ETV Bharat / bharat

Viveka case: వివేకా హత్య కేసు విచారణ వాయిదా.. తదుపరి విచారణ ఎప్పుడంటే..?

author img

By

Published : Apr 28, 2023, 12:37 PM IST

cbi
cbi

11:41 April 28

నిందితులను సీబీఐ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

Vivekananda Reddy murder case latest updates: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉన్న నాంపల్లి సీబీఐ కోర్టు నేడు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను జూన్‌ 2వ తేదీకి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు వివేకానంద రెడ్డి హత్యతో సంబంధమున్న నిందితులను సీబీఐ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అధికారులు హాజరుపరిచిన నిందితుల్లో.. ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్, ఉమాశంకర్‌ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి ఉన్నారు. అనంతరం విచారణ జరిపిన సీబీఐ కోర్టు.. తదుపరి విచారణను జూన్‌ 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.

ఎర్ర గంగిరెడ్డి బెయిలును రద్దు.. తాజాగా వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి ఎర్ర గంగిరెడ్డి బెయిలును రద్దు చేస్తూ.. నిన్న తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరించింది. తీర్పులో భాగంగా వచ్చే నెల 5వ తేదీలోపు సీబీఐ కోర్టు ముందు లొంగిపోవాలని నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ కోర్టు ఆదేశాల ప్రకారం నిందితుడు ఎర్ర గంగిరెడ్డి కోర్టు ముందు గనక లొంగిపోకపోతే సీబీఐ పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి, కోర్టు ముందు హాజరుపరచాలంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని ఆదేశించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) ఆదేశాల మేరకు జూన్‌ 30వ తేదీన దర్యాప్తు పూర్తయ్యేదాకా ప్రధాన నిందితుడైన ఎర్ర గంగిరెడ్డిని జైల్లో ఉంచాలని ఆదేశించింది.

అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు.. ప్రస్తుత కడప ఎంపీ, వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈరోజు మరోసారి తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. శుక్రవారం (ఇవాళ) మధ్యాహ్నం 3.30 గంటలకు కోర్టులో న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. గురువారం రోజున అవినాష్‌ రెడ్డి పిటిషన్‌పై దాదాపు గంటన్నర గంటల పాటు వాదనలు కొనసాగాయి.

అందుకే అతనికి ఆ ఆదేశాలు జారీ చేశాం..! ఈ నేపథ్యంలో ఎంపీ అవినాష్‌ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తునకు సహకరించటంలేదని సీబీఐ కోరులో వాదనలు వినిపించింది. దీంతో అందుకే అతనికి రాతపూర్వక ప్రశ్నలు, సమాధానాలు ఇవ్వాలని ఆదేశించినట్లు తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తన వాదనలు వినిపిస్తూ.. ఇటీవలే తెలంగాణ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసిందని తెలిపారు. ఈ క్రమంలో వివేకా హత్య కేసుకు సంబంధించి నేడు నిందితులను నాంపల్లి సీబీఐ కోర్టులో అధికారులు హాజరుపరచగా.. తదుపరి విచారణను జూన్‌ 2వ తేదీకి వాయిదా వేసింది.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.