ETV Bharat / bharat

మోదీ.. పాత కథల్లోని అహంకార రాజు: ప్రియాంక

author img

By

Published : Feb 20, 2021, 8:41 PM IST

పాత కథల్లో ఉండే అహంకార రాజు పాత్ర వంటి వ్యక్తి.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అని కాంగ్రెస్​ నేత ప్రియాంక గాందీ ఎద్దేవా చేశారు. దేశాన్ని కాపాడే సైనికుడు కూడా రైతు బిడ్డే అనే విషయాన్ని ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారని విమర్శించారు. మోదీ రాజకీయాలన్నీ తాను, తన బిలియనీర్​ స్నేహితుల ప్రయోజనం కోసమేనని ఆరోపించారు.

priyanka on modi
మోదీ.. పాత కథల్లోని అహంకార రాజు వంటి వ్యక్తి: ప్రియాంక

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మరోసారి విమర్శల దాడి చేశారు. మోదీ వంటి అహంకార రాజులు పాత కథల్లో ఉండేవారని విమర్శించారు. దేశాన్ని కాపాడే సైనికుడు కూడా ఒక రైతు బిడ్డేనని ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారని తెలిపారు. ఉత్తర్​ ప్రదేశ్​లోని ముజఫర్​నగర్​లో కిసాన్ మహాపంచాయత్​ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు.

నూతన సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతులు ఎంతగా నిరసిస్తున్నా.. వారి బాధలను ప్రధాని పట్టించుకోవడం లేదని ప్రియాంక అన్నారు. మోదీ రాజకీయాలన్నీ తాను, తన కోటీశ్వరులు స్నేహితుల మీదే ఉంటాయని వ్యాఖ్యానించారు.

"దేశాన్ని కాపాడే సైనికుడు కూడా ఒక రైతు బిడ్డేనని మోదీ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ నూతన సాగు చట్టాలతో మీ(రైతుల) హక్కులు అంతమవుతాయి. దేశాన్ని తన ఇద్దరు, ముగ్గురు స్నేహితులకు ఎలా అమ్మేశారో.. అదే విధంగా మిమ్మల్ని, మీ భూములను, మీ ఆదాయాలను అమ్మేస్తారు. దిల్లీ సరిహద్దులో ఉద్యమిస్తున్న రైతుల ప్రదేశం.. మోదీ నివాసానికి ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆయన విదేశాలకు వెళ్లగలరు. కానీ, ఎందుకని లక్షలాది మంది అన్నదాతల వద్దకు వెళ్లలేకపోతున్నారు. వారి కన్నీటిని ఎందుకు తుడవలేకపోతున్నారు. వారి బాధలను ఎందుకు వినిపించుకోవట్లేదు. ఎందుకంటే.. ఆయన రాజకీయాలన్నీ తాను, తన బిలియనీర్ పెట్టుబడిదారుల​ మిత్రుల కోసమే."

-ప్రియాంక గాంధీ, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి

గతేడాది డీజిల్​పై పన్నులు విధించి భాజపా ప్రభుత్వం రూ.3.5 లక్షల కోట్లను ఆర్జించిందని ప్రియాంక గాంధీ చెప్పారు. ఆ డబ్బులన్నీ ఎక్కడకు వెళ్లాయని ఆమె ప్రశ్నించారు. విద్యుత్​, గ్యాస్​ సిలిండర్ల ధర పెరిగినప్పటికీ రైతులు పండించే చెరకు ధర మాత్రం పెంచట్లేదని తెలిపారు. దేశవ్యాప్తంగా అన్నదాతలు నూతన సాగు చట్టాలు వద్దని డిమాండ్​ చేస్తుంటే.. ఎందుకు రద్దు చేయలేకపోతున్నారని ప్రియాంక మండిపడ్డారు.

ఇదీ చదవండి:'రైతులకు పెళ్లి కావట్లేదు సర్​.. చట్టం తీసుకురండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.