ETV Bharat / bharat

TSPSC Paper Leak Case : 'ఇంకెంత కాలం దర్యాప్తు'.. సిట్​ను ప్రశ్నించిన హైకోర్టు

author img

By

Published : Apr 28, 2023, 2:32 PM IST

TSPSC Paper Leak Case
TSPSC Paper Leak Case

11:32 April 28

టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు విచారణ జూన్ 5కు వాయిదా

TSPSC Paper Leak Case: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్‌పై ప్రస్తుత దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. సీల్డు కవర్‌లో సిట్ సమర్పించిన నివేదికను పరిశీలించి ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని ఈ నెల 24న ఉన్నత న్యాయస్థానం సూచనప్రాయంగా తెలిపింది. సీబీఐకి ఇవ్వాలంటూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి ఇవాళ మరోసారి విచారణ జరిపారు. సిట్ నివేదికను పరిశీలించామని.. దర్యాప్తు కొంత మేరకు సంతృప్తిగానే ఉందని.. అయితే వేగంగా జరగడం లేదని హైకోర్టు పేర్కొంది.

ఈ క్రమంలోనే నెలన్నర రోజులైనప్పటికీ దర్యాప్తు ఎందుకు పూర్తి కావడం లేదని.. ఇంకా ఎంతకాలం చేస్తారని ప్రశ్నించింది. లీకేజీ ఎక్కడ ప్రారంభమైంది.. ఎవరెవరికి లింకు ఏంటనే విషయంపై స్పష్టత వచ్చినప్పుడు ఇంకా ఆలస్యమేంటని అడిగింది. అయితే ఫోరెన్సిక్ నివేదికల కోసం వేచి చూస్తున్నామని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు. దర్యాప్తుపై టీఎస్‌పీఎస్సీ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఔట్ సోర్సింగ్‌ సిబ్బంది అందరిని ప్రశ్నించారా.. వారిలో ఎంతమంది లబ్ధి పొందారని హైకోర్టు అడిగింది.

ఇప్పటి వరకు అరెస్టయిన వారిలో నలుగురు టీఎస్‌పీఎస్సీలో పని చేస్తున్న వారే ఉన్నారన్న హైకోర్టు.. వారందరు పరీక్షలు రాసేందుకు అనుమతి తీసుకున్నారా అని న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్ అనుమతి తీసుకున్నాడని సిట్ అధికారి హైకోర్టుకు తెలిపారు. అనుమతి ఎవరి నుంచి తీసుకున్నారని ప్రశ్నించిన న్యాయమూర్తి.. సంబంధిత అధికారి వాంగ్మూలం సీల్డు కవర్‌లో ఉందా అని అడిగారు. టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శి నుంచి అనుమతి తీసుకున్నారని.. ఆ వాంగ్మూలం కోర్టుకు సమర్పించిన సీల్డు కవర్‌లో లేదని తెలిపారు. పరీక్ష రాసేందుకు ప్రవీణ్ కుమార్ పొందిన అనుమతి పత్రాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సిట్ వివరించింది. డబ్బులు ఎవరెవరి చేతులు మారాయో తేల్చడానికి ఇంత ఆలస్యమెందుకున్న హైకోర్టు.. బ్యాంకు, ఫోన్ కాల్ డేటా వివరాలు పరిశీలిస్తే తేలుతుంది కదా అని వ్యాఖ్యానించింది.

నిందితులు ప్రశ్నపత్రాలు తమ కోసమే తీసుకున్నారా లేదా ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకున్నారా అని హైకోర్టు ఆరా తీసింది. కొందరు స్వయంగా పరీక్షలు రాశారని.. మరికొందరు నిందితులు ఇతరులకు ఇచ్చారని ఏజీ తెలిపారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సెక్రటరీ, సభ్యుడు లింగారెడ్డిని విచారణ జరిపామని.. దర్యాప్తు సరైన దిశలోనే వెళ్తోందని ఏజీ వివరించారు. సిట్ సామర్థ్యం, దర్యాప్తుపై సమీక్షించి నివేదిక ఇవ్వాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీల్లో ఒకరిని తాము కోరవచ్చా.. ఏమైనా అభ్యంతరమా అని హైకోర్టు మరోసారి ప్రభుత్వాన్ని అడిగింది. అయితే హైదరాబాద్ సీపీ పర్యవేక్షణలోనే దర్యాప్తు జరుగుతోందని ఏజీ బీఎస్ ప్రసాద్ తెలిపారు. పిటిషన్‌పై విచారణను జూన్ 5కు వాయిదా వేసిన హైకోర్టు.. దర్యాప్తు పురోగతి నివేదికను సమర్పించాలని సిట్‌ను ఆదేశించింది.

ఇవీ చూడండి..

TSPSC Leak Case: మన పిల్లలు పరీక్షలు రాస్తే ఆ బాధ తెలుస్తుంది: హైకోర్టు

Sharmila: 'టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ నుంచి మంత్రి కేటీఆర్​ను కాపాడేందుకే సిట్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.