ETV Bharat / bharat

కొత్త వేరియంట్ వల్లే కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయా?

author img

By

Published : Jun 7, 2022, 5:05 AM IST

new-stronger-variant-causing-for-recent-covid-surge
కొత్త వేరియంట్ వల్లే కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయా?

Covid 19 cases: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్​ వల్లే కేసుల్లో వృద్ధి నమోదవుతోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.

Corona Cases in India: దేశవ్యాప్తంగా గత కొన్నిరోజులుగా కొవిడ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రోజువారీ కేసుల సంఖ్య గత మూడు నెలల గరిష్ఠానికి చేరుకుంది. ఇలా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగడానికి కొత్త వేరియంట్‌ కారణమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ను భారీ స్థాయిలో చేపట్టాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒక వేళ దీన్ని చేపట్టకుంటే.. వైరస్‌ ఉద్ధృతికి కారణాలు తెలుసుకోలేమని హెచ్చరిస్తున్నారు.

సీక్వెన్సింగ్‌ పెంచాల్సిందే
గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 4518 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో క్రియాశీల కేసుల సంఖ్య 25వేలు దాటడంతోపాటు పాజిటివిటీ రేటు ఒకశాతం దాటింది. అయితే, ఇందుకు ఒమిక్రాన్‌ దాని ఉపరకాలే కారణం అయినట్లు భావిస్తున్నప్పటికీ వ్యాధి తీవ్రత మాత్రం తక్కువగానే ఉందని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జెనెటిక్స్‌ అండ్‌ సొసైటీ (TIGS) డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా పేర్కొన్నారు. ఒకవేళ బాధితులు అనారోగ్యం బారినపడితే మాత్రం దాన్ని తీవ్రంగా పరిగణించాలని.. ముఖ్యంగా కొత్త వేరియంట్‌ వచ్చే అవకాశం ఉన్నందున వాటిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అందుకే ఎంతో కీలకమైన జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ను అధికంగా చేపట్టాలని సూచించిన ఆయన.. ఆస్పత్రికి వచ్చే ప్రతి వ్యక్తి నమూనాలకు సీక్వెన్సింగ్‌ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి వైరస్‌లు ఎప్పుడూ మార్పులకు గురౌతూనే ఉంటాయని.. వైరస్‌ మార్పులకు లోనైన సమయాల్లో కేసుల సంఖ్య పెరగడం సాధారణమేనని ఎయిమ్స్‌ నిపుణులు డాక్టర్‌ సంజయ్‌ రాయ్‌ పేర్కొన్నారు. అయితే రెండో, మూడో వేవ్‌ల నాటి పరిస్థితి ప్రస్తుతం దేశంలో లేదని డాక్టర్‌ సంజయ్‌ రాయ్‌ అభిప్రాయపడ్డారు.

నాలుగో వేవ్‌కు దారితీస్తుందా..?
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో కొవిడ్‌ ఉద్ధృతి క్రమంగా పెరుగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ ఇటీవలే అలెర్ట్‌ చేసింది. వీటిలో మహారాష్ట్రలో అత్యధిక కొవిడ్‌ కేసులు నమోదవుతుండగా ముంబయి నగరంలో రోజువారీ కేసుల సంఖ్య వెయ్యికి చేరువయ్యాయి. అక్కడ క్రియాశీల కేసుల సంఖ్య ఐదు వేలను దాటింది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ నాలుగో వేవ్‌కు ముంబయి కేంద్ర బిందువుగా మారనుందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, ప్రస్తుతం కొవిడ్‌ ఫోర్త్‌ వేవ్‌ వచ్చే అవకాశాలు తక్కువే అయినప్పటికీ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొవిడ్‌ ఆంక్షలు లేకపోవడం, మాస్కులు, భౌతిక దూరం వంటి నిబంధనలు పాటించకపోవడం వైరస్‌ వ్యాప్తికి అవకాశం ఇవ్వడమేనని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే వైరస్‌ బారినపడి కోలుకున్న వారి సంఖ్య అధికంగా ఉండడం, పూర్తి మోతాదుల్లో వ్యాక్సిన్‌ తీసుకోవడం వంటి చర్యల వల్ల అంతగా ప్రమాదం ఉండకపోవచ్చని చెబుతున్నారు. కేసుల సంఖ్య పెరిగినప్పటికీ వ్యాధి తీవ్రత తక్కువగానే ఉండనుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి: కేరళలో నోరో వైరస్ కలకలం.. కేంద్రం హైఅలర్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.