ETV Bharat / bharat

'కాంగ్రెస్​లో తిరుగుబాటు లేదు, సంస్కరణలే కోరుతున్నాం'

author img

By

Published : Nov 22, 2020, 9:12 PM IST

కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు లేదని సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. పార్టీలో సంస్కరణలు మాత్రమే కోరుకుంటున్నట్లు చెప్పారు. గత 72 ఏళ్లలో కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడే దయనీయంగా మారిందని, ఇది మెరుగుపడాలంటే అంతర్గత ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. పార్టీ వైఫల్యాలపై ఆత్మపరిశీలన చేయాలని ఇతర సీనియర్ నేతలు చేసిన వ్యాఖ్యలు అగ్ర నాయకత్వానికి వ్యతిరేకం కాదని వెల్లడించారు.

No rebellion in Congress, looking for reforms, says Ghulam Nabi Azad
'కాంగ్రెస్​లో తిరుగుబాటు లేదు, సంస్కరణలే కోరుతున్నాం'

కాంగ్రెస్​లో తిరుగుబాటు ఉందన్న వార్తలను ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కొట్టిపారేశారు. పార్టీలో సంస్కరణలను మాత్రమే నేతలు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ఈ సంస్కరణలు పార్టీకి పునరుత్తేజం తీసుకురావడానికి ఉపయోగపడతాయని చెప్పారు.

గులాం నబీ ఆజాద్

"కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు లేదు. మేం సంస్కరణలు కోరుకుంటున్నాం. తిరుగుబాటు అంటే ఒకరి స్థానంలో మరొకరిని నియమించడం. పార్టీ అధ్యక్ష పదవికి మరొక అభ్యర్థి లేరు. ఇది తిరుగుబాటు కాదు. పార్టీ శ్రేయస్సు కోసం అవసరమైన వాటిని చేయాలని మేం కోరుకుంటున్నాం."

-గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ సీనియర్ నేత

బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై స్పందించిన ఆజాద్.. పార్టీకి పునరుత్తేజం తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. కొత్త ఫార్ములా గురించి ఆలోచించాలని చెప్పారు. వ్యవస్థను మార్చాలని అభిప్రాయపడ్డారు. ఈ వైఫల్యాలకు నాయకత్వాన్ని బాధ్యులను చేయడం లేదని అన్నారు. పార్టీ నేతలు క్షేత్రస్థాయి ప్రజలతో సంబంధాలు కోల్పోయారని అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయి నాయకత్వం పార్టీ మెరుగుదలకు పనిచేయాలని అన్నారు.

"5 స్టార్ హోటళ్లలో ఉండి ఎన్నికలను గెలవలేము. పార్టీ టికెట్ రాగానే నేతలంతా 5 స్టార్ హోటల్​ను బుక్ చేసుకుంటున్నారు. కఠినమైన దారుల్లో నడవడం లేదు. ప్రస్తుతం పరిస్థితి ఇలాగే ఉంది. ఈ 5 స్టార్ సంస్కృతి మారే వరకు ఎన్నికల్లో గెలవలేం. ఆఫీస్ బేరర్లు తమ బాధ్యతలను గుర్తుంచుకోవాలి."

-గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ సీనియర్ నేత

ఎన్నికలు నిర్వహించాల్సిందే..

పార్టీలోని పలువురు నేతలు కలిసి కాంగ్రెస్ నాయకత్వానికి రాసిన లేఖలోని విషయాలను ప్రస్తావించారు ఆజాద్. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పూర్తి స్థాయి నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలని తాము సూచించినట్లు తెలిపారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీతో పాటు, రాష్ట్ర, జిల్లా స్థాయిలో స్వతంత్రంగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. పార్టీ పునరుత్తేజానికి సంస్థాగత నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో చెప్పినట్లు వివరించారు. ఇవన్నీ జరిగే వరకు పరిస్థితుల్లో మార్పు ఉండదని అన్నారు.

పార్టీ హైకమాండ్ విషయంలో ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పార్టీలో ఎన్నికలు నిర్వహించడం కుదరలేదని.. అయితే తమ డిమాండ్లలో ఎలాంటి మార్పు లేదని అన్నారు. జాతీయ స్థాయిలో భాజపాకు ప్రత్యామ్నాయంగా మారాలంటే అంతర్గత ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేశారు. 72 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో పార్టీ పరిస్థితి ఇప్పుడే దయనీయంగా మారిందని తెలిపారు.

"భాజపాకు ఏ పార్టీ ప్రత్యామ్నాయంగా మారే అవకాశం లేదు. జాతీయ పార్టీగా మారాలంటే జాతీయ స్థాయి ఆలోచనలు ఉండాలి. జాతీయ స్థాయిలో కార్యచరణ ఉండాలి. సెక్యులర్ దృక్పథం ఉండాలి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గత 72 ఏళ్లలో అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. రెండు దఫాల్లో పార్టీకి లోక్​సభలో ప్రతిపక్ష హోదా కూడా రాలేదు."

-గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ సీనియర్ నేత

పార్టీ నిర్మాణం పూర్తిగా ధ్వంసమైందని, దాన్ని పూర్తిగా పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ఆజాద్. అయితే అంతర్గతంగా ఎన్నికలు నిర్వహించినంత మాత్రాన.. ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదని, పార్టీ వ్యవస్థను మార్చాలని అన్నారు. వైఫల్యాలపై పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలని ఇతర సీనియర్ నేతలు చిదంబరం, కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలు తప్పు కాదని అన్నారు ఆజాద్. వారి వ్యాఖ్యలకు అర్థం పార్టీ అగ్రనాయకత్వాన్ని మార్చడం కాదని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.