ETV Bharat / bharat

మూడేళ్లుగా అత్యాచార కేసు లేని ఆదర్శ జిల్లా

author img

By

Published : Mar 24, 2021, 12:51 PM IST

'No rape case in Lahaul And Spiti in the past three years'
దేశానికే ఆదర్శం.. మూడేళ్లలో ఒక్క అత్యాచార కేసు లేదు

హిమాచల్​ ప్రదేశ్​లోని లాహోల్​-స్పీతి జిల్లా దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. అక్కడ మూడేళ్లుగా ఒక్క అత్యాచార కేసు కూడా నమోదు కాలేదు. మహిళపై దాడులు జరిగే ఘటనలు చాలా తక్కువ. అక్కడి మహిళలు ప్రతి విషయంలోనూ ముందుంటూ నిర్ణయాత్మక శక్తిగా నిలుస్తున్నారు. మహిళలను గౌరవించడం తమ సంస్కృతిలో భాగమే అని స్థానికులు చెబుతున్నారు.

అత్యంత చల్లగా ఉండే రాష్ట్రాల్లో హిమాచల్​ ప్రదేశ్​ ఒకటి. అక్కడ ఓ జిల్లా మహిళల విషయంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఈ ప్రాంతంలో మూడేళ్లుగా ఇప్పటివరకు ఒక్క అత్యాచార ఘటన కూడా వెలుగు చూడలేదు. ఆడవారిపై నేరాలు దాదాపు లేనట్టే. వరకట్న వేధింపుల దాఖలాలే ఉండవు. ఈ ప్రాంత మహిళలు మగవారికి ఏ విషయంలోనూ తీసిపోరు. వ్యవసాయం, పూల తోటల పెంపకం, వ్యాపారం ఇలా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఆ జిల్లానే లాహోల్​-స్పీతి.

ఒక్క అత్యాచార కేసు లేదు..

దేశవ్యాప్తంగా రోజుకు ఎన్నో అత్యాచార కేసులు వెలుగు చూస్తున్నాయి. కానీ లాహోల్​-స్పీతి జిల్లాలో మూడేళ్లుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. వేరే ప్రాంతాల్లా మహిళలపై హింసాత్మక దాడులు ఇక్కడ ఎక్కువగా ఉండవు. లింగనిష్పత్తి విషయంలో ఇక్కడ 1,000 మంది అబ్బాయిలకు 1,033 మంది అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిల అక్షరాస్యత రేటు మిగతా చోట్లతో పోల్చితే మెరుగ్గా ఉంది.

"పొలాల నుంచి తోటల వరకు, ఇంటి పనుల నుంచి ఇతర రంగాల వరకు ఇక్కడి మహిళలు ముందుంటారు. అన్ని విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలను మహిళల అంగీకారంతోనే తీసుకుంటారు. ఇక్కడి పండుగలను మహిళలు ప్రత్యేకంగా జరుపుతారు."

- రామ్​లాల్ మార్కాండ, హిమాచల్ ప్రదేశ్​ మంత్రి

సంస్కృతిలో భాగమే..

మహిళలను గౌరవించడం ఇక్కడ సంస్కృతిలో భాగమే అంటున్నారు స్థానికులు. కుమార్తె పుట్టడం శుభంగా భావిస్తారు. భ్రూణహత్యలు, వరకట్న వేధింపులు లాంటివి ఏ కోశానా ఉండవు. తల్లిదండ్రులు కూడా కుమార్తెలను ప్రతి విషయంలో ప్రోత్సహిస్తారు.

"అమ్మాయిలను గౌరవించడం ఇక్కడి సంప్రదాయం. మాతో పాటు కళాశాలకు వచ్చే వారిని ఎవరూ ఇబ్బంది పెట్టరు. ర్యాగింగ్​ లాంటివి ఉండవు. వారికి వీలైనంత వరకు సహకరిస్తాం."

-అజయ్​ పాల్​, విద్యార్థి సంఘం నాయకుడు

నిర్ణయాత్మక శక్తిగా 'ఆమె'...

లాహోల్​ స్పీతి జిల్లాలో 50 వేలకు పైగా జనాభా ఉంటుంది. ప్రతి ఇంట్లో 'ఆమె'కు ప్రత్యేక గౌరవం ఉంటుంది. ఇంటి బాధ్యతలు అన్నీ మహిళలే చూసుకుంటారు. ఇంటి పనులు, వంట పనులు అని తేడా లేకుండా చేస్తారు. ఇంటికి సంబంధించిన సామాజిక, ఆర్థిక విషయాల్లో ఆమె నిర్ణయానికే ప్రాధాన్యం ఉంటుంది.

ఇదీ చూడండి: ఆ ప్రాంతాల్లో కొవిడ్ కేసులు 'జీరో'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.