ETV Bharat / bharat

'వరదలతో మూడు రోజులు నరకం చూశాం'

author img

By

Published : Feb 11, 2021, 7:39 PM IST

వారంతా కూలీలు. పొట్టచేత పట్టుకుని తలోపని చేసుకుని బతుకుదామని ఉత్తరాఖండ్​​లోని చమోలీ జిల్లాకు వచ్చారు. హఠాత్తుగా వచ్చిన వరదలతో మూడు రోజుల పాటు నరకం చూశారు. ఎముకలు కొరికే చలిలో, వరద భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతికారు. కుటుంబ సభ్యులకు క్షేమ సమాచారం అందించడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని వాపోయారు.

'Missing' workers found stranded at a village cut off after U'Khand floods
'వరదలతో మూడు రోజులు నరకం చూశాం'

ఇటీవల ఉత్తరాఖండ్​ చమోలీ జిల్లాలో జరిగిన జల ప్రళయంలో గల్లంతయ్యారనుకొన్న ఒక బృందం మూడు రోజులు మృత్యువుతో పోరాడి బయట పడింది. స్థానికంగా ఉండే రైనీ గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్​ వద్ద తలదాచుకున్నవారు.. నిద్రాహారాలు లేక ప్రాణభయంతో కొట్టుమిట్టాడారు. తాము బతికి ఉన్న విషయం కుటుంబ సభ్యులకు చెప్పాలంటే.. ఫోన్​కు సిగ్నల్ కూడా లేకుండాపోయింది.

మూడు రోజులు నరకం..

మంచు చరియలు విరిగిపడి, ఆకస్మిక వరద పోటెత్తడం కారణంగా అనేక మంది ఆచూకీ గల్లంతైంది. సరిహద్దు ప్రాంతాల్లో కూలి పని చేసి బతుకుదామని వచ్చిన వారికి విపత్తు శాపంగా మారింది. ఈ వరద ప్రభావంతోనే.. మూడు రోజుల పాటు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయని బాధితులు తెలిపారు. కనీసం తినడానికి తిండి కూడా లేకుండా ఉన్న పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.

"ఓ సంస్థకు చెందిన మొబైల్​ టవర్​ను నిర్మించడానికి మేం ఓ మారుమూల గ్రామంలోకి వెళ్లాం. అప్పుడే మాకు వరదల గురించి తెలిసింది. మేం ఉన్న ప్రాంతం నుంచి గ్రామం కూడా చాలా దూరంగా ఉంది. అక్కడి వారిని సంప్రదించడానికి కష్టం అయ్యింది. చివరికి ఎలాగోలా చేరుకున్నాం."

-సన్నీదత్, బాధితుడు​

ఆచూకీ తెలియక.. పోలీసులకు ఫిర్యాదు

బాధితుల సమాచారం తెలియకపోవడంతో వరదల్లో కొట్టుకుపోయారు అని భావించారు వారి కుటుంబసభ్యులు. పోలీసులను ఆశ్రయించి.. కనిపించలేదని ఫిర్యాదు చేశారు. ఈలోగా బాధితులు రైనీ గ్రామంలో ఉండే అధికారులతో మాట్లాడి.. వారి వివరాలు తెలియపరిచారు. ఐటీబీపీ సిబ్బంది, అధికారుల చొరవతో కుటుంబసభ్యులతో మాట్లాడారు. క్షేమ సమాచారం తెలియజేశారు. వరదలతో కొట్టుకుపోయిన బ్రిడ్జ్​లను యుద్ధప్రాతిపదికన నిర్మించగా.. జోషీమఠ్​ కలెక్టర్​ కుమ్​కుమ్​ జోషీ ఆదేశాల మేరకు వారికి భోజనం, ఇంటికి చేరుకునేందుకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేశారు.

"మా ఫోన్లు కలవలేదు. మేం తప్పిపోయాం అనుకొని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పిపోయినట్లుగా ప్రకటించారు. తరువాత మేం తిరిగి ఫోన్​ చేసిన తరువాత వారి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది."

-కామీందర్​, బాధితుడు

ఉత్తరాఖండ్​లో మంచు చరియలు, నదీ ప్రవాహం సృష్టించిన విలయంలో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు నాలుగో రోజు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు 32 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా 174 మంది ఆచూకీ తెలియలేదు.

ఇదీ చూడండి: ఆటంకాలు ఎదురైనా.. జోరుగా సహాయక చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.