ETV Bharat / bharat

అద్భుతం.. 'చనిపోయిన' కుమారుడ్ని బతికించుకున్న తండ్రి.. గొడవపడి మార్చురీ నుంచి తీసుకెళ్లి..

author img

By

Published : Jun 6, 2023, 5:39 PM IST

Updated : Jun 6, 2023, 6:43 PM IST

odisha-train-accident
odisha-train-accident

Odisha train accident : చనిపోయాడనుకున్న వ్యక్తి బతికితే కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు ఉండవు. అచ్చం అలాంటి ఘటనే ఒడిశాలో జరిగింది. రైలు ప్రమాదంలో చనిపోయాడని ఓ యువకుడిని అధికారులు మార్చురీలో పెట్టేయగా.. అతడి తండ్రి గుర్తించి ఆస్పత్రిలో చేర్పించి బతికించుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే?

Odisha train accident : ఒడిశా రైలు ప్రమాదంలో చనిపోయాడనుకున్న ఓ వ్యక్తి బతకడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మార్చురీలోని కుమారుడి 'మృతదేహాన్ని' చూసినా అతడు సజీవంగానే ఉన్నాడని బలంగా నమ్మిన తండ్రి.. సకాలంలో వైద్యం అందేలా చేసి ప్రాణాలు నిలబెట్టాడు.

నమ్మకమే బతికించింది..
హేలారామ్ మల్లిక్.. బంగాల్​లోని హావ్​డా వాసి. ఓ చిన్న కిరాణా దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. అతడి కుమారుడు బిశ్వజిత్(24) ఈనెల 2న కోరమాండల్​ ఎక్స్​ప్రెస్​లో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన వెంటనే బిశ్వజిత్ మొబైల్​ ఫోన్​కు కాల్ చేశాడు. చాలాసార్లు రింగ్ అయినా ఎటువంటి స్పందన లేదు. చివరకు బిశ్వజిత్ తండ్రి ఫోన్​ కాల్ ఆన్సర్ చేశాడు. ఎంతో నీరసంగా, అస్పష్టంగా ఉన్న కుమారుడి గొంతు విని మల్లిక్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. బావమరిది దీపక్ దాస్​తో కలిసి బాలేశ్వర్​ బయలుదేరాడు. అంబులెన్సులో 235 కిలోమీటర్లు ప్రయాణించి ప్రమాదం జరిగిన చోటుకు చేరుకున్నాడు.
బాలేశ్వర్​లోని ఆస్పత్రుల్లో తన బావమరిదితో కలిసి కొడుకు కోసం వెతికాడు హేలారామ్ మల్లిక్. ఎంతకీ కుమారుడి ఆచూకీ లభించలేదు. అతడి మొబైల్​కు కాల్ చేసినా ఉపయోగం లేదు.

"నేను ఒడిశా రైలు ప్రమాదం గురించి టీవీలో చూశా. నా కుమారుడికి ఏమైందోనని కంగారు పడ్డాను. వెంటనే అతడి మొబైల్​కు కాల్ చేశా.. లిఫ్ట్ చేయలేదు. ప్రమాదం జరిగిన జూన్​ 2న బాలేశ్వర్​కు నా బావమరిదితో కలిసి అంబులెన్స్​లో బయలుదేరాను. అక్కడ క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆస్పత్రులు తిరిగినా నా కుమారుడి ఆచూకీ తెలియలేదు. దీంతో బహగానా హైస్కూల్‌లోని తాత్కాలిక మార్చురీకి నా బావమరిదితో కలిసి వెళ్లాను.

మార్చురీ లోపలికి అక్కడి సిబ్బంది మమ్మల్ని అనుమతించలేదు. అక్కడ చిన్న గొడవ జరిగింది. అక్కడ ఒక చేతిని చూశాను. అది నా కుమారుడిదేనని గుర్తించాను. అతడు బతికే ఉన్నాడు. వెంటనే బాలేశ్వర్​లోని ఆస్పత్రికి తీసుకెళ్లా. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం కోల్​కతాలోని ఆస్పత్రికి తీసుకెళ్లా. నా కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. అందువల్లే అతడు స్పృహ కోల్పోయినట్లు అయిపోయాడు. దీంతో అధికారులు అతడు చనిపోయాడని అనుకున్నారు. ప్రస్తుతం నా కుమారుడు ప్రాణాలతో బయట పడడం ఆనందంగా ఉంది.

--బిశ్వజిత్ తండ్రి మల్లిక్

తీవ్రంగా గాయపడిన బిశ్వజిత్​కు కోల్​కతాలోని ఎస్​ఎస్​కేఎం ఆస్పత్రిలో రెండు శస్త్రచికిత్సలు జరిగాయి. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు. "నాకు పునర్జన్మ లభించినట్లు అనిపిస్తోంది. ఇందుకు నేను నా తండ్రికి రుణపడి ఉంటాను. ఆయనే నాకు దేవుడు. ఆయన వల్లే నా ప్రాణాలు తిరిగొచ్చాయి. నా తండ్రే నాకు సర్వస్వం" అని చెప్పాడు బిశ్వజిత్. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బిశ్వజిత్​ను సోమవారం ఆస్పత్రిలో పరామర్శించారు.
ప్రమాదం తర్వాత బిశ్వజిత్​ శరీరం సుప్త చేతనావస్థలోకి వెళ్లిందని కోల్​కతాలోని ఎస్​ఎస్​కేఎం ఆస్పత్రి వైద్యులు చెప్పారు. ఫలితంగా జీవ క్రియలు ఆగిపోవడం వల్ల అతడు చనిపోయి ఉంటాడని భావించి, మార్చురీకి తరలించి ఉంటారని వివరించారు.

Last Updated :Jun 6, 2023, 6:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.