ETV Bharat / bharat

యుద్ధం మనకు ఆఖరి ప్రత్యామ్నాయం.. కానీ..: మోదీ

author img

By

Published : Oct 24, 2022, 1:11 PM IST

యుద్ధాన్ని భారత్​ ఎల్లప్పుడూ చివరి ప్రత్యామ్నాయంగానే చూసిందని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అయితే.. దేశంపై కన్నేసే దుష్టశక్తులకు దీటైన జవాబు ఇచ్చేందుకు భద్రతా దళాలు సర్వత్రా సిద్ధంగా ఉంటాయని స్పష్టం చేశారు. కార్గిల్​లో జవాన్లతో కలిసి దీపావళి జరుపుకున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు మోదీ.

modi diwali with soldiers
యుద్ధం మనకు ఆఖరి ప్రత్యామ్నాయం.. కానీ..: మోదీ

Modi Diwali with soldiers : భారత్‌ను చెడు దృష్టితో చూసేవారికి దీటైన జవాబిచ్చే సత్తా, వ్యూహాలు దేశ సైనిక బలగాలకు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. అయితే.. యుద్ధం తమ చివరి ప్రత్యామ్నాయమని తేల్చిచెప్పారు. ఏటా సైనికులతో కలిసి దీపావళి జరుపుకుంటున్న ప్రధాని.. ఈసారి కార్గిల్‌లో జవాన్లతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. భారత సైనికులు ఎన్నో సంవత్సరాలుగా తన కుటుంబ సభ్యులుగా మారారని ఆయన చెప్పారు. దీపావళి వెలుగులు.. ప్రపంచంలో శాంతిని నింపాలని భారత్‌ అభిలషిస్తోందని వెల్లడించారు.

"యుద్ధాన్ని మేము ఎప్పుడూ తొలి ప్రత్యామ్నాయంగా చూడడంలేదు. మన వీరత్వం వల్లకానీ, సంస్కారం వల్లకానీ మనం యుద్ధాన్ని ఎప్పుడూ అంతిమ ప్రత్యామ్నాయంగానే చూస్తున్నాం. యుద్ధం లంకలో జరిగినా, తర్వాత కురుక్షేత్రంలో జరిగినా ఆఖరి వరకు ఆపేందుకు అన్ని ప్రయత్నాలు జరిగాయి. అలాగే మనం విశ్వశాంతిని కోరుకునేవాళ్లం. మేము యుద్ధానికి విరోధులం. అయితే బలం లేకుండా శాంతి కూడా సాధ్యంకాదు."

--నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

సరిహద్దులు భద్రంగా, ఆర్థిక వ్యవస్థ బలంగా, సమాజం పూర్తి విశ్వాసంతో ఉన్నప్పుడు దేశం సురక్షితంగా ఉంటుందని మోదీ అభిప్రాయపడ్డారు. దేశం వెలుపల, లోపల ఉన్న శత్రువులను విజయవంతంగా ఎదుర్కోవడం వల్ల అంతర్జాతీయంగా భారత ప్రతిష్ఠ పెరిగిందన్నారు. అవినీతిపై నిర్ణయాత్మక పోరు సాగుతోందని ఆయన చెప్పారు. అవినీతిపరులు ఎంతటివారైనా వదిలేదిలేదని తేల్చిచెప్పారు.

modi diwali with soldiers
కార్గిల్​లో మోదీ

దశాబ్దాలుగా సైనిక బలగాల్లో చేపట్టాల్సిన సంస్కరణలు నేడు అమలవుతున్నాయని వివరించారు ప్రధాని. సైనిక బలగాల్లో మహిళలను చేర్చుకోవడం మన బలాన్ని మరింత పెంచుతుందని అభిప్రాయపడ్డారు. విదేశీ ఆయుధాలు, వ్యవస్థలపై ఆధారపడాన్ని తగ్గించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. దేశ భద్రతకు ఆత్మనిర్భర భారత్‌... చాలా ముఖ్యమని వివరించారు. భారత్‌ బలం పెరిగితే.. ప్రపంచశాంతి, సుస్థిరత కూడా పెరుగుతుందని మోదీ చెప్పారు.

modi diwali with soldiers
కార్గిల్​లో మోదీ

భావోద్వేగ కలయిక..
మోదీ కార్గిల్ పర్యటన.. ఓ భావోద్వేగ కలయికకు వేదికైంది. 21 ఏళ్ల క్రితం విద్యార్థిగా మోదీని కలిసిన ఓ వ్యక్తి.. ఇప్పుడు ఓ ఆర్మీ అధికారి హోదాలో ప్రధానితో మాట్లాడారు. 2001లో గుజరాత్ బాలాచడీలోని సైనిక్ స్కూల్​లో తీసిన ఫొటోను మోదీకి బహూకరించారు మేజర్ అమిత్. అప్పట్లో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తమ పాఠశాలకు వచ్చి, విద్యార్థులతో ముచ్చటించిన విషయాన్ని గుర్తు చేశారు. మరో విద్యార్థితో కలిపి అమిత్​కు మోదీ షీల్డ్​ అందించడాన్ని ఆ ఫొటోలో చూడొచ్చు.

modi diwali with soldiers
మేజర్ అమిత్​తో మోదీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.