ETV Bharat / bharat

'అనుమానమే లేదు.. నితీశ్​దే మళ్లీ సీఎం పీఠం'

author img

By

Published : Nov 11, 2020, 4:12 PM IST

బిహార్​ ఎన్నికల్లో భాజపా అనూహ్యంగా ఎక్కువ సీట్లు గెలిచాక సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై చర్చ మొదలైంది. జేడీయూకు తక్కువ సీట్లు వచ్చినా ఆ పార్టీ అధ్యక్షుడు నితీశ్​ కుమార్​కే మళ్లీ పీఠం కట్టబెడతారా? ఈసారి కాషాయం పార్టీ నేత ఎవరైనా పగ్గాలు అందుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో తర్వాతి సీఎం ఎవరనేదానిపై స్పష్టతనిచ్చారు భాజపా నేత సుశీల్​ మోదీ.

nitish kumar vs sushil modi
'అనుమానమే లేదు.. నితీశ్​కే మళ్లీ సీఎం పీఠం'

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తేలినా ముఖ్యమంత్రి పీఠం అధిరోహించేది ఎవరనేదానిపై ఇప్పటికీ సందిగ్ధం నెలకొంది. నితీశ్​ కుమార్​ మరోసారి సీఎంగానే కొనసాగుతారా? అనూహ్యంగా ఎక్కువ సీట్లు నెగ్గిన భాజపా అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అనుమానాలను పటాపంచలు చేస్తూ నితీశ్​ కుమారే తదుపరి సీఎం అని బుధవారం స్పష్టతనిచ్చారు ఉపముఖ్యమంత్రి, భాజపా నేత సుశీల్​ మోదీ. నితీశ్​ స్థానాన్ని వేరొకరితో భర్తీ చేసే ఆలోచనేలేదని తేల్చిచెప్పారు.

"బిహార్​ తర్వాతి సీఎం నితీశ్​ కుమార్​. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. ఎన్నికల ముందే ఈ నిర్ణయం తీసుకున్నాం. దానికి కట్టుబడి ఉంటాం. కూటమిగా ఉన్నప్పుడు ఒక భాగస్వామి ఎక్కువ సీట్లు గెలుస్తారు. మరొకరికి తక్కువ స్థానాలే రావచ్చు. కానీ మేమంతా సమానం. ప్రజలు ఎన్​డీఏకు ఓటు వేశారు".

-- సుశీల్​ మోదీ, భాజపా నేత

ఎల్​జేపీతో బంధం కొనసాగించడంపై ప్రశ్నించగా​.. చిరాగ్​ కూటమి నుంచి వైదొలిగినందున ఆ పార్టీ గురించి మాట్లాడాలని అనుకోవడంలేదని స్పష్టం చేశారు సుశీల్. బిహార్​ ఎన్​డీఏలో ఎల్​జేపీ లేదని స్పష్టంచేశారు.

బిహార్‌ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో.. 125 స్థానాలను ఖాతాలో వేసుకుంది. ఈ కూటమిలోని భాజపా(74), జేడీయూ(43), వికాశ్​ శీల్​ ఇన్సాన్​ పార్టీ(4), హిందుస్థాన్​ అవామీ మోర్చా(4) సీట్లను దక్కించుకున్నాయి. ఆర్జేడీ నేతృత్వంలోని మహాగట్‌బంధన్ ‌(ఎంజీబీ) 110 స్థానాల్లో గెలుపొందింది. ఈ కూటమిలోని ఆర్జేడీ 75, కాంగ్రెస్​ 19, లెఫ్ట్​ పార్టీలు 16 సీట్లు గెలుచుకున్నాయి. మరోవైపు ఇతరులు 7 స్థానాల్లో విజయం సాధించగా.. ఎల్​జేపీ కేవలం ఒక్క స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

మోదీతోనే నడుస్తా..

బిహార్​ ఎన్నికల్లో ఒక్క స్థానంకే పరిమితమైన లోక్​ జనశక్తి పార్టీ(ఎల్​జేపీ) భవితవ్యంపై ఫలితాల అనంతరం ఆ పార్టీ అధ్యక్షుడు చిరాగ్​ పాసవాన్​ మాట్లాడారు. బిహార్​లో నితీశ్​ కుమార్​, ఉప ముఖ్యమంత్రి సుశీల్​ మోదీ ప్రభుత్వానికి ఎప్పటికీ మద్దతివ్వనని స్పష్టం చేశారు చిరాగ్​.

" నితీశ్​-సుశీల్​ మోదీ ప్రభుత్వం కొనసాగితే.. రాష్ట్ర స్థాయిలో నా నుంచి మద్దతు ఉండదు. అయితే ప్రధాని మోదీతోనే ఎప్పటికీ పనిచేస్తా. చాలా చోట్ల విజయానికి చేరువగా వచ్చాం. మా పార్టీ అద్భుతంగా పనిచేసింది."

-- చిరాగ్​ పాసవాన్​, ఎల్​జేపీ అధ్యక్షుడు

ఈ ఎన్నికల తప్పిదాలను సరిచేసుకొని 2025 ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు చిరాగ్​. ఒంటరిగా పోరాడేందుకు మద్దతుగా నిలిచిన కార్యకర్తలు, అభ్యర్థులకు ధన్యవాదాలు తెలిపారు. తమ పార్టీకి దాదాపు 25 లక్షల ఓట్లు వచ్చాయని.. అవి మొత్తం పోలైన ఓట్లలో 6శాతమని అభిప్రాయపడ్డారు. ఆర్జేడీతోనూ జట్టు కట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఎల్​జేపీ కేవలం మటిహని ప్రాంతంలో మాత్రమే జయకేతనం ఎగురవేసింది. జేడీయూ నేత నరేంద్ర సింగ్​ కుమార్​పై కేవలం 333 ఆధిక్యంతో ఆ స్థానంలో గెలుపొందారు ఎల్​జేపీ నేత రాజ్​కుమార్​ సింగ్​.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.