్రాన్​ వేరియంట్​.. చాలా బలహీనమైనది. అది ఒక సాధారణ వైరల్​ ఫీవర్​ లాంటింది. అయితే ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. భయపడాల్సిన పని లేదు,' అని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:- 'భారత్​లో థర్డ్ వేవ్​కు ముగింపు అప్పుడే.. ఎన్నికల ర్యాలీలే సూపర్ స్ప్రెడర్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.